అది అమ్మతనానికి అడ్డంకి కాదు!

ABN , First Publish Date - 2020-02-04T00:10:10+05:30 IST

గర్భధారణ జరగాలంటే అందుకు గర్భాశయం లోపలి పొర ఎండోమెట్రియం కణాలు సహకరించాలి. కొంతమందిలో ఈ కణాలు స్థానం మారి, గర్భాశయం లోపల కాకుండా బయట, అండాశయాలు, ఫెలోపియన్‌ ట్యూబ్‌ల దగ్గర చేరిపోయి

అది అమ్మతనానికి అడ్డంకి కాదు!

అమ్మతనానికి ఆసరా అందించాల్సిన

గర్భాశయం లోపలి పొర కొన్నిసార్లు

అందుకు అడ్డుపడే పరిస్థితులనూ కల్పిస్తుంది.

అదే ‘ఎండోమెట్రియోసిస్‌’! ఈ ఇబ్బందిని ముందుగానే కనిపెట్టి,

సరిదిద్దే చికిత్సలను ఆశ్రయిస్తే, అమ్మ అవడం తేలికే!

 

గర్భధారణ జరగాలంటే అందుకు గర్భాశయం లోపలి పొర ఎండోమెట్రియం కణాలు సహకరించాలి. కొంతమందిలో ఈ కణాలు స్థానం మారి, గర్భాశయం లోపల కాకుండా బయట, అండాశయాలు, ఫెలోపియన్‌ ట్యూబ్‌ల దగ్గర చేరిపోయి గర్భధారణకు ఆటంక పరిస్థితులు కల్పిస్తాయి. ఈ పరిస్థితిలో తీవ్రతను బట్టి లక్షణాలు బయల్పడతాయి. అయితే ఈ లక్షణాలన్నీ మహిళలను తప్పుదారి పట్టించేలా ఉండడంతో ఎండోమెట్రియోసిస్‌ చాప కింద నీరు చందంగా మారుతూ ఉంటుంది. ఈ పరిస్థితికి దారితీసే పరిణామం నెలసరి స్రావంతోనే మొదలవుతుంది. అదెలాగంటే...

 

స్థానభ్రంశం చెందే కణాలు!

గర్భాశయం లోపలి పొరలో ఉండే ఎండోమెట్రియం కణాలు గర్భధారణకు తోడ్పడతాయి. అయితే గర్భధారణ జరగనప్పుడు ఈ కణాలు నెలసరి స్రావంతో వెలుపలికి వచ్చేస్తూ ఉంటాయి. అదే సమయంలో కొన్ని కణాలు దారి తప్పి శరీరంలోని వేర్వేరు ప్రాంతాలకు వెళుతూ ఉంటాయి. అయితే సహజసిద్ధమైన వ్యాధినిరోధకవ్యవస్థ ఈ కణాలను నాశనం చేస్తూ ఉంటుంది. కొందరు మహిళల్లో ఈ వ్యవస్థ సక్రమంగా పనిచేయకపోవడం మూలంగా, పరిస్థితి అదుపు తప్పుతుంది. అలా జరిగినప్పుడు, ప్రతి నెలా నెలసరి సమయంలో వెలుపలికి రావలసిన స్రావం గర్భాశయం లోపలికి, ఫెలోపియన్‌ ట్యూబ్స్‌లోకి చేరుతుంది. దానిలోని ఎండోమెట్రియం సెల్స్‌ గర్భాశయాన్ని దాటి పునరుత్పత్తి వ్యవస్థకు సంబంధించిన ఇతర అవయవాల్లో, మూత్రాశయం దగ్గరకు ప్రయాణించి, అక్కడే నాటుకుని, ఆ అవయవాలన్నీ ఒకదానికొకటి అతుక్కునేలా చేస్తాయి. అంతేకాకుండా, నెలసరి వచ్చిన ప్రతిసారీ ఆ కణాలు ప్రేరేపితమవుతూ, రక్తంతో పాటు కొన్ని ఎంజైమ్‌లను విడుదల చేస్తూ ఉంటాయి. ఈ పరిస్థితే గర్భధారణకు అడ్డంకిగా మారుతుంది.

