Chennai: అయ్యో పాపం.. ఎంత పని జరిగింది.. అయినా ఆమెకు మాత్రం తెలుసా ఇలా జరుగుతుందని..!

ABN , First Publish Date - 2022-06-25T20:24:38+05:30 IST

చావుపుట్టుకలు మన చేతుల్లో లేవని ఎవరైనా చెబితే ‘వేదాంతం’ మాట్లాడుతున్నారని కొట్టిపారేస్తారు కానీ నిజంగానే అవి రెండూ మన చేతుల్లో..

Chennai: అయ్యో పాపం.. ఎంత పని జరిగింది.. అయినా ఆమెకు మాత్రం తెలుసా ఇలా జరుగుతుందని..!

చెన్నై: చావుపుట్టుకలు మన చేతుల్లో లేవని ఎవరైనా చెబితే ‘వేదాంతం’ మాట్లాడుతున్నారని కొట్టిపారేస్తారు కానీ నిజంగానే అవి రెండూ మన చేతుల్లో లేవని ఈ ఘటన మరోసారి రుజువు చేసింది. ఒక మహిళ కారులో వెళుతుంటే ఆ కారుపై చెట్టు కూలి అర్థాంతరంగా ఆమె ప్రాణాలు గాల్లో కలిసిపోతాయని ఎవరైనా అనుకుంటారా. పాపం.. చెన్నైలో ఓ బ్యాంకు మేనేజర్ విషయంలో అదే జరిగింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చెన్నైకి చెందిన వాణి కబిలన్ అనే మహిళ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ బ్రాంచ్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు.



జూన్ 24 సాయంత్రం ఆఫీస్ ముగించుకుని తన సోదరి ఎళిలరసితో కలిసి చెన్నైలోని కేకే నగర్ వైపు కారులో వెళుతున్నారు. అక్కాచెల్లెళ్లు ఇద్దరూ కారులో వెనుక సీట్లలో కూర్చున్నారు. కార్తీక్ అనే వ్యక్తి కారు నడుపుతున్నాడు. లక్ష్మీ స్వామి రోడ్ నుంచి పీటీ రాజన్ రోడ్ వైపు కారు వెళుతుండగా ఉన్నట్టుండి ఒక పెద్ద చెట్టు కూలి కారుపై పడింది. కారు వెనుక వైపు ఆ చెట్టు అమాంతం పడటంతో ముందు డ్రైవర్ సీట్లో ఉన్న కార్తీక్ డోర్ తీసుకుని స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. వాణి, ఎళిలరసిలను కాపాడేందుకు స్థానికులు ప్రయత్నించారు. కానీ.. చెట్టు అమాంతం మీద పడటంతో వాణి స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోయారు. ఆమె సోదరిని కారులో నుంచి బయటకు తీసుకొచ్చినప్పటికీ తీవ్రంగా గాయాలవడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.



అగ్నిమాపక సిబ్బందితో పాటు పోలీసు సిబ్బంది కూడా స్పాట్‌కు చేరుకుని కారుపై పడిన ఆ చెట్టును ప్రొక్లెయిన్ సాయంతో పక్కకు నెట్టేశారు. ఎళిలరసిని కేకేనగర్‌లోని ఈఎస్‌ఐ హాస్పిటల్‌కు తరలించారు. పోస్ట్‌మార్టం నిమిత్తం వాణి మృతదేహాన్ని గవర్నమెంట్ హాస్పిటల్‌కు తరలించారు. ఈ ఘటన జరిగిన ప్రాంతాన్ని పరిశీలిస్తే.. సింగారా చెన్నై 2.0 ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న డ్రెయిన్‌‌కు దగ్గరగా ఉన్నట్టు తెలిసింది. దీంతో.. గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ కూడా ఈ ఘటనపై విచారణకు ఆదేశించింది. అయితే.. జూన్ 22 నుంచి అక్కడ ఎలాంటి తవ్వకపు పనులు జరగలేదని.. ఆ చెట్టు కూలిన ప్రాంతానికి, పనులు జరుగుతున్న ప్రాంతానికి 10 అడుగుల దూరం ఉందని చెన్నై కార్పొరేషన్ ఒక ప్రకటన విడుదల చేసింది. ఎలాంటి తవ్వకాలు జరగకపోతే అంత పెద్ద చెట్టు మరి ఉన్నట్టుండి ఎందుకు కూలిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏదేమైనా ఈ ఊహించని ఘటన కారణంగా ఒక నిండు ప్రాణం పోయింది.

Updated Date - 2022-06-25T20:24:38+05:30 IST