అదే బెడద

ABN , First Publish Date - 2022-08-18T05:13:01+05:30 IST

ఏ ఇద్దరు ఉపాధ్యాయులు కలిసినా ఒకే మాట.

అదే బెడద
ప్లీజ్‌ వెయిట్‌ అని చూపిస్తున్న అటెండెన్స యాప్‌

  1. రెండో రోజూ ఉపాధ్యాయులకు యాప్‌ ఇబ్బంది  
  2.  సర్వర్‌, నెట్‌ వర్క్‌ సమస్యలతో అవస్థలు
  3.  యాప్‌ విధానంపై ఉపాధ్యాయుల్లో తీవ్ర వ్యతిరేకత

నంద్యాల (నూనెపల్లె), ఆగస్టు 17: ఏ ఇద్దరు ఉపాధ్యాయులు కలిసినా ఒకే మాట.  ‘మీరు యాప్‌ డౌన లోడ్‌ చేసుకున్నారా? రిజిస్టర్‌ అయ్యారా?, సరిగా పనిచేస్తోందా?’ అనే.   రెండు రోజులుగా ఉమ్మడి జిల్లా ఉపాధ్యాయుల మధ్య ఇదే చర్చ. యాప్‌ ద్వారా హాజరు విధానం అమలులోకి వచ్చిన రెండో రోజు బుధవారం కూడా ఉపాధ్యాయులు నానా ఇబ్బందులుపడిపోయారు. విధులకు  సమయానికి వచ్చినా కూడా  రానట్లు యాప్‌  చూపిస్తే ఏమిటి గతి? అని ఆందోళనపడుతున్నారు. ఇంతకూ ఏ ప్రయోజనం కోసం ప్రభుత్వం ఈ విధానం తీసుకొచ్చిందో వారికి అంతుపట్టడం లేదు.  ముఖ ఆధారిత హాజరు నమోదు విధానం తీసుకొస్తూ  ప్రభుత్వం యాప్‌ను ప్రవేశపెట్టింది. అయితే సర్వర్‌ సమస్య కారణంగా మొదటి రోజులాగే రెండో రోజూ ఉపాధ్యాయులకు  ఇబ్బందులు తప్పలేదు.  గతంలో బయోమెట్రిక్‌, ఐరిష్‌ ద్వారా హాజరు విధానం ఉండేది. దాని బదులు ప్రభుత్వం ఇప్పుడు సెల్ఫీ ఆధారంగా హాజరు నమోదుకు శ్రీకారం చుట్టింది.  

ఉపాధ్యాయుల హాజరుకు సంబంధించి ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త యాప్‌ విధానంలో  సొంత సెల్‌ ఫోనలో పూటకు మూడు సెల్ఫీలు తీసుకోవాలి.   అవి ఒక ఫొటోగా రిజిసే్ట్రషన అవుతుంది. రిజిసే్ట్రషన కూడా ప్రధానోపాధ్యాయుడి వద్ద, స్కూల్‌ కాంప్లెక్స్‌ పరిధిలోనే చేసుకోవాలి. చాలాచోట్ల నెట్‌వర్క్‌, సర్వర్‌ సమస్యలు తలెత్తుతున్నాయి. దీంతో ఉపాధ్యాయులు గందరగోళానికి గురవుతున్నారు.

రోజుకు రెండుసార్లు హాజరు  

ఉపాధ్యాయులు రోజుకు రెండుసార్లు హాజరును తప్పనిసరిగా నమోదు చేసుకోవాలి. ఉదయం 8గంటల నుంచి 9వరకు యాప్‌ వెబ్‌సైట్‌ అందుబాటులో ఉంటుంది. ఈ సమయంలోనే ఉపాధ్యాయుడు సెల్ఫీ నమోదు చేసుకోవాలి. 9గంటల తరువాత ఒక్క నిమిషం ఆలస్యమైన యాప్‌ క్లోజ్‌ అవుతుంది. పాఠశాలలో తప్ప యాప్‌ ఎక్కడా పనిచేయదు. నిర్దేశిత సమయంలోపు నమోదు చేయకపోతే సెలవులో ఉన్నట్లుగా పరిగణిస్తారు. తిరిగి సాయంత్రం 4గంటల నుంచి 5గంటలలోపు పాఠశాలలోనే మరోసారి సెల్ఫీ తీసుకొని హాజరు నమోదు చేయాలి. 5 గంటల తరువాత వెబ్‌సైట్‌ క్లోజ్‌ అవుతుంది. అయితే యాప్‌ను వ్యతిరేకిస్తున్న చాలామంది ఉపాధ్యాయులు రిజిస్టర్‌ చేసుకోలేదు. వీరు పాఠశాల రిజిస్టర్‌లో సంతకం చేస్తున్నారు. వీరితో పాటు రిజిస్టర్‌ చేసుకున్న ఉపాధ్యాయులకు సర్వర్‌ బీజీతో హాజరు నమోదు కాక పాఠశాల రిజిస్టర్‌లో సంతకాలు చేస్తున్నారు. 

ఉమ్మడి జిల్లాల్లో పరిస్థితి ఇలా.. 

