ప్రతిపక్ష శిబిరంలో పొడుస్తున్న పొత్తు!

ABN , First Publish Date - 2022-03-15T08:37:30+05:30 IST

రాష్ట్రంలో వైసీపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాల మధ్య పొత్తు పొడుస్తోందా? తమ పార్టీ ఆవిర్భావ సభలో జనసేనాని పవన్‌ కల్యాణ్‌ చేసిన ప్రకటన ఈ దిశగా స్పష్టమైన సంకేతాలిచ్చింది. వైసీపీ వ్యతిరేక ఓటును..

ప్రతిపక్ష శిబిరంలో పొడుస్తున్న పొత్తు!

  • పవన్‌ ప్రకటనతో సంకేతాలు
  • రాష్ట్రంలో కొత్త రాజకీయ సమీకరణలు?
  • ఇది సాకారం కాకుండా వైసీపీ ఎత్తులు
  • చిరంజీవితో సీఎం జగన్ మంతనాలు?
  • తమ్ముడు తన మాట వినడన్న మెగాస్టార్!
  • వైసీపీ యత్నాలకు జనసేనాని అడ్డుకట్ట

(అమరావతి-ఆంధ్రజ్యోతి) : 

రాష్ట్రంలో వైసీపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాల మధ్య పొత్తు పొడుస్తోందా? తమ పార్టీ ఆవిర్భావ సభలో జనసేనాని పవన్‌ కల్యాణ్‌ చేసిన ప్రకటన ఈ దిశగా స్పష్టమైన సంకేతాలిచ్చింది. వైసీపీ వ్యతిరేక ఓటును చీలనివ్వబోమని ఆయన చేసిన ప్రకటన రాజకీయంగా సంచలనం రేపింది. రాష్ట్రంలో కొత్త రాజకీయ సమీకరణలకు ఈ పరిణామం ఊతమిస్తుందని.. వైసీపీ వ్యతిరేక పార్టీలు ఏకతాటిపైకి రావడానికి అనువైన వాతావరణాన్ని ఇది కల్పిస్తుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. పవన్‌ ప్రకటన పాలక వైసీపీ వర్గాలను నిరాశపరచినట్లు కనిపిస్తోంది. మంత్రి పేర్ని నాని జనసేనానిపై చేసిన విమర్శలు ఆ పార్టీలోని నిస్పృహకు నిదర్శనమని రాజకీయ వర్గాలు అంటున్నాయి. ప్రతిపక్షాలు ఏకం కాకూడదని.. అవి కలిస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఆ కూటమికే పడుతుందని అధికార పక్షం ఆందోళన చెందుతోంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చేందుకు.. ప్రతిపక్షాలు చేతులు కలపకుండా అడ్డుకోవడానికి ఆ పార్టీ తెర వెనుక వ్యూహ రచన చేస్తున్నప్పటికీ.. దాని కసరత్తు ఫలించలేదని ఈ సంకేతాలు సూచిస్తున్నాయని సదరు వర్గాలు చెబుతున్నాయి. 2014 ఎన్నికల్లో టీడీపీ-బీజేపీ కూటమికి జనసేన బయటి నుంచి మద్దతిచ్చింది. 2019 ఎన్నికల్లో ఈ పార్టీలు చెదిరిపోయి.. వేటికవి విడివిడిగా పోటీ చేశాయి. బీజేపీపై టీడీపీ తీవ్ర స్థాయిలో దాడి చేయడంతో ప్రతివ్యూహంగా వైసీపీకి బీజేపీ నుంచి అనధికార మద్దతు లభించింది. కానీ ఆ ఎన్నికల తర్వాత క్రమంగా వాతావరణం మారుతూ వచ్చింది.




క్షేత్ర స్థాయిలో టీడీపీ, జనసేన కొంత సన్నిహితమయ్యాయి. గోదావరి జిల్లాల్లో కొన్ని చోట్ల ఈ రెండు పార్టీలు ఇటీవలి స్థానిక ఎన్నికల్లో కలిసి పోటీ చేశాయి.  కలిసి ప్రయాణించడానికి ఆసక్తిగా ఉన్నట్లు టీడీపీ అధినాయకత్వం కూడా సంకేతాలిచ్చింది. బీజేపీ కూడా గతంతో పోలిస్తే వైసీపీ పాలనపై విమర్శలు పెంచింది.


