పోలీసులకు దొరక్కుండా ఉండేందుకు ఓ దొంగ వెరైటీ ప్లాన్.. నది మధ్యలో ఇల్లు..!

ABN , First Publish Date - 2021-07-20T16:02:30+05:30 IST

నది మధ్యలో ఇల్లు.. నిత్యం రాజ భోగాలు.. చుట్టూ కాపలా మనుసులు.. పోలీసులు వస్తే తప్పించుకునేందుకు ఏర్పాట్లు.. సినిమాల్లోని విలన్ల డెన్‌లను తలపించే నిర్మాణం.

పోలీసులకు దొరక్కుండా ఉండేందుకు ఓ దొంగ వెరైటీ ప్లాన్.. నది మధ్యలో ఇల్లు..!

నది మధ్యలో ఇల్లు.. నిత్యం రాజ భోగాలు.. చుట్టూ కాపలా మనుసులు.. పోలీసులు వస్తే తప్పించుకునేందుకు ఏర్పాట్లు.. సినిమాల్లోని విలన్ల డెన్‌లను తలపించే నిర్మాణం.. పశ్చిమబెంగాల్‌కు చెందిన ఓ దొంగ చేసుకున్న ఏర్పాట్లు ఇవి. కోల్‌కతా‌లోని ఓ ఇంట్లో పనిచేసే విశ్వనాథ్.. తన యజమాని అమెరికా వెళ్లడంతో అక్కడ భారీ దొంగతనానికి పాల్పడ్డాడు. బంగారం, నగలు, డాలర్లు, 10 లక్షల రూపాయలు కాజేశాడు. 


అమెరికా నుంచి తిరిగొచ్చాక విషయం తెలుసుకున్న యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విశ్వనాథ్ వివరాలు ఇచ్చాడు. దీంతో కోల్‌కతా పోలీసులు అక్కడకు 160 కిలోమీటర్ల దూరంలో ఉన్న విశ్వనాథ్ గ్రామానికి బయల్దేరారు. స్థానిక పోలీసుల సహాయం తీసుకుని అతని కోసం వెతకడం ప్రారంభించారు. అయితే ఆ గ్రామంలో విశ్వనాథ్ ఆచూకీ దొరకలేదు. చివరకు రకరకాలుగా ప్రయత్నించి విశ్వనాథ్ ఉండే చోటును తెలుసుకున్నారు. 


కాలినడకన కొండలు, గుట్టలు దాటి ఓ నది వద్దకు చేరుకున్నారు. స్థానిక పోలీసుల సహాయంతో నది మధ్యన ఉన్న ఇంటికి చేరుకుని విశ్వనాథ్‌ను అరెస్ట్ చేశారు. అయితే అతడిని తీసుకెళ్లేటపుడు అతడి మనుషుల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. దీంతో స్థానిక పోలీసులు పారిపోయారు. కానీ, కోల్‌కతా పోలీసులు వారికి నచ్చచెప్పి విశ్వనాథ్‌ను కోల్‌కతా తీసుకువచ్చారు. అనంతరం అతడిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. అతడు దొంగిలించిన వాటిని స్వాధీనం చేసుకున్నారు.  

Updated Date - 2021-07-20T16:02:30+05:30 IST