రాత్రి 10 గంటల సమయం.. భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి బైక్‌పై వెళ్తున్న భర్త.. తెల్లారేసరికి మిగిలింది ఒక్కరే.. అసలేం జరిగిందంటే..

ABN , First Publish Date - 2021-12-04T23:18:45+05:30 IST

భార్య షాపింగ్‌కి వెళ్దామంటే అతడు సరేనన్నాడు. ఇద్దరు పిల్లలతో కలిసి బైక్‌పై షాపింగ్‌కి బయల్దేరాడు. అక్కడ ఎవరికి నచ్చింది వారు కొనుగోలు చేసుకుని రాత్రి పది గంటల సమయంలో

రాత్రి 10 గంటల సమయం.. భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి బైక్‌పై వెళ్తున్న భర్త.. తెల్లారేసరికి మిగిలింది ఒక్కరే.. అసలేం జరిగిందంటే..

ఇంటర్‌నెట్ డెస్క్: భార్య షాపింగ్‌కి వెళ్దామంటే అతడు సరేనన్నాడు. ఇద్దరు పిల్లలతో కలిసి బైక్‌పై షాపింగ్‌కి బయల్దేరాడు. అక్కడ ఎవరికి నచ్చింది వారు కొనుగోలు చేసుకుని రాత్రి పది గంటల సమయంలో ఇంటికి తిరుగుముఖం పట్టారు. షాపింగ్ పూర్తి చేసుకుని వచ్చేటపుడు వారు నలుగురు బయల్దేరినా.. తెల్లారేసరికి ఆ కుటుంబంలో మిగిలింది ఒక్కరే. అసలేం జరిగిందనే పూర్తి వివరాల్లోకెళ్తే..


రాజస్థాన్‌లోని రాజల్దేసర్ ప్రాంతంలో మంగళ్‌రాం తన కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు. అతనికి భార్య మంజుదేవి, నాలుగేళ్ల కుమారుడు అనిల్, రెండేళ్ల కూతురు ప్రియాంక ఉన్నారు. అయితే శుక్రవారం సాయంత్రం మంజుదేవి పిల్లల్ని, తనని షాపింగ్‌కు తీసుకెళ్లమని భర్తని కోరింది. మంగళ్‌రాం సరేననడంతో అందరూ ఉత్సాహంగా రెడీ అయి బైక్ మీద సిటీకి బయల్దేరారు. అక్కడ షాపింగ్ చేసుకుని తిరిగి రాత్రి 10 గంటల సమయంలో ఇంటికి తిరుగుముఖం పట్టారు. అయితే సిటీ నుంచి బయల్దేరిన వారి బైక్‌ను చురు గ్రామం వద్ద గుర్తు తెలియని ట్రక్ వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. దీంతో అందరూ చెల్లాచెదురుగా కిందపడిపోయారు. 


ఈ ఘటనలో అందరూ తీవ్రంగా గాయపడ్డారు. గమనించిన స్థానికులు వెంటనే వారిని బికనీర్‌లోని పిబిఎం ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు అప్పటికే మంగళ్‌రాం, అతని కూతురు ప్రియాంక చనిపోయినట్టు నిర్ధారించారు. భార్య మంజుదేవి చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. నాలుగేళ్ల అనిల్ మాత్రం ప్రమాదం నుంచి బయటపడ్డాడు. ట్రామా సెంటర్లో బాబుకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అప్పటివరకు ఎంతో సంతోషంగా ఉన్న ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఒకే కుటుంబంలోని వారు ముగ్గురు మరణించడంతో బంధువులు, స్థానికులు కన్నీరుమున్నీరుగా విలపించారు. 

Updated Date - 2021-12-04T23:18:45+05:30 IST