ఆ శైలీ విన్యాసమే ఒక సాహితీ విప్లవం

Published: Mon, 25 Jul 2022 00:31:16 ISTfb-iconwhatsapp-icontwitter-icon
ఆ శైలీ విన్యాసమే ఒక సాహితీ విప్లవం

‘‘నేను తెలుగువాణ్ణి. వర్గాలంటే నాకు తెలీవు. వాటిని జాతులూ, కులాలూ అంటాను. పై జాతులూ, పై కులాలూ కిందివారిని ఎప్పుడూ అణచాలని చూస్తాయి. మనుషులు మూడు రకాలు. దొంగలు, దొరలూ, మామూలు వాళ్ళు. కరివేప మొక్కయినా, మర్రిమొక్కయినా నేలలోంచి సారం పీల్చి బతకవలసిందే. అలాగే దొంగలూ దొరలూ మామూలు వాళ్ళని తిని బతుకుతారు. దొంగలు దొరక్కపోతే దొరలవుతారు. చట్టాలను తమకనుకూలంగా మార్చుకుని సమాజంలో ఘరానాగా చెలామణీ అవుతారు. కానీ మామూలు జనమే అన్నిటికీ పునాది. చాకిరీ చేసేది వాళ్లే. వాళ్ళు కష్టపడుతుంటేనే మనం సుఖపడతాం. మనం కూర్చున్న చోటినుంచి కదలకుండా ఉండాలంటే మనకు చాకిరీ చేసే వాళ్ళుండాలి’’ - రావిశాస్త్రి 1973లో రాజమండ్రిలో జరిగిన పౌరహక్కుల సభలో చెప్పిన మాటలివి. ఈ మాటలు ఈయన దృక్పథాన్నీ, ఆలోచనా విధానాన్నీ బాగా పట్టిస్తాయి.


కథలూ నవలలూ నాటకాలూ రాయడం ద్వారా రావిశాస్త్రి రకరకాల బాధితుల వేదనని చిత్రించాడు. దరిదాపూ 60 కథల్ని రాశాడు. అలాగే ‘అల్పజీవీ’, ‘రత్తాలు-రాంబాబు’, ‘రాజు-మహిషి’, ‘ఇల్లు’, ‘మూడు కథల బంగారం’, ‘సొమ్ములు పోనాయండీ’, ‘గోవులొస్తున్నాయి జాగ్రత్త’ లాంటి నవలలు వచ్చాయి. ‘నిజం’, ‘తిరస్కృతి’, ‘విషాదం’ అనే నాటకాలుగానూ పుస్తకాలు వచ్చాయి. వీటిల్లో సమాజపు అట్టడుగున ఉంటూ అన్ని రకాలుగా తొక్కిడికి గురైనవాళ్లే తరచూ కనపడుతూ వుంటారు. కూలీలూ; ఒళ్లమ్ముకు బతికేవాళ్ళూ; న్యాయ పోలీసు వ్యవస్థల చేతుల్లో నిత్యం పీడనకు గురయ్యే పేదజనం; భూస్వాముల దౌష్ట్యానికీ వ్యాపారుల మాయకూ బలయ్యే బలహీనులూ వీరందరి తరఫున మొత్తం వ్యవస్థ దుర్మార్గాన్నీ, దౌర్జన్యాన్నీ, దివాళాకోరుతనాన్నీ కడిగిపారేయటం రావిశాస్త్రి సాహిత్యంలో కనిపించే ప్రత్యేకత. ఇక్కడే ఇతర సీరియస్‌ రచయితలు సృష్టించిన సాహిత్యం కంటే రావిశాస్త్రి విభిన్నత మనకు కొట్టొచ్చినట్లు కనిపించేది.


