Advertisement

అమరావతిపై అభాండాలు

Oct 22 2020 @ 00:33AM

నల్లగొండ, మహబూబ్‌నగర్‌ జిల్లాల రైతులు తమ భూములను ఫార్మాసిటీకి ఇవ్వబోమని ఎందుకు అంటున్నారు? మహారాష్ట్ర, గుజరాత్ రైతులు ప్రతిష్ఠాత్మక బుల్లెట్‌ ట్రైయిన్ ప్రాజెక్టుకు భూములు ఇవ్వడానికి ఎందుకు తిరస్కరిస్తున్నారు? ఆ రాష్ట్రాల ప్రభుత్వాలపై ఎలాంటి వ్యాఖ్య చేయకుండా రెండు, మూడేళ్ళలో 35 వేల ఎకరాలు సాఫీగా, ప్రజల నమ్మకంతో సేకరించిన ప్రభుత్వాన్ని విమర్శించేవారు నిష్పాక్షిక విశ్లేషకులు కాజాలరు. ప్రాస కోసం, ప్రాపకం కోసం పాకులాడే ఆస్థాన విద్వాంసులు మాత్రమే.


సరిగ్గా ఐదేళ్ళ క్రితం 2015 అక్టోబర్‌ 22న అంగరంగ వైభవంగా, ప్రజల ఆనందోత్సాహాల మధ్య, సింగపూర్‌, జపాన్‌ దేశాల మంత్రులు ప్రత్యేక అతిథులుగా పాల్గొనగా నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. ‘ఇది ప్రజల రాజధాని’ అని పేర్కొంటూ అమరావతి అభివృద్ధికి కేంద్రం సంపూర్ణ సహకారమందిస్తుందని మోదీ అభయమిచ్చారు. 


ప్రస్తుత ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్‌ రెడ్డి, ఆయన పార్టీ నాయకులు అమరావతికి శాసనసభ సాక్షిగా ఆమోదం తెలిపారు. వాస్తవానికి అమరావతికి వ్యతిరేకంగా 2019 ఎన్నికలకు చాలా ముందుగా, అంటే 2017 నుంచే కుట్ర మొదలైనట్లుగా అనిపిస్తోంది. అందులో భాగంగానే అమరావతిని ‘భ్రమరావతి’గా సామాజిక మాధ్యమాలలో ప్రచారం చేయించారు. అమరావతి భూమి పూజ అయిన ఏడాదిన్నరకు గాని భూసేకరణ పూర్తి కాలేదు. అమరావతికి అసలు పెట్టుబడి, ఆ ప్రాంత గ్రామాలకు చెందిన 29 వేల మంది రైతులు స్వచ్ఛందంగా, చంద్రబాబు ప్రభుత్వంపై సంపూర్ణ నమ్మకంతో ఇచ్చిన 35 వేల ఎకరాల భూమి. రైతుల త్యాగాలకు ఎందరో సంతోషపడ్డారు. సంతోషపడనివారూ ఉన్నారు. వీరే, అమరావతి ముంపు ప్రాంతమని, అది వ్యవసాయ భూమి అని హైకోర్టు, సుప్రీంకోర్టు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌లలో ఏదో ఒక కేసు వేస్తూనే ఉన్నారు. ఈ తరహా వ్యూహాలు ఛేదించుకుని చంద్రబాబు ప్రభుత్వం నిర్మాణాలు మొదలు పెట్టినప్పటికీ అదంతా భ్రమలు కల్పించడంలో భాగమేనని విమర్శలు వచ్చాయి. వాటిలో హేతుబద్ధత ఉందో లేక మరేదైనా ఉద్దేశం దాగిఉందో తెలుసుకోవాలంటే మనం భూ సేకరణకు సంబంధించిన కొన్ని ఉదాహరణలు చూడాల్సిందే.