ముఖ ఆధారిత హాజరు నమోదును ఉమ్మడి జిల్లాలోని ఉపాధ్యాయులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కర్నూలు, నంద్యాల జిల్లాల పరిధిలో వివిధ స్థాయిలోని 2354ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో కర్నూలు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో 7697 మంది ఉపాధ్యాయులు ఉండగా, 2175మంది మాత్రమే రిజిస్టర్‌ చేసుకున్నారు. నంద్యాల జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో 6299 మంది ఉపాధ్యాయులకు గాను, 2767 మంది రిజిస్టర్‌ చేసుకున్నారు. రిజిసే్ట్రషనలో రాష్ట్ర స్థాయిలో నంద్యాల 43 శాతంతో 5వ స్థానంలో ఉండగా, కర్నూలు 28వ శాతంతో 19వ స్థానంలో ఉంది. 

వ్యతిరేకిస్తున్న ఉపాధ్యాయ సంఘాలు:

ప్రభుత్వం ఉపాధ్యాయుల హాజరు విధానంపై నూతనంగా ప్రవేశపెట్టిన యాప్‌ విధానాన్ని ఉపాధ్యాయ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. సంఘాలతో చర్చించకుండా ఉపాధ్యాయులపై కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఇలాంటి యాప్‌లను ప్రవేశపెట్టి ఉపాధ్యాయులను మానసికంగా వేధించడం ప్రభుత్వానికి పరిపాటిగా మారిందని వాపోతున్నారు. నాణ్యమైన బయోమెట్రిక్‌ యంత్రాలు మంజూరు చేయకుండా సొంత సెల్‌ఫోన్లలో యాప్‌లను డౌనలోడ్‌ చేసుకొని నమోదు చేసుకోవాలని ఆదేశించడం సమంజసం కాదని మండిపడుతున్నారు. 

బోధనకు తీవ్ర అంతరాయం 

- సోమేశుల చంద్రశేఖర్‌, ఎస్టీయూ రాష్ట్ర సహాధ్యక్షుడు, నంద్యాల

ముఖ ఆధారిత హాజరు నమోదుకు సంబంధించి పాఠశాలలకు నూతన పరికరాలను అందించకుండా ప్రభుత్వం హడావిడి చేయడం సరికాదు. ప్రభుత్వ ఉద్యోగులకు ఏ విధంగా అయితే హాజరు నమోదు ప్రక్రియ చేపడుతున్నారో, అదేవిధంగా ఉపాధ్యాయులకు కూడా వర్తింపజేస్తే ఇబ్బంది ఉండదు. లేనిపోని యాప్‌ల విధానాలతో సమయం వృథా అయి బోధనకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. ఒత్తిడి లేని వాతావరణాన్ని కల్పిస్తేనే బోధన మెరుగుపడుతుంది. 


ఒత్తిడి పెంచడం సరికాదు

 - కేవీ శివయ్య, ఏపీటీఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి, నంద్యాల

తరగతి గదుల్లో సెల్‌ఫోన వినియోగించకూడదనే నిబంధనలు ఉన్నాయి. ప్రభుత్వం తాజాగా ఎవరి సెల్‌ఫోనలో వారే ముఖ ఆధారిత హాజరు వేయాలని ఆదేశాలు జారీ చేయడంతో బోధనపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఉదయానే 9గంటలకు వెళ్లి హాజరు వేయడంపై ఎవరికి అభ్యంతరాలు లేవు. దీనికోసం ప్రత్యేకంగా పరికరాలను ఏర్పాటు చేయాలి. బోధనలో లోపాలుంటే పర్యవేక్షణను పెంచాలి. 

యాప్‌ను రద్దు చేయాలి

 - నగిరి శ్రీనివాసులు, ఏపీటీఎఫ్‌ 1938రాష్ట్ర కార్యదర్శి, నంద్యాల 

ఇప్పుడున్న యాప్‌లతోనే ఉపాధ్యాయులు ఒత్తిడికి గురవుతున్నారు. మళ్లీ ముఖ ఆధారిత యాప్‌ అంటూ ప్రవేశపెట్టడం సమంజసం కాదు. యాప్‌ను ప్రభుత్వం రద్దు చేయాలి. ఉపాధ్యాయులపై ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోంది. ఈ విధానాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. నాణ్యమైన బయోమెట్రిక్‌ యంత్రాలను, ఇంటర్నెట్‌ సౌకర్యాలను కల్పించినట్లయితే ఆనలైన హాజరు వేయడానికి ఉపాధ్యాయులు సిద్ధంగా ఉన్నారు. 

తప్పనిసరిగా నమోదు చేసుకోవాలి

 - వసుంధరాదేవి, డీఈవో, నంద్యాల

రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ ప్రవేశపెట్టిన ముఖ ఆధారిత హాజరు విధానాన్ని  ఉపాధ్యాయులందరూ  తప్పనిసరిగా పాటించాల్సిందే. యాప్‌ను డౌనలోడ్‌ చేసుకోకుంటే చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఏదైనా సమస్య ఉంటే విద్యాశాఖాధికారుల దృష్టికి తీసుకురావాలి. వాటి పరిష్కారానికి రాష్ట్ర అధికారులకు పంపించి సమస్య పరిష్కారానికి కృషి చేస్తాం. 


 

Updated Date - 2022-08-18T05:13:01+05:30 IST