శ్రామికుల, బలహీనుల, గురించి రావిశాస్త్రి మాత్రమే రాయ లేదు. ఆయనకంటే ముందు నుంచే ఈ రకమైన ఇతివృత్తాలు రాసినవారూ, అట్టడుగు భాషను వాడినవారూ మనకు వున్నారు. కరుణకుమార, మా గోఖలే రాసిన కథలు అందుకు మంచి ఉదాహరణలు. రౌడీలూ, గజదొంగలూ, తాగుబోతులూ, కేడీలూ, అమ్మాయిల కంపెనీలు నడిపేవాళ్ళూ, వ్యభిచారులూ లాంటి ప్రత్యేక జీవుల్నీ, వారి జీవిత ఘర్షణల్నీ, వత్తిడుల్నీ సాహిత్య సృజనలోకి పట్టుకు రావడం అరుదైన విషయమే అయినప్పటికీ, అంతకన్నా ముఖ్యమైనది ఆయన రచనా సంవిధానం. కథలో గానీ, నవలలో గానీ ఇతర సాహిత్య ప్రక్రియల్లో కానీ రావిశాస్త్రి ప్రత్యేకత మనకు కొట్టొచ్చినట్లు కనిపించేది ఆయన నిర్మించిన శైలీ శిల్పాలలోనే. సృజనాత్మక రచనలో పెను కదలిక తేవడానికీ, తన తరువాతి తరాల కథకుల్ని తప్పించుకోలేని ప్రభావానికి గురిచేయడానికీ కారణం ఆయన వ్యక్తీకరణ విధానమే. బీనాదేవి, పతంజలి, భూషణం లాంటి క్వాలిటీ రచయితలు రావిశాస్త్రి వస్తువు కంటే శిల్పాన్ని అనుసరించిన విషయం అందరికీ తెలుసు. కొడవటిగంటి కుటుంబరావు ప్రకారం, ‘‘కథా రచనలో ఒక కొత్తమార్గం నిర్మించిన కీర్తి రాచకొండ విశ్వనాథ శాస్త్రికి దక్కుతుంది. ఆయన చేతిలో కథానిక కావ్యమయింది. కథనం కావ్యం స్థాయి నందుకుంది. సంసారపక్షంగా జీవితం ఈడ్చుకొ స్తున్న తెలుగు కథాకన్య కళ్ళు జిగేలుమనే సౌందర్యాకర్షణలను సంతరించుకుంది’’. చార్లీ చాప్లిన్‌ సినిమాలలోలాగా, పికాసో సృష్టించిన ‘గుయెర్నికా’లోలాగా, డికెన్స్‌ ఫిక్షన్‌లోలాగా ఏక కాలంలో నవ్వూ ఏడుపూ, ఆశ్చర్యమూ, భయమూ కలిగించే సృజన విధానం రావిశాస్త్రిలో ఉందని శ్రీశ్రీ కూడా అంటాడు. వస్తు గంభీరత విషయంలో, దృక్పథ స్పష్టత విషయంలో, విశ్లేషణా విస్తృతి విషయంలో, కారా, చాసోలను మించి రావిశాస్త్రి సాధించింది తక్కువే. రచనా సంవిధాన విషయంలో మాత్రం అతనిదొక విప్లవమే. సృజన విధానంలో తన విభిన్నతనూ విశిష్టతనూ తానే ఒక సందర్భంలో ఇలా చెబుతాడు రావిశాస్త్రి: ‘‘కాళీపట్నం రామారావుగారూ, బలివాడ కాంతారావుగారూ ఒకరకం రచయి తలు. నేను మరో రకం రచయితను. వాళ్ళు వస్తువుకే ప్రాధాన్య తనిస్తారు. నేను చమక్కులు కూడా చొప్పిస్తాను. చమ్కీ నుంచి వచ్చిందే చమక్కు. చమక్కులు చూపించినందుకు కొందరు నన్ను భూషించారు, కొందరు నన్ను దూషించారు. ఈ చమ క్కులు నాకు సహజంగా వచ్చాయి’’. అయితే చక్కగా చెప్పట మొక్కటే ప్రధానం కాదనీ, చక్కగా ఏం చెబుతున్నామన్నదే ప్రధానమని కూడా అంటాడు. 


