గిరిజన యువతకు ఉపాధి కల్పనే లక్ష్యం

ABN , First Publish Date - 2022-08-18T06:17:34+05:30 IST

జిల్లాలో గిరిజన నిరుద్యోగ యువతీ, యువకులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యమని ఎస్పీ పి.సతీష్‌కుమార్‌ తెలిపారు.

గిరిజన యువతకు ఉపాధి కల్పనే లక్ష్యం
సమావేశంలో మాట్లాడుతున్న ఎస్పీ సతీష్‌కుమార్‌, పక్కన సీఐ సుధాకర్‌

జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్‌ 

పాడేరు రూరల్‌, ఆగస్టు 17: జిల్లాలో గిరిజన నిరుద్యోగ యువతీ, యువకులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యమని ఎస్పీ పి.సతీష్‌కుమార్‌ తెలిపారు. తన కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కమ్యూనిటీ పోలీసింగ్‌లో భాగంగా గిరిజన మహిళలకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు జీఎంఆర్‌ సంస్థ, నాగావళి స్వయం ఉపాధి శిక్షణా సంస్థ సహకారంతో తగిన చర్యలు చేపడుతున్నామన్నారు. జి.మాడుగుల, ముంచంగిపుట్టు, అడ్డతీగల, వై.రామవరం, గంగవరం మండలాలకు చెందిన 35 మంది గిరిజన యువతులకు గత నెల 8వ తేది నుంచి ఈ నెల 7వ తేదీ వరకు విజయనగరం జిల్లా రాజాంలోని కళాశాలలో హోం నర్సింగ్‌ కోర్సులో శిక్షణను అందించామన్నారు. శిక్షణ పొందిన వారిలో జి.మాడుగుల, ముంచంగిపుట్టు మండలాలకు చెందిన 17 మంది గిరిజన యువతులను ఉద్యోగాల కోసం హైదరాబాదుకు తరలిస్తున్నామన్నారు. మరో 15 మంది యువతులను వారి కోరిక మేర ఈ నెల 23వ తేదీన హైదరాబాద్‌కు తరలిస్తామని ఎస్పీ చెప్పారు. వారికి ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ వారి ఆధ్వర్యంలో ఉచిత భోజన వసతి సౌకర్యాలను కల్పించి నెలకు రూ.12 వేలు జీతం అందించనున్నట్టు ఆయన తెలిపారు. గిరిజన ప్రాంత నిరుద్యోగ యువతీ, యువకులు చెడుమార్గం పట్టకుండా ఉపాధి అవకాశాలను కల్పించేందుకు పోలీస్‌ శాఖ కృషి చేస్తుందన్నారు. త్వరలోనే మరో వెయ్యి మంది యువతులకు హోం  నర్సింగ్‌ కోర్సులో శిక్షణ అందిస్తామని, వారికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు అవసరమైన చర్యలు చేపడతామని చెప్పారు. పోలీస్‌ శాఖ అందిస్తున్న ఈ సేవలను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఎస్పీ కోరారు. ఈ కార్యక్రమంలో సీఐ బి.సుధాకర్‌, ఎస్‌ఐలు జి.లక్ష్మణరావు, జి.రంజిత్‌కుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-08-18T06:17:34+05:30 IST