హైదరాబాద్‌కు సమీపంలోని రాచకొండ గుట్టలతో పాటు ఉమ్మడి నల్లగొండ, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లోని 20 వేల ఎకరాల్లో ఫార్మాసిటీ నిర్మాణం చేపట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు 2014 డిసెంబర్‌లో ఫార్మారంగ ప్రముఖులతో కలిసి హెలికాప్టర్‌లో ఆ ప్రదేశాలను సందర్శించారు. ఆ సమయంలో స్థానికులు, తమ ప్రాంతం ఇన్నాళ్ళు వెనుకబడి పోయిందని ముఖ్యమంత్రి నిర్ణయంతో అభివృద్ధికి నోచుకోనుందని సంతోషం వెలిబుచ్చారు. అక్కడ ఫార్మాసిటీతో పాటు ఫిలిం సిటీ నిర్మాణాన్ని కూడా తలపెట్టాలని ముఖ్యమంత్రి భావిస్తున్నట్టు మీడియాలో వార్తలు వెలువడ్డాయి. అధికార వర్గాలు కూడా ఈ కథనాలను ధ్రువీకరించాయి. 2015 జనవరి నాటికే ఆ జిల్లాల్లో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం బాగా పుంజుకున్నట్లు మీడియా వెల్లడించింది. ఇప్పటికి 5 సంవత్సరాల 10 నెలల కాలం గడిచింది. 20 వేల ఎకరాలకు గాను సుమారు 9 వేల ఎకరాల భూమి సేకరణ మాత్రమే పూర్తయిందని కేసీఆర్ ప్రభుత్వం చెబుతున్నది. అయితే భూ సేకరణ ఆ మాత్రం కూడా జరగలేదని స్థానికులు అంటున్నారు. అంతే కాదు, భూసేకరణకు ప్రజలు అంగీకరించడం లేదు. తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఫార్మాసిటీకి వ్యతిరేకంగా గ్రామసభల్లో ఏకగ్రీవంగా తీర్మానాలు చేస్తున్నారు. ఈ దసరాకు ఫార్మాసిటీకి శంకుస్థాపన చేద్దామనుకుంటున్నట్లు కేసీఆర్ ప్రభుత్వం తొలుత భావించింది. అయితే ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న దృష్ట్యా శంకుస్థాపన ఎప్పుడు అనే విషయాన్ని మళ్ళీ నిర్ధారణ చేయలేదు. అమరావతిని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించిన వారు ఈ విషయాలన్నిటినీ ఉద్దేశపూర్వకంగానే విస్మరించారు. 

2017 సెప్టెంబర్‌ 14న ప్రధాని మోదీ, అప్పటి జపాన్‌ ప్రధాని షింజో అబేతో కలిసి ముంబై- అహ్మదాబాద్ బుల్లెట్‌ ట్రెయిన్‌ ప్రాజెక్ట్‌కు పునాది రాయి వేశారు. భారతదేశానికి ఇది అత్యంత ప్రధానమైన రోజని మోదీ ప్రకటించారు. జపాన్‌ సహకారంతో ముంబై- అహ్మదాబాద్‌ల మధ్య 2022 ఆగస్టు 15 నాటికి బుల్లెట్‌ ట్రెయిన్‌ పరుగులు తీస్తుందని ఆయన వెల్లడించారు. బుల్లెట్ ట్రెయిన్ దేశానికి అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ప్రాజెక్ట్‌ అనడంలో సందేహం లేదు. ఈ ప్రాజెక్ట్‌ అంచనా రూ.1.08 లక్షల కోట్లు కాగా 81 శాతం సొమ్ము జపానే రుణంగా అందించనుంది. శంకుస్థాపన జరిగి మూడేళ్ళు పూర్తయింది. పూర్తవటానికి పెట్టుకున్న సమయం ఇంకా 20 నెలలు మాత్రమే ఉండగా ఇంతవరకు భూసేకరణ పూర్తి కాలేదు! 1380 హెక్టార్ల భూమి సేకరణ చేయవలసి ఉండగా ఇప్పటికి 60 శాతం భూమి మాత్రమే సేకరించగలిగారు. ఇదీ, ప్రధాని స్వంత రాష్ట్రమైన గుజరాత్‌లో, ఏడాది క్రితం వరకు బీజేపీ ప్రభుత్వమే ఉన్న మహారాష్ట్రలో ఒక ప్రతిష్ఠాకర ప్రాజెక్ట్‌ పురోగతి. ఈ పరిస్థితుల్లో బుల్లెట్ ట్రెయిన్ ప్రారంభ తేదీని ఏకంగా ఆరేళ్ళు పెంచి 2028కి మార్చుకోవాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. ప్రస్తుతానికి ఈ ప్రాజెక్ట్‌ పనులు నిలిచిపోయినట్టే. ప్రపంచవ్యాప్త పరిణామాల్ని విశ్లేషించగల శక్తి ఉన్న కొందరు విమర్శకులు భూసేకరణ ఎంత క్లిష్టమైన ప్రక్రియో తెలుసుకోకుండా మాట్లాడడం తగని పని.


వేల కోట్ల రూపాయలు వెచ్చించి చేసిన నిర్మాణాలను, రహదారుల్ని విస్మరించడం, కోట్లాది రూపాయల ప్రజాధనంతో నిర్మించిన ప్రజావేదికను మళ్ళీ కోట్లు ఖర్చు పెట్టి కూలకొట్టించటం, అత్యంత ఆకర్షణీయంగా అధునాతన సదుపాయాలతో నిర్మించిన హైకోర్టు భవనాన్ని పాడుబెట్టి హైకోర్టును కర్నూలుకు మార్చాలనుకోవడం తప్పు, అహేతుకం, రాష్ట్రానికి నష్టం అని మేధావులు ఎందుకు స్పష్టంగా చెప్పలేక పోతున్నారు? అమరావతి నిర్మాణం అయితే చంద్రబాబుకే పేరు వస్తుందని భావించడం వల్లా? శాశ్వత నిర్మాణాలు లేకపోవడం వల్లే ప్రస్తుత ప్రభుత్వం రాజధానిని మారుస్తుందని చెప్పడం సబబేనా? అలా చెప్పడం అమరావతి వ్యతిరేక కుట్రలో భాగమనే భావించాలి.