1988లో ‘ఉదయం’ దిన పత్రిక కోసం త్రిపురనేని శ్రీనివాస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో, ‘‘పాఠకుణ్ణి ఎలా ఆకర్షించాలి అన్న విష యం గురించి నేను ఆలోచిస్తాను. వంద కథల్లో మన కథని చదివించాలి గదా. అందుకోసం తంటాలు పడేవాడినేమో’’ అంటాడు రావిశాస్త్రి. అలాగే తనమీద చాల్స్‌ డికెన్స్‌ ప్రభావం ఉందని చెబుతూ అతని రచనా విధానంలో ‘‘గొప్ప splendour (శోభ, వైభవం) ఉంది. అది ఒక విధ మైన experience. ఎన్నెన్నో గొప్ప emoticonsని ఆయన అతిసులువుగా చెప్పేయగలడు. నాపై చిన్నప్పటినుండీ డికెన్స్‌ influence ఉంది’’ అని చెబు తాడు. తన మీద చెహోవ్‌, ఓ. హెన్రీల ప్రభా వమూ వున్నట్లు ఆయన చెప్పిన సందర్భాలు ఉన్నాయి. రావిశాస్త్రి సాహిత్యం మీద పరి శోధన చేసిన తాటి శ్రీకృష్ణ వస్తురూపాలలో దేనికి ప్రాధాన్యతనివ్వాలంటారు అని ఆయన్ని అడిగినప్పుడు తన సమాధానం చూడండి: ‘‘చెప్పే విధానంలో ఒక ఆకర్షణ ఉండాలి. అయస్కాంత ఆకర్షణలా హృదయానికి హత్తుకుపోయే ప్రత్యేకత ఉండాలి. అయితే రచయిత ఎలా చెబుతున్నాడు అనే దానికంటే ఏమి చెబుతున్నాడు అనే దానికి ప్రాముఖ్యత నివ్వాలి.’’


తన రచనా విధానం మీద సంకు పాపారావు అనే మిత్రుడి చమత్కారపూరిత వాక్చాతుర్య ప్రభావమూ ఉందని రావిశాస్త్రి ‘ఉదయం’ ఇంటర్వ్యూలో తెలిపాడు. అందుకు కొన్ని ఉదాహరణలు కూడా ఇచ్చాడు. ‘‘క్యూబాలో racial discrimination లేదనీ తెల్లవాళ్ళకీ నల్లవాళ్ళకీ, రెడ్‌ ఇండియన్లకీ మధ్య యథేచ్ఛగా పెళ్లిళ్లు జరిగిపోతూ వుంటాయని ఒకసారి ఎవరో చెప్పారు. దాని మీద ‘అహా అలా సెప్పండి. అందుకే అక్కడ రేస్‌ కాక్‌ టెయిల్‌ దిగింది’ అన్నాడు పాపారావు. విషాదం అనే నాటికలో నేను దాన్ని వాడుకున్నాను కూడా. అయితే acknowledge చెయ్యలేదు. పాపారావు జోకుల్లో acknowledge చెయ్యకుండా వాడుకున్నది అదొక్కటే’’ అని గుర్తు చేసుకున్నాడు రచయిత. చివరి రోజుల్లో పాపారావు కాలు తీసేయవలసి వచ్చింది. అప్పుడు ‘‘చైనాలో చూటే ఒంటి కన్నుతో ఫైటింగ్‌ సెయ్యనేదా? అలాగే ఒంటి కాలుతో ఫైటింగ్‌ సేస్తాను’’ అంటాడు పాపారావు. బాగా మందుకొట్టేవాడి గురించి, ‘‘అడు పడవా? కాదు. లాంచీయా? కాదు, ఆయిల్‌ టాంకరే’’ అంటాడట పాపారావు. ఇది కాక మామూలు జనం మాటల్లో దొర్లే చమక్కుల్ని కూడా రావిశాస్త్రి పట్టుకున్నాడు. ఒక సందర్భంలో మాటూరి తాత అనే పాలి కాపు వెన్నెల్ని చూసి, ‘‘అహా ఎన్నెలా, కన్నతల్లీ, పేదోడి దీపమా’’ అన్నాడు. దాన్ని ఒక కథలో వాడుకున్నాడు రావిశాస్త్రి. ఒకసారి శాస్త్రిగారి మేనమామ ఇంట్లో ఒక పేదరాలు తన కష్టాల్ని చెప్పు కుంటూ, ‘‘నాకు దికెవరున్నారు బాబూ. దరణి బూదేవి, ఆపైన దేముడు, ఆ ఎనక తమరిలాంటి మారాజులు’’ అన్నది. కవితాత్మ కంగా ఆమె అన్న మాటల్ని కూడా ఒక కథలో వాడుకున్నాడు. 


