ఉచితాల రద్దే ప్రజాశ్రేయస్కరం

Jul 27 2021 @ 01:00AM

ఇది ఉచితాల ప్రజాస్వామ్య యుగం కాబోలు. పలు దేశాలలో పాలక, ప్రతిపక్షాలు ఓట్లను కొల్లగొట్టేందుకు వివిధ వస్తువులు, సేవలను ఉచితంగా పంపిణీ చేసేందుకు, అందించేందుకు పోటీ పడుతున్నారు. బ్రాడ్‌బాండ్, బస్సు ప్రయాణం, కార్ పార్కింగ్‌ను ఉచితంగా సమకూరుస్తామని బ్రిటన్‌లో లేబర్ పార్టీ హామీ ఇచ్చింది. మన రాజకీయ పార్టీలు అంతకంటే ఘనమైన సామ్యవాద పార్టీలు కదా. కొన్ని సంవత్సరాల క్రితం ఉత్తరప్రదేశ్‌లో ల్యాప్‌టాప్‌లు ఉచితంగా ఇచ్చారు. తమిళనాడులో కిచెన్ గ్రైండర్స్, సైకిళ్లు ఉచితంగా ఇస్తామని హామీ ఇచ్చారు. ఢిల్లీలో నీరు, విద్యుత్ ఉచితంగా సరఫరా చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఎల్‌పిజి సిలిండర్‌లను ఉచితంగా పంపిణీ చేసింది. ప్రభుత్వాల ఈ వితరణ సామాజిక సంక్షేమానికి తోడ్పడుతుందనడంలో సందేహం లేదు. విద్యార్థుల విద్యావ్యాసంగాలకు ల్యాప్‌టాప్‌లు విశేషంగా తోడ్పడతాయి. వంట చెరకు స్థానంలో ఎల్‌పిజి సిలిండర్ల వినియోగం గృహిణుల ప్రయాసలను తగ్గిస్తుంది. అయితే లోకవివేకం చెబుతున్నదేమిటి? ‘ఒక వ్యక్తికి ఒక చేపను ఇవ్వండి. అది అతనికి ఆ రోజుకు ఆహారమవుతుంది. చేపలు పట్టడం ఎలాగో అతనికి నేర్పండి. తద్వారా మీరు అతనికి జీవిత పర్యంతం ఆహారాన్ని సమకూర్చుతారు’. ఎల్‌పిజి సిలిండర్‌తో లబ్ధి అందులో గ్యాస్ ఉన్నంతవరకే కదా. 


ప్రభుత్వం సమకూర్చే సేవలు మూడు తరహాలుగా ఉంటాయని ప్రొఫెసర్ రీతిక ఖేరా (ఐఐఎం, అహ్మదాబాద్) తెలిపారు. మొదటిరకం సేవలు ‘ప్రజోపయోగ సేవలు’ (పబ్లిక్ గూడ్స్). వీటిని సామాజిక వస్తువులని కూడా అంటారు. ఈ రకం వస్తువులను మార్కెట్ ద్వారా అమ్మడం సాధ్యం కాదు. ఇందుకు కారణం వాటి ప్రత్యేక లక్షణాలు- అవిభాజ్యత, బహిష్కరణ సాధ్యం కాకపోవడం. ప్రజోపయోగ వస్తువులను ప్రజలందరూ ఒకే మోతాదులో వినియోగిస్తుంటారు. అంతేకాక వీటి వినియోగాన్ని నిరాకరించడం ఒక వ్యక్తికి సాధ్యం కాదు. ఎవరైనా, ఎలాంటి చెల్లింపులు లేకుండా వీటిని అనుభవించే అవకాశముంది. ఈ వస్తువులను మార్కెట్ అందివ్వలేదు. రైల్వే, హైవే, కొవిడ్ సమాచారం మొదలైనవి. ప్రభుత్వం మాత్రమే సమకూర్చగల సేవలివి. 


రెండో తరహా సేవలు-– మెరిట్ వస్తువులు. ఇవి మార్కెట్ అందివ్వలేని మరోరకం వస్తువులు. ప్రజోపయోగ వస్తువుల లాగానే వీటిని మార్కెట్ ద్వారా పొందలేము. ఉదాహరణకు పాఠశాలలో ప్రవేశపెట్టిన మధ్యాహ్న భోజన పథకం, పేదలకు ఇళ్ళు కట్టించి ఇవ్వడం. మార్కెట్ ఈ అవసరాన్ని, ప్రయోజనాన్ని ఊహించను కూడా ఊహించలేదు. ఒక వ్యక్తి వీటిని సొంతంగా మాత్రమే సంపాదించుకోగలడు. వ్యక్తులు సమకూర్చుకునే కొన్ని వస్తువులు విశాల సమాజ ప్రయోజనాలకు తోడ్పడుతాయి. 


మూడో రకం సేవలు-– ప్రైవేట్ వస్తువులు. ఇవి ప్రజోపయోగ వస్తువులకు భిన్నమైనవి. ధర చెల్లించి పొందగలిగే సేవలివి. ఉదాహరణకు ఢిల్లీలో విద్యుత్‌ను నిర్దిష్ట స్థాయి వినియోగం వరకు ఉచితంగా సరఫరా చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం గ్రామీణ పేదలకు ఎల్‌పిజి సిలిండర్లను ఉచితంగా పంపిణీ చేస్తుంది. గృహాలను నిర్మించి ఇస్తుంది. అయితే ఇటువంటి వస్తువులు, సేవలు ప్రత్యక్ష సామాజిక లబ్ధికి దోహదం చెయ్యవు. 


