గల్వాన్‌ వీరులకు సైన్యం ఘన నివాళి

ABN , First Publish Date - 2021-06-16T06:18:22+05:30 IST

సరిగ్గా ఏడాది కిందట లద్దాఖ్‌లోని గల్వాన్‌ లోయ లో చైనా సైన్యంతో జరిగిన అనూహ్య ఘర్షణలో అమరులైన జవాన్ల వీరత్వాన్ని గుర్తుచేసుకొంటూ భారత సైన్యం వారికి మంగళవారం ఘనంగా నివాళులు అర్పించింది. అత్యంత ఎత్తయిన పర్వత ప్రాంతాలను సైతం లెక్కచేయకుండా దేశ సమగ్రత,

గల్వాన్‌ వీరులకు సైన్యం ఘన నివాళి

ఆర్మీ చీఫ్‌, ఉన్నతాధికారుల శ్రద్ధాంజలి

అమర జవాన్లకు సోనియా, రాహుల్‌ నివాళులు


న్యూఢిల్లీ, జూన్‌15: సరిగ్గా ఏడాది కిందట లద్దాఖ్‌లోని గల్వాన్‌ లోయ లో చైనా సైన్యంతో జరిగిన అనూహ్య ఘర్షణలో అమరులైన జవాన్ల వీరత్వాన్ని గుర్తుచేసుకొంటూ భారత సైన్యం వారికి మంగళవారం ఘనంగా నివాళులు అర్పించింది. అత్యంత ఎత్తయిన పర్వత ప్రాంతాలను సైతం లెక్కచేయకుండా దేశ సమగ్రత, సౌర్వభౌమత్వం కోసం ప్రాణాలొడ్డిన సైనికుల త్యాగం దేశచరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని  ఆర్మీ తన నివాళిలో పేర్కొంది. నాటి ఘర్షణలో అసువులు బాసిన సైనికులకు... భారత ఆర్మీ చీఫ్‌ జనరల్‌ ఎం.ఎం.నరవాణె, సైన్యానికి చెందిన ఇతర ఉన్నతాధికారులు శ్రద్ధాంజలి ఘటించారు. లేహ్‌లో సైనిక కార్యకలాపాలు నిర్వహించే 14 కార్ప్స్‌కు చెందిన ఉన్నతాధికార్లు కూడా అమర జవాన్లకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మేజర్‌ జనరల్‌ ఆకాష్‌ కౌషిక్‌..  లేహ్‌లోని యుద్ధవీరుల స్మారక చిహ్నం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి సైనికుల త్యాగాలను కొనియాడారు.


నాటి ఘర్షణలో ముందుండి పోరాడి, భారతీయ సైనికులకు స్ఫూర్తిగా నిలిచిన కల్నల్‌ సంతోష్‌ బాబు, ఇతర సైనికుల త్యాగాలను సైన్యం ఈ సందర్భంగా శ్లాఘించింది. దాదాపు నాలుగున్నర దశాబ్ధాల తర్వాత గతేడాది జూన్‌ 15న తూర్పు లద్దాఖ్‌లోని గల్వాన్‌ లోయలో చైనా, భారత్‌ సైన్యాల మధ్య తీవ్రస్థాయి ఘర్షణ తలెత్తిన విషయం తెలిసిందే. ఇరుదేశాల నుంచి భారీగా సైనిక మోహరింపులకు సైతం దారితీసిన ఆ ఘర్షణలో 20మంది భారతీయ సైనికులు అ మరులయ్యారు. 


సోనియా, రాహుల్‌ నివాళులు

గల్వాన్‌ లోయలో చైనా సైన్యంతో పోరాడుతూ దేశం కోసం ప్రాణాలర్పించిన భారత జవాన్లకు కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ నివాళులు అర్పించారు. చైనాతో ఘర్షణకు దారితీసిన పరిస్థితులను దేశానికి వివరించడంలో కేంద్రం విఫలమైందని సోనియా ఈ సందర్భంగా విమర్శించారు. రాహుల్‌ గాంధీ కూడా అమర జవాన్లకు నివాళులు తెలిపారు. 

Updated Date - 2021-06-16T06:18:22+05:30 IST