ఆ స్థలం నాది.. బడీ నాదే!

ABN , First Publish Date - 2022-07-05T07:27:49+05:30 IST

ఆ స్థలం నాది.. అందులో కట్టిన బడి భవనమూ నాదే అంటున్నారు పాఠశాల కమిటీ పూర్వ చైర్‌పర్సన్‌ భర్త.

ఆ స్థలం నాది.. బడీ నాదే!
ఫ్లకార్డులతో నిరసన తెలుపుతూ..

పాఠశాల కమిటీ పూర్వ చైర్‌పర్సన్‌ భర్త అడ్డగింపు

పెరుమాళ్లపల్లెలో పూర్వ విద్యార్థులు, ప్రజాప్రతినిధుల నిరసన 

వెదురుకుప్పం, జూలై 4: ఆ స్థలం నాది.. అందులో కట్టిన బడి భవనమూ నాదే అంటున్నారు పాఠశాల కమిటీ పూర్వ చైర్‌పర్సన్‌ భర్త. బడి ఆవరణలో పశువులనూ కట్టేశారంటున్నారు గ్రామస్తులు. ఈ క్రమంలో బడిని రక్షించాలంటూ పూర్వ విద్యార్థులు, ప్రజాప్రతినిధులు నిరసనకు దిగిన ఘటన సోమవారం వెదురుకుప్పం మండలం పెరుమాళ్లపల్లెలో చోటుచేసుకుంది. గ్రామస్తులు చెప్పిన ప్రకారం.. పెరుమాళ్లపల్లెలోని ప్రాథమిక పాఠశాల భవనానికి 2005లో ప్రభుత్వం నిధులు కేటాయించింది. అప్పట్లో ఆ పాఠశాల కమిటీ చైర్‌పర్సన్‌గా బోడిరెడ్డి చెంగల్రాయరెడ్డి భార్య జగద ఉన్నారు. ఈ నేపథ్యంలో సర్వే నంబరు 108/2ఎలో నలిపిరెడ్ది చెంగారెడ్డి నుంచి 17 సెంట్లు, కానాల రాజారెడ్డి, చంద్రారెడ్ది అన్నదమ్ముళ్ల నుంచి సర్వే నంబరు 108/1లో 12 సెంట్లు పాఠశాలకు వితరణగా అప్పట్లో స్థలం తీసుకున్నట్లు సమాచారం. మిగతా ఆరు సెంట్లను జగద భర్త చెంగల్రాయరెడ్డి ఇచ్చారు. కాగా, చైర్‌పర్సన్‌గా ప్రభుత్వ నిధులతో పాఠశాల భవన పనులను పూర్తి చేశారు. ఇన్నేళ్ల తర్వాత.. ఆ పాఠశాల స్థలమంతా తనదేనంటూ చెంగల్రాయరెడ్డి ముందుకొచ్చారు. వేసవి సెలవుల్లో పాఠశాల ఆవరణలో పశువులను కట్టేశారని స్థానికులు తెలిపారు. మంగళవారం నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో బడి స్థలం ఎవరిదో తేల్చాలంటూ పూర్వ విద్యార్థులు, తల్లిదండ్రులు, ఎంపీటీసీ తోకలమురళీరెడ్డి, సర్పంచ్‌ శశిఆనందరెడ్డి, మాజీ సర్పంచ్‌ బోడిరెడ్ది హనుమంతరెడ్డి రంగంలోకి దిగారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ప్లకార్డులతో బైఠాయించారు. పాఠశాల ఆవరణ ముందుభాగంలో టెంట్‌ వేసి పాఠశాల స్థలం చూపించాలని డిమాండు చేశారు. పాఠశాల స్థలం కాకపోతే అక్కడ ప్రభుత్వ నిధులతో నిర్మాణాలు ఎలా చేశారని ప్రశ్నించారు. ఆ మొత్తాన్ని రికవరీ చేయాలన్నారు. దీనిపై డిప్యూటీ సీఎం నారాయణస్వామికి సమాచారం చేరవేశారు. పెరుమాళ్లపల్లె పాఠశాల సమస్య తీర్చాలని ఆయన జిల్లా ఉన్నతాధికారులను ఆదేశించినట్లు తెలిసింది. డీఈవో పురుషోత్తం, ఎంఈవో మంచికాయల విజయకుమార్‌, వీఆర్వో రాజగోపాల్‌ బడి వద్దకు చేరుకున్నారు. స్థానికులతో మాట్లాడారు. తహసీల్దార్‌, ఎంఈవో కలసి మంగళవారం సమస్యను పరిష్కరించాలని డీఈవో పురుషోత్తం పేర్కొన్నారు. లేని పక్షంలో అప్పటి కమిటీపై చర్యలకు సిఫార్సు చేస్తామని హెచ్చరించారు. బడి పిల్లలకు ఇబ్బందులు కలిగించడం మంచి పద్ధతి కాదన్నారు. అప్పట్లో స్థలం ఇచ్చిన దాతలతో పాటు స్థానికులతో పాఠశాల విషయమై చర్చించారు.

ఇంతకీ బాధ్యులెవరు..?

ఈ పాఠశాల నాదంటూ పాఠశాల కమిటీ పూర్వ చైర్‌పర్సన్‌ భర్త ఇప్పుడు రావడానికి కారణం ఏమిటి? అప్పట్లో పాఠశాలకు స్థలం రాయించుకోకుండా భవన నిర్మాణం ఎలా చేపట్టారు? నిధులు కేటాయింపునకు సహకరించిందెవరు? ఒకవేళపాఠశాల స్థలం ఆ పూర్వ చైర్‌ర్సన్‌ భర్తదే అయితే విద్యార్థుల పరిస్థితి ఏంటన్న ప్రశ్నలు వస్తున్నాయి. దీనిపై ప్రభుత్వ యంత్రాంగం స్పష్టత ఇవ్వాల్సి ఉంది. 

Updated Date - 2022-07-05T07:27:49+05:30 IST