విడిగా పోటీకి జగన్‌ ఒత్తిడి!

2009 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, మెగాస్టార్‌ చిరంజీవి సారథ్యంలోని ప్రజారాజ్యం పార్టీ విడివిడిగా పోటీ చేయడం వల్లే వైఎస్‌ రాజశేఖరరెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్‌ రెండో సారి తేలిగ్గా అధికారంలోకి రాగలిగిందని, అదే మాదిరిగా ఇప్పుడు కూడా ప్రతిపక్షాలు విడివిడిగా పోటీ చేస్తే తమ పని సులువు అవుతుందని వైసీపీ నేతలు అంతర్గత విశ్లేషణల్లో చెబుతూ వస్తున్నారు. బీజేపీ, జనసేనల నాయకత్వాన్ని అందుకు ఒప్పించడానికి వైసీపీ నాయకత్వం కొన్ని ప్రయత్నాలు చేసిందని అంటున్నారు. కొన్ని రోజుల క్రితం చిరంజీవిని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి తాడేపల్లిలోని తన నివాసానికి ఆహ్వానించి మధ్యాహ్న భోజన విందు ఇచ్చారు. సినిమా టికెట్ల వ్యవహారంపై మాట్లాడేందుకు పిలిపించారని పైకి చెప్పినా.. నిజానికి ఆ భేటీలో రాజకీయ చర్చ జరిగిందని ప్రచారం ఉంది. పవన్‌ విడిగా పోటీ చేస్తే ఆయనకు మున్ముందు మంచి రాజకీయ భవిష్యత్‌ ఉంటుందని.. ఆయన్ను ఇందుకు ఒప్పించాలని చిరంజీవిని ముఖ్యమంత్రి కోరారన్నది సదరు ప్రచారం సారాంశం. కానీ తన తమ్ముడు తన మాట వినడని, ఈ విషయంలో తానేమీ  చేయలేనని చిరంజీవి నిస్సహాయత వ్యక్తం చేశారని కూడా అంటున్నారు.


ఈ ప్రచారాల నడుమ రాజకీయ సమీకరణలు ఎలా ఉండబోతున్నాయన్నది రాజకీయ వర్గాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. కానీ సోమవారం పార్టీ ఆవిర్భావ సభలో చేసిన ప్రకటనతో పవన్‌ ఈ ఊహాగానాలకు తెర దించారు. వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వబోనని ఆయన చేసిన ప్రకటనకు చాలా రాజకీయ ప్రాధాన్యం ఉందని, వైసీపీ ప్రయత్నాలకు ఆయన అడ్డుకట్ట వేశారని జనసేనలోని కొందరు సీనియర్లు వ్యాఖ్యానిస్తున్నారు. వైసీపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు ఒక్కటిగా ఉంటాయని బలమైన సంకేతం ఇచ్చారని, దీనివల్ల రాజకీయ సమీకరణలు మారతాయని విశ్లేషిస్తున్నారు. ‘జగన్‌ ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతోంది. ఈ సమయంలో ప్రతిపక్షాలు ఒక్కటి కాబోతున్నాయన్న ప్రచారం అధికార పార్టీని బలహీనపరచి.. ప్రతిపక్షాలకు బలం చేకూరుస్తుంది. ప్రతిపక్ష శిబిరంలో దూకుడు పెరుగుతుంది’ అని ఆ పార్టీ నేత ఒకరు పేర్కొన్నారు. ఆవిర్భావ  సభలో తన ప్రసంగాన్ని పవన్‌ ఆచితూచి తయారు చేసుకున్నట్లు కనిపిస్తోంది. వైసీపీ ప్రభుత్వ పాలన తీరుపై బలంగా దాడి చేస్తూనే ఆ పార్టీలో కూడా కొంత మంది మంచి నేతలు ఉన్నారని, ఆ పార్టీ కేడర్‌ను తాము శత్రువుల్లా చూడబోమని కొంత అనునయంగా మాట్లాడారు. ఇది అధికార పక్షంలో అసంతృప్తిగా ఉన్న కొందరు నేతలను దువ్వే ప్రయత్నంగా కనిపిస్తోందని రాజకీయ వర్గాలు అంటున్నాయి.

Updated Date - 2022-03-15T08:37:30+05:30 IST