 

నాటుకునే ప్రదేశాలు ఇవే!

సమస్య ఉన్న మహిళలో ఎండోమెట్రియం సెల్స్‌ రక్తస్రావంతో కలిసి శరీరంలోని పలు ప్రదేశాల్లో నాటుకుంటాయి. గర్భాశయం వెనక, అండాశయాల లోపల, ఫెలోపియన్‌ ట్యూబ్స్‌ లోపల, మూత్రాశయం వెలుపల, పురీషనాళం దగ్గర, అరుదుగా ఊపిరితిత్తుల్లో.. ఇలా పలు ప్రదేశాల్లో నాటుకుంటూ ఉంటాయి. అండాశయాల్లో ఈ కణాలు విపరీతంగా పెరిగిపోతే ‘ఎండోమెట్రియోయా’ అనే కణితి తయారవుతుంది. దీన్నే ‘చాక్లెట్‌ సిస్ట్‌’ అని కూడా అంటారు.

 

తప్పుదోవ పట్టించే లక్షణాలు!

ఎండోమెట్రియోసి్‌సలో కనిపించే లక్షణాలు వేర్వేరు సాధారణ సమస్యలను పోలి ఉండి, తప్పుదారి పట్టిస్తూ ఉంటాయి. కొందరిలో ఎటువంటి లక్షణాలూ కనిపించకపోవచ్చు కూడా! మరికొందరిలో కేవలం రెండు, మూడు కణాలు నాటుకోవడం మూలంగానే విపరీతమైన దుష్ప్రభావాలు బయల్పడుతూ ఉంటాయి. అయితే నాడులకు దగ్గరగా కణాలు నాటుకున్న సమయంలో లక్షణాలు స్పష్టంగా కనిపిస్తాయి. సాధారణంగా కనిపించే లక్షణాలు ఇవే!

 

పొత్తికడుపులో తక్కువ తీవ్రతతో కూడిన నొప్పి కొనసాగుతూ, నెలసరి సమయంలో తీవ్రమవుతూ ఉంటుంది. తరచుగా మూత్రవిసర్జన చేయవలసి రావడం నడుము నొప్పి విరేచనాలు, వాంతులు తీవ్రమైన నొప్పి నెలసరిలో విపరీతమైన రక్తస్రావం లైంగిక కలయిక సమయంలో విపరీతమైన నొప్పి (డిస్పరోనియా)

పరీక్షలతో కనిపెట్టవచ్చు!

లక్షణాలు సంబంధిత చికిత్సలతో అదుపులోకి రాకుండా, వాటితో పాటు నెలసరి ఇబ్బందులు ఉంటే స్త్రీవైద్యులను కలవడం అవసరం. పొత్తికడుపు స్కానింగ్‌తో గర్భాశయంతో పాటు, అండాశయాల దగ్గర నాటుకున్న కణాలను, ఎమ్మారైతో గర్భాశయం వెలుపల, ఇతర శరీర భాగాల్లో నాటుకున్న కణాలను కనిపెట్టవచ్చు.

అప్రమత్తత అవసరం!

ఎండోమెట్రియోసి్‌సలో నాలుగు దశలు ఉంటాయి. ఈ ఇబ్బందిని ప్రారంభంలో గుర్తిస్తే సరిదిద్దడం తేలిక. కాబట్టి లక్షణాల మీద ఓ కన్నేసి ఉంచాలి. 30 ఏళ్ల లోపు మహిళలు ఎటువంటి గర్భనిరోధక సాధనాలు వాడకపోయినా, ఏడాదిలోగా గర్భం దాల్చనప్పుడు, 30 నుంచి 35 ఏళ్ల వయసు మహిళలు పెళ్లయ్యాక ఆరు నెలల లోపు గర్భం దాల్చకపోయినా ఆలస్యం చేయకుండా గైనకాలజిస్టును సంప్రతించాలి.

 

ఎఆర్‌టి చికిత్స!