ప్రభుత్వం ఎంత నిరంకుశంగా ఉన్నా, పాలకులు ఎంత కరకుగా ఉన్నా, అధికార పార్టీ నాయకులు ఎంత సంస్కారహీనంగా మాట్లాడుతూ ఉన్నా, వ్యక్తిత్వం, స్వాభిమానం లేని వారు రాజకీయ పార్టీల బానిసలుగా మారిపోయినా అమరావతి ప్రాంత మహిళలు 300 రోజులకు పైగా ఎండల్లో వానల్లో చివరికి కొవిడ్‌ మహమ్మారి ప్రళయంలోనూ చలించకుండా చేస్తున్న నిరసనలు, ఆందోళనలు వారి దీక్షాదక్షతలకు, అమరావతిపై వారికి ఉన్న నమ్మకానికి నిదర్శనం. మాట తప్పిన ప్రభుత్వాలకు విలువ ఉంటుందా? విభజన సమయంలో నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఇచ్చిన హామీలకు విలువ లేదు. నిర్దాక్షిణ్యంగా రాష్ట్రాన్ని విడదీసారని పొత్తిళ్ళలో పసిబిడ్డ లాంటి ఆంధ్రప్రదేశ్‌కు అండగా నేనుంటా అన్న నేటి ప్రధాని మోదీ హామీలకూ విలువ లేదు. నాడు అమరావతే రాజధాని అన్న ప్రస్తుత ముఖ్యమంత్రి మాటలకూ విలువ లేదు.


అమరావతి రైతులు చేసింది త్యాగం కాదని, అసలు వారు రైతులే కాదని, దురహంకారంతో మాట్లాడేవారితో పాటు, మేధావులుగా సమాజంలో చలామణి అవుతూ అర్థం లేని వాదనలు చేసేవారు కాస్త కళ్ళు తెరచి లోకాన్ని చూడాలి. నల్లగొండ, మహబూబ్‌నగర్‌ జిల్లాల రైతులు తమ భూములను ఫార్మాసిటీకి ఇవ్వబోమని ఎందుకు అంటున్నారు? మహారాష్ట్ర, గుజరాత్ రైతులు ప్రతిష్ఠాత్మక బుల్లెట్‌ ట్రైయిన్ ప్రాజెక్టుకు భూములు ఇవ్వడానికి ఎందుకు తిరస్కరిస్తున్నారు? ఆ ప్రభుత్వాలపై ఎలాంటి వ్యాఖ్య చేయకుండా రెండు, మూడేళ్ళలో దాదాపు 35 వేల ఎకరాలు సాఫీగా, ప్రజల నమ్మకంతో సేకరించిన ప్రభుత్వాన్ని విమర్శించేవారు నిష్పాక్షిక విశ్లేషకులు కాజాలరు. వారు కొందరి ఆస్థాన విద్వాంసులు మాత్రమే. ఇక అమరావతిలో రియల్‌ ఎస్టేట్‌ గురించి మాట్లాడేవారు గుజరాత్‌లో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన డొలేరా ప్రాజెక్టు గురించి తెలుసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం ఎంత ప్రోత్సాహం అందించినా, మద్దతు ఇచ్చినా ప్రస్తుతం అక్కడ భూమికి డిమాండ్‌ లేదు. ఈ వాస్తవాన్ని అమరావతిపై దుష్ప్రచారం చేస్తున్న మేధావులు గుర్తిస్తారా? 


అమరావతి విషయంలో జగన్ ప్రభుత్వం ఎంత మొండిగా వ్యవహరిస్తున్నదో అంతగా ప్రభుత్వానికి అడ్డంకులు ఎదురవుతున్నాయి. శాసన మండలి నుంచి హైకోర్టు, సుప్రీంకోర్టు వరకు ఏదొక వివాదం ప్రభుత్వాన్ని, ప్రభుత్వాధినేతలను వెంటాడుతూనే ఉన్నాయి. అమరావతిని ముంపు ప్రాంతం అని ప్రచారం చేసినా అమరావతి మునగలేదు. చివరకు పంచాయతీ కార్యాలయాలకు వేసే రంగులు, ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధన వరకు ప్రతి విషయంలోనూ కోర్టుల నుంచి ప్రతికూలతలే ఎదురవుతున్నాయి. అసలే అంతంత మాత్రంగా ఉన్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కొవిడ్‌తో పూర్తిగా చతికిలపడింది. రాష్ట్రమంతా ప్రార్థనామందిరాలపై దాడులు, దహనాలు, ఇసుక లేక నిర్మాణ రంగ కార్మికుల ఆత్మహత్యలు, అకాల వర్షాలు, వరదలూ, అన్నీ అపశకునాలే. ఒక్క అమరావతి ప్రాంత అతివలే కాదు ఆంధ్రప్రదేశ్‌లో అన్యాయానికి గురవుతున్న అతివల ఆక్రోశాన్ని, ఆవేదనలను అవహేళన చేస్తున్న ఫలితమిది. 


-నరసింహ ప్రసాద్‌ గొర్రెపాటి

Follow Us on:
Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.