ఆ జీవితమే శాశ్వతం

ABN , First Publish Date - 2021-07-23T05:30:00+05:30 IST

‘విశాలమైన ఈ భువనమంతా ఒక పురాతన పాంథశాల’ అన్నారు ఒక మహాకవి. ఎంతటి రాజులైనా,

ఆ జీవితమే శాశ్వతం

‘విశాలమైన ఈ భువనమంతా ఒక పురాతన పాంథశాల’ అన్నారు ఒక మహాకవి. ఎంతటి రాజులైనా, మహనీయులైనా... సత్రంలో విడిది చేసినట్టు ఈ ప్రపంచంలో కొంతకాలం ఉండి, తరువాత ఖాళీ చేసి వెళ్ళిపోవాల్సిందే. వారు పోయిన తరువాత మిగిలేది వారు చేసిన మంచి కార్యాలు మాత్రమే. మానవుడు ఈ లోకంలో ఎంతకాలం జీవించాడని కాదు, తన పనులతో ఎంత ఆదర్శప్రాయుడయ్యాడనేదే ప్రధానం. కదలలేని చెట్టు మనకు నీడను ఇస్తుంది, ఫలాలను అందిస్తుంది. ఎండిపోయిన తరువాత కూడా ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది. జీవికి మరణం సహజం.


కాబట్టి, ‘చావు ఎప్పుడో వస్తుంది కాబట్టి చేయాల్సిన మంచి పనుల సంగతి తరువాత చూడొచ్చు’ అనే కాలయాపన చేయకూడదు. ఈ భూమిపై ఉన్న కొద్దికాలంలోనే దైవభక్తి కలిగి, సత్కార్యాలకోసం సమయాన్ని వినియోగించుకోవడం మానవులకు ఉన్నతమైన లక్ష్యం కావాలి. దైవభక్తి లోపించినప్పుడు, మరణానంతర జీవితం అంటే ఏమిటో తెలుసుకోలేనప్పుడు మానవత్వం నశిస్తుంది. 


దేవుని కారుణ్య గుణం పరిపూర్ణ రూపంలో కనిపించే రోజు, అంతంకాని మరో జీవితానికి నాంది పలికే రోజు ఒకటి ఉంటుంది. అదే తీర్పు చెప్పే రోజు. దేవునిపై విశ్వాసం ఉంచి, దైవ కార్యాల కోసం, మంచి పనుల కోసం పరితపించి, కష్టించే వ్యక్తులపై దైవం తన కరుణాపూరిత కాంతిధారలను ప్రసరింపజేస్తాడు. దేవుడు ప్రసాదించిన వాటిని దుర్వినియోగం చేసి, రాబోయే శాశ్వత జీవితం గురించి ఏ మాత్రం ఆలోచించని వారి పరిస్థితి ఎంతో హీనంగా ఉంటుంది.


‘‘శాశ్వత జీవితానికి సంబంధించిన ఏర్పాట్లు ఈ ప్రాపంచిక జీవితంలోనే జరుగుతాయి’’ అని అంతిమ దివ్య ఖురాన్‌ బోధిస్తోంది. దాన్ని నిరాకరించినవారు కోరికలకు బానిసలైపోతారు. నిష్టాపరులను, దైవం పట్ల భీతి ఉన్నవారినీ చూసి వారు హేళన చేస్తారు. తమ తప్పిదం ఏమిటో మృత్యువు సమీపించినప్పుడు వారు తెలుసుకుంటారు. ‘‘ప్రాపంచిక జీవితం ఒక ఆట, తమాషా తప్ప మరేదీ కాదు. భయభక్తులు కలిగినవారికి పరలోకం ఎంతో మేలైనది’’ అని దివ్యఖుర్‌ఆన్‌లో అల్లాహ్‌ స్పష్టం చేశారు. పరలోకంలోని జీవితమే శాశ్వతం. దానికి పునాదులను ఈ లోకంలో వేసుకోవాలి. ఈ ప్రపంచంలో ఉన్నంతవరకూ మంచి పనులు చేస్తూ, దేవుని ప్రీతికి పాత్రులు కావడానికి కృషి చేయాలి.

 మహమ్మద్‌ వహీదుద్దీన్‌


Updated Date - 2021-07-23T05:30:00+05:30 IST