మెరిట్, ప్రైవేట్ వస్తువులకు మధ్య వ్యత్యాసమేమిటి? కేంద్రప్రభుత్వం అమలుపరుస్తున్న రైతుల పెన్షన్ పథకాన్ని ఢిల్లీ ప్రభుత్వం హామీ ఇచ్చిన ఉచిత విద్యుత్ సరఫరా పథకంతో పోలిస్తే ఆ తేడా విశదమవుతుంది. అటు కేంద్రమూ, ఇటు ఢిల్లీ ప్రభుత్వమూ వ్యక్తికే ప్రయోజనాన్ని కల్పిస్తున్నాయి. తేడా ఏమిటంటే కేంద్రప్రభుత్వ పథకం రైతుకు ఆదాయాన్ని సమకూర్చడంతో పాటు మరింత అధికంగా దిగుబడులు సాధించేందుకు ప్రోత్సాహకమవుతుంది. తద్వారా దేశానికి ఆహార భద్రత సమకూరుతుంది. ఉచిత విద్యుత్ సరఫరా అటువంటి సామాజిక లబ్ధికి తోడ్పడదు. కనుక రైతుల పెన్షన్‌ను మెరిట్ వస్తువుగాను, ఉచిత విద్యుత్‌ను ప్రైవేట్ వస్తువుగాను పరిగణిస్తున్నారు. 


ఈ వాస్తవాల వెలుగులో కేంద్రప్రభుత్వం అమలుపరుస్తున్న వివిధ సంక్షేమ పథకాలను సమీక్షించాలి. రైతులకు పెన్షన్ పథకంతో పాటు మరో నాలుగు మెరిట్ వస్తువులను సమకూర్చే పథకాలను అమలుపరుస్తోంది. వీటిన్నిటినీ కొనసాగించాలి. అయితే ఇదే సమయంలో ప్రైవేట్ వస్తువులను సమకూర్చేందుకు కూడా కేంద్రం పలు సంక్షేమ పథకాలను అమలుపరుస్తోంది. ఇవి: ఉన్నత్ జీవన్ యోజన, ఆయుష్మాన్ భారత్ యోజన, ప్రధాన మంత్రి సురక్షా బీమా యోజన, ప్రధానమంత్రి జీవన్‌జ్యోతి బీమా యోజన, ప్రధానమంత్రి గ్రామీణ్ ఆవాస్ యోజన, అంత్యోదయ అన్నయోజన, ప్రధానమంత్రి ఉజ్వల యోజన, ప్రధానమంత్రి జన్‌ధన్ యోజన మొదలైనవి. ఈ పథకాలేవీ సామాజిక శ్రేయస్సుకు ప్రత్యక్షంగా తోడ్పడేవి కావు. కాకపోగా భారీస్థాయిలో పాలనాపరమైన వ్యయాలకు కారణమవుతున్నాయి. ప్రభుత్వ యంత్రాంగంలో అవినీతికి ఆస్కారం కల్పిస్తున్నాయి. ప్రైవేట్ వస్తువులను సమకూర్చేందుకు ఉద్దేశించిన ఈ సంక్షేమ పథకాలు అన్నిటినీ రద్దు చేసి తీరాలి. తద్వారా ఆదా అయిన సొమ్మును పౌరులందరికీ నగదు రూపేణా నేరుగా చెల్లించాలి. ఈ చర్య ప్రజలకు ఆర్థిక సాధికారత కల్పిస్తుంది. తమ సొంత అవసరాలు భావి జీవిత నిర్మాణ ప్రణాళికల ప్రాతిపదికన ప్రజలు తమకు పంపిణీ అయిన డబ్బును వినియోగించుకుంటారు. తమ పిల్లల ఆంగ్లమాధ్యమ పాఠశాలల్లో మధ్యతరగతి వారే కాదు, పేద కుటుంబాలు కూడా ఏదో ఒకవిధంగా భారీగా సొమ్ము వెచ్చించడానికి వెనుకాడడం లేదు. కనుక ప్రజలకు సంక్షేమాన్ని సమకూర్చేందుకు ‘సరైన’ మార్గమేదో ప్రభుత్వానికి మాత్రమే తెలుసనీ, తమకు ఏది మంచిది అనే విషయమై ప్రజలకు తెలియదనే అభిప్రాయాన్ని మనం విడనాడి తీరాలి. ప్రైవేట్ వస్తువులను సమకూర్చే సంక్షేమపథకాలు అన్నిటినీ రద్దు చేయవలసిన సమయం ఆసన్నమయింది. సామాజిక శ్రేయస్సునకు దోహదం చేయని సంక్షేమాలకు స్వస్తి చెప్పడంలో కేంద్రప్రభుత్వం పథనిర్ణేత కావాలి. 

భరత్ ఝున్‌ఝున్‌వాలా

(వ్యాసకర్త ఆర్థికవేత్త, బెంగుళూరు ఐఐఎం రిటైర్‌్డ ప్రొఫెసర్‌)

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.