ఇలాంటి అంశాలన్నీ రావిశాస్త్రి రచనావిధానపు విశిష్టతను బయటపెట్టేవే. వీటినిమించి, కొ.కు. అన్నట్లు రావిశాస్త్రి తన శిల్పం, శైలి ద్వారా వచన రచనని కావ్య రచన స్థాయికి తీసుకెళ్లాడు. కథనంలో ఆయన చేసిన వర్ణనలూ, సంభాషణల్లో ఆయన వాడిన చమత్కార చాతుర్యం, పాత్ర చిత్రణ, సన్నివేశాలలోని డ్రామా, కవితా శైలీ, కిక్కిరిసిన అలంకార ప్రయోగం, వడి వడిగా పరుగులు తీసే వాక్యాల వాడితనం, వ్యంగ్యం, హాస్యం - ఇవన్నీ కలిసి శోభాయమానంగా వెలిగే ఆకర్షణీయమైన శక్తి వంతమైన వ్యక్తీకరణనూ, రచనావిధానాన్నీ ఉత్పన్నం చేయగలి గాయి. ఈ విధానమే రావిశాస్త్రిని ఇతర సృజనకారుల నుంచి విభిన్నంగా ఉన్నతంగా నిలబెట్టింది. రావిశాస్త్రి రచనల్ని వేటిని తీసుకున్నా ఈ ఉత్కృష్ట రచనా సంవిధానం కనిపిస్తుంది. ఉదాహరణకు, ‘మాయ’ కథలో పేద ముత్తేలమ్మ గురించి వర్ణిస్తూ రావిశాస్త్రి వచనానికీ కవిత్వానికీ మధ్య సరిహద్దుల్ని చెరిపేస్తాడు: ‘‘ఆమెకు ముప్పయ్యేండ్లుండొచ్చు. ఒకప్పుడామె అందంగా ఉండుం టుంది. పెద్దకొప్పుని ఒకప్పుడు ముడుచుకొని ఉండుంటుంది. ఆమె కట్టుకున్న నల్లకోక ఒకప్పుడు, అప్పుడెప్పుడో కొత్తదయ్యుంటుంది. చాలా రోజుల కిందట చాలా సార్లు భోంచేసి ఆమె ఆరోగ్యంగా ఉండి ఉంటుంది’’. - టెర్రిఫిక్‌ డిస్ర్కిప్షన్‌ ఇది. ప్రస్తుతం ఆమె ఎంత దీనస్థితిలో ఉందో చెప్పటానికి గతాన్ని ఆశ్రయించే ఈ టెక్నిక్‌ పోయెటిక్‌ టెక్నిక్‌. ఇక ముత్తేలమ్మ చేత పలికించిన లోక రీతీ నీతీ మీది మాటలు- సాహితీ ప్రపంచంలో అత్యంత గొప్ప ప్రసంగాలలో ఒకటిగా నిలిచిపోతుంది. 


రావిశాస్త్రి భావాలు నచ్చనివాళ్ళు కూడా ఆయన సాహిత్యాన్ని చదివి ఆస్వాదించడంలో ఆయన శిల్ప చమకృతి, శైలీ విన్యాసాలే ప్రధాన భూమికను పోషించాయి. రావిశాస్త్రి మార్కు ఆయన వస్తువు కంటే, రచనా సంవిధానంలోనే ఎక్కువగా కనిపిస్తుంది. అదే ఆయన తెలుగు సాహిత్యానికి సమకూర్చిన అదనపు చేర్పు. 

(జూలై 30, 2022 రావిశాస్త్రి శతజయంతి)

జి. లక్ష్మీనరసయ్య

98494 08204

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

ప్రత్యేకంLatest News in Teluguమరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.