కిరాతకుడు

ABN , First Publish Date - 2020-07-05T16:06:14+05:30 IST

సుదూర ప్రాంతానికి కారు కావాలంటే నిజమని..

కిరాతకుడు

బాడుగ కోసం అంటూ ట్యాక్సీ బుక్‌ చేసుకున్నాడు

దారి మధ్యలో సైనేడ్‌ కలిపిన మద్యం ఇచ్చి డ్రైవర్‌ను హత్య చేశాడు

గుంటూరు జిల్లా పోలీసులకు పట్టుబడిన నిందితుడు


తాటిచెట్లపాలెం(విశాఖపట్నం): సుదూర ప్రాంతానికి కారు కావాలంటే నిజమని నమ్మిన వ్యక్తిని దారిలోనే హత్య చేశాడో కిరాతకుడు. బాడుగకు దూర ప్రాంతానికి వెళ్లిన భర్త ఇక తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడన్న వార్తతో ఆమె కుప్పకూలిపోయింది. ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.


రామచంద్రనగర్‌కు చెందిన కోన లక్ష్మణ్‌, గోవిందమ్మ దంపతుల ఇద్దరి కుమారుల్లో పెద్దవాడు కోన వెంకటేశ్‌ (28). డిగ్రీ వరకు చదువుకుని మొదట ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేశాడు. స్వయం ఉపాధి సమకూర్చుకోవా లన్న ఉద్దేశంతో ఏడాది క్రితం బ్యాంకు రుణం తీసుకుని ట్యాక్సీ కొన్నాడు. దాన్ని అద్దెకు తిప్పుతూ కుటుంబానికి అండగా ఉండేవాడు. ఈనెల రెండో తేదీన ఉద్దగిరి అలేఖ్‌ అనే వ్యక్తి నుంచి వెంకటేశ్‌కు ఫోన్‌ వచ్చింది. శ్రీశైలం వెళ్లాలని సదరు వ్యక్తి చెప్పడంతో రూ.17 వేలకు బేరం కుదుర్చుకున్నాడు. పెద్ద బేరం దొరికిందన్న ఆనందంలో ఇంటికి కూడా రాకుండా భార్య లావణ్యకు ఫోన్‌లోనే సమాచారం అందించి అటు నుంచి అటే వెళ్లిపోయాడు. సాయంత్రం వరకు ఫోన్‌లో కుటుంబ సభ్యులతో మాట్లా డాడు. ఆ రోజు రాత్రి లావణ్య...భర్తకు ఫోన్‌ చేయగా స్విచ్ఛాఫ్‌ అని వచ్చింది. చార్జింగ్‌ అయిపోయిందేమో, ఉద యం మాట్లాడవచ్చులే అని ఆమె అనుకుంది. అయితే శుక్రవారం ఉదయం గుంటూరు పోలీసుల నుంచి పిడుగులాంటి వార్త తెలియడంతో కుటుంబ సభ్యులు దిగ్భ్రమకు గురయ్యారు.


మద్యంలో సైనేడ్‌ కలిపి హత్య

వెంకటేశ్‌ బాడుగకు తిప్పుతున్నది కొత్త కారు కావడంతో దాన్ని దొంగిలించేందుకు వ్యూహం పన్నిన నిందితుడు ఉద్దగిరి అలేఖ్‌ దారి మధ్యలో సైనేడ్‌ కలిపిన మద్యం వెంకటేశ్‌కు ఇచ్చాడు. అది తాగిన వెంకటేశ్‌ పడిపోగానే అతడి పీక నులిమి చంపేశాడు. అనంతరం శవాన్ని వెనుకసీట్లో పడుకోబెట్టి ఎక్కడైనా తుప్పల్లో పడేయాలన్న ఉద్దేశంతో కారు తాను డ్రైవ్‌ చేస్తూ ముందుకుపోసోగాడు. గుంటూరు జిల్లా కారంపూడి మండలం గురజాల వద్ద కారును ఆపిన పోలీసులు అనుమానం వచ్చి చెక్‌ చేశారు. వెనుక సీట్లో పడి వున్న వెంకటేశ్‌ను చూసి విషయం అడగగా...అతను డ్రైవర్‌ అని, మద్యం సేవించి పడిపోవడంతో తాను డ్రైవ్‌ చేస్తున్నానని చెప్పాడు. పోలీసులు అనుమానంతో అతడ్ని లేపే ప్రయత్నం చేసేలోగా నిందితుడు పరారయ్యేందుకు యత్నించడంతో వెంటాడి పట్టుకున్నారు. దీంతో హత్య విషయం బట్టబయలైంది.


అంతర్రాష్ట్ర నిందితుడు

నిందితుడు అలేఖ్‌ ఓ అంతర్రాష్ట్ర నిందితుడని, 2014 నుంచి ఇటువంటి దారిదోపిడీలు, దొంగతనాలకు పాల్పడుతున్నాడని పోలీసులు విచారణలో గుర్తించారు. అతన్ని అరెస్టు చేసి కేసు నమోదుచేశారు. ఇప్పటివరకు ఏఏ నేరాలు చేశాడన్న దానిపై ఆరాతీస్తున్నారు.  


22 నెలల క్రితమే పెళ్లి

వెంకటేశ్‌కు రెండేళ్ల క్రితం పెళ్లయింది. అతని భార్య లావణ్య నగరంలోని 45వ వార్డు వలంటీర్‌గా పనిచేస్తోంది. భర్త హత్యకు గురయ్యాడన్న సమాచారంతో లావణ్య కుప్పకూలిపోయింది. ఇప్పటికే పోస్టుమార్టం పూర్తయిందని, శనివారం అర్ధరాత్రికి మృతదేహం విశాఖ వచ్చే అవకాశం వుందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

Updated Date - 2020-07-05T16:06:14+05:30 IST