రాజ్యాధికార సాధనే బహుజనుల లక్ష్యం కావాలి

ABN , First Publish Date - 2022-06-28T06:26:37+05:30 IST

రాజ్యాధికార సాధనే బహుజనుల లక్ష్యం కావాలని, ఐకమత్యంతో కృషిచేస్తే అసాధ్యం కాదని రాజ్యసభ సభ్యుడు రామ్‌జీ గౌతం పిలుపునిచ్చారు.

రాజ్యాధికార సాధనే బహుజనుల లక్ష్యం కావాలి
బహుజన చైతన్యసభలో సంఘీభావం ప్రకటిస్తున్న ప్రతినిధులు

ఐకమత్యంతో కృషి చేస్తే అసాధ్యం కాదు

ఉత్తరాంధ్ర బహుజన చైతన్య సభలో ఎంపీ రాంజీ గౌతం

విశాఖపట్నం, జూన్‌ 27: రాజ్యాధికార సాధనే బహుజనుల లక్ష్యం కావాలని, ఐకమత్యంతో కృషిచేస్తే అసాధ్యం కాదని రాజ్యసభ సభ్యుడు రామ్‌జీ గౌతం పిలుపునిచ్చారు. సాహుమహరాజ్‌ జన్మదినోత్సవం సందర్భంగా ఆర్కేబీచ్‌లో కాళీమాత గుడి ఎదుట సోమవారం నిర్వహించిన ‘ఉత్తరాంధ్ర బహుజన చైతన్య సభ’కు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సోము రాంబాబు అధ్యక్షతన జరిగిన సభకు రామ్‌జీతోపాటు రాష్ట్ర అధ్యక్షుడు బి.పరంజ్యోతి, రాష్ట్ర కోఆర్డినేటర్‌ ఆర్‌.జె.మల్లిక్‌, జాతీయ కో ఆర్డినేటర్‌ ఆకాష్‌ఆనంద్‌లు హాజరయ్యారు.


తొలుత వీరు పూలే, అంబేడ్కర్‌, సాహుమహరాజ్‌ చిత్రపటాలకు పూలమాలవేసి  నివాళులర్పించి సభను ప్రారంభించారు. అనంతరం రామ్‌జీ మాట్లాడుతూ ఇప్పటి వరకు కుటుంబ పార్టీలే రాష్ట్రాన్ని ఏలుతున్నాయని, వీరి ప్రభుత్వాలేవీ ఉత్తరాంధ్రకు న్యాయం చేయలేదన్నారు. రాయలసీమ నాయకులు ప్రభుత్వాలను ఏర్పాటుచేసినా తమ ప్రాంతాన్నే అభివృద్ధి చేసుకోలేని వారు ఉత్తరాంధ్రను ఎలా అభివృద్ధి చేస్తారని ప్రశ్నించారు.


బహుజనుల రాజ్యంతోనే అభివృద్ధి సాధ్యమని, బహుజనులంతా ఏకమైతే రాజ్యాధికారం సొంతమవుతుందని చెప్పారు. రానున్న ఎన్నికల్లో మాయావతి నాయకత్వంలో బహుజన చైతన్య సభను రాష్ట్రంలో బలోపేతం చేసేదిశగా ప్రతి ఒక్కరూ కదలాలని పిలుపునిచ్చారు. పరంజ్యోతి మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధిని, ప్రజల బాగోగులను పట్టించుకోని పార్టీలను సాగనంపేందుకు ఏకతాటిపైకి రావాలని, రానున్న ఎన్నికల్లో బుద్ధిచెప్పాలన్నారు.


జాతీయ కోఆర్డినేటర్‌ ఆకాష్‌ ఆనంద్‌ మాట్లాడుతూ కాన్షీరాం బాటలో బహుజనులంతా నడవాలని, సార్వత్రిక ఎన్నికల్లో జాతీయ, రాష్ట్ర స్థాయిలో బలోపేతం అయితే ప్రభుత్వాలను శాసించవచ్చునని చెప్పారు. ఈ సభలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కరణం తిరుపతిరావు, రాష్ట్ర కోశాధికారి కె.ప్రసాద్‌రావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి.ప్రకాశరావు, శివప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.  

Updated Date - 2022-06-28T06:26:37+05:30 IST