ఎండోమెట్రియోసిస్‌ కారణంగా అండాశయాలు తగినన్ని అండాలను ఉత్పత్తి చేయలేవు. అలాంటప్పుడు అండాశయాన్ని ప్రేరేపించి ఎక్కువ అండాలు విడుదలయ్యేలా చేసే చికిత్స ఎఆర్‌టి(అసిస్టెడ్‌ రిప్రొడక్టివ్‌) ట్రీట్మెంట్‌. ఈ చికిత్సలో భాగంగా పరిణతి చెందిన అండాలను సేకరించి, వీర్యకణంతో ఫలదీకరణ జరిపించి, తిరిగి గర్భాశయంలో నాటతారు. అలా ఎఆర్‌టి చికిత్సతో ఎండోమెట్రియోసిస్‌ ఉన్నా, మహిళలు గర్భం దాల్చే వీలుంది. ఐయుఐ (ఇంట్రాయుటెరిన్‌ ఇన్‌సెమినైజైషన్‌), ఐవిఎఫ్‌ (ఇన్‌విట్రో ఫర్టిలైజేషన్‌) చికిత్సలను ఎఆర్‌టి పద్ధతిలో చేయవచ్చు.

 

చికిత్స సులువే!

ఎండోమెట్రియోసిస్‌ తొలి దశలో కేవలం కణాలు మాత్రమే విస్తరించి, అవయవాలు అతుక్కోని స్థితి ఉంటుంది. ఈ దశలో ల్యాప్రోస్కోపీ ద్వారా కణాలను కాల్చి సమస్యను సరిదిద్దవచ్చు. రెండో దశలో అతుకులు స్పష్టంగా కనిపిస్తాయి. వీటిని విడదీసి, ఆర్టిఫిషియల్‌ ఇన్‌సెమినైజేషన్‌ (ఐయుఐ) ద్వారా గర్భధారణ జరిగేలా చేయవచ్చు. మూడో దశలో ఎండోమెట్రియోసిస్‌ అండాశయాల్లో, మూత్రాశయం దగ్గర, గర్భాశయం వెనక నాటుకుని, ఆ అవయవాలు అతుక్కుపోతాయి. నాలుగో దశలో గర్భాశయం, ఫెలోపియన్‌ ట్యూబ్స్‌, అండాశయాలు అన్నీ అతుక్కుపోయి ఉంటాయి. మూడో దశకు చేరుకున్న ఎండోమెట్రియోసిస్‌లకు ఐయుఐతో ఫలితం ఉండదు. ఆ కణాలను కాల్చి, అవయవాలను విడదీసినా గర్భధారణ కొంత క్లిష్టమవుతుంది. కాబట్టి వీరికి ఐవిఎఫ్‌ (ఇన్‌విట్రో ఫర్టిలైజేషన్‌) అవసరం అవుతుంది. అంటే, శరీరం వెలుపల అండం, శుక్రకణం ఫలదీకరణ జరిపించి, ఆ తర్వాత గర్భాశయంలో నాటడం ద్వారా గర్భధారణ జరిగేలా చేయవచ్చు. చివరిదైన నాలుగో దశలో అండాశయం నుంచి అండాల ఉత్పత్తి స్తంభించిపోయి ఉంటే దాత నుంచి అండాలను సేకరించి ఐవిఎఫ్‌ పద్ధతి ద్వారా గర్భం దాల్చేలా చేయవచ్చు.

 

వీరిలోఎక్కువ!

చిన్న వయసులోనే (11 ఏళ్లు, అంతకన్నా తక్కువ వయసులో) తొలి నెలసరి మొదలైన మహిళలు.

అతి తక్కువ బిఎమ్‌ఐ (బాడీ మాస్‌ ఇండెక్స్‌)తో బలహీనంగాఉన్న స్త్రీలు.

తీవ్రమైన నెలసరి స్రావం ఉండేవారు.

ఇదే సమస్యతో కూడిన రక్తసంబంఽధీకులను కలిగి ఉన్న మహిళలు.

డాక్టర్‌ అలియా రెడ్డి,

అబ్‌స్టెట్రీషియన్‌ అండ్‌ గైనకాలజిస్ట్‌,

హైదరాబాద్‌

Updated Date - 2020-02-04T00:10:10+05:30 IST