వెన్ను వణుకుతోంది!

ABN , First Publish Date - 2020-11-13T03:59:56+05:30 IST

జిల్లాలో ప్రధాన రహదారులతో పాటు గ్రామాలకు వెళ్లే రోడ్లు దారుణంగా తయారవుతున్నాయి. ఇప్పటికే గోతులతో నిండి ఉన్నవి పూర్తిగా రూపు మారిపోతున్నాయి. నడవడానికి కూడా వీలులేకుండా భయపెడుతున్నాయి. రహదారులపై ప్రయాణం చేయాలంటే వాహన చోదకులు వణుకుతున్నారు.

వెన్ను వణుకుతోంది!
విజయనగరంలోని ఓ రహదారి

అడుగడుగునా గోతులు

ఇదీ జిల్లాలో రహదారుల దుస్థితి

మరమ్మతులకు గురవుతున్న వాహనాలు

వాహనదారులకు అనారోగ్య సమస్యలు

కలెక్టరేట్‌, నవంబరు 12: జిల్లాలో ప్రధాన రహదారులతో పాటు గ్రామాలకు వెళ్లే రోడ్లు దారుణంగా తయారవుతున్నాయి. ఇప్పటికే గోతులతో నిండి ఉన్నవి పూర్తిగా రూపు మారిపోతున్నాయి. నడవడానికి కూడా వీలులేకుండా భయపెడుతున్నాయి. రహదారులపై ప్రయాణం చేయాలంటే వాహన చోదకులు వణుకుతున్నారు. వెన్నెముకకు సంబంధించిన అనారోగ్య సమస్యలు తలెత్తుతుండడంతో ఆందోళన చెందుతున్నారు. ఒకటీ రెండూ కాదు... జిల్లాలో అనేక రహదారుల పరిస్థితి దయనీయంగా మారింది. గత నెలలో కురిసిన వర్షాలకు 700 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఆర్‌అండ్‌బీ, పంచాయతీ రహదారులు మరమ్మతులకు గురైనట్లు సంబంధిత శాఖ అధికారులు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. దాదాపు రూ.150 కోట్ల మేర నష్టం జరిగినట్లు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు.  


ఇదీ పరిస్థితి

జిల్లాలో గజపతినగరం నుంచి సాలూరు, బొబ్బిలి, పార్వతీపురం వెళ్లే రహదారులు రాళ్లు తేలిపోయి భయానకంగా దర్శనమిస్తున్నాయి. అడుగడుగునా గోతులు ఉన్నాయి. ప్రయాణికులు నిత్యం నరకయాతన  అనుభవిస్తున్నారు. కొందరు వాహన చోదకులు వెన్ను నొప్పి బారిన పడుతున్నారు. మరోవైపు వాహనాలూ షెడ్డుకు చేరుతున్నాయి. కొద్దికాలానికే దెబ్బతింటున్నాయి. రహదారి ప్రమాదాలు నిత్యకృత్యమయ్యాయి.  విజయనగరం నుంచి ఎస్‌.కోటకు వెళ్లే రహదారిలో ఎక్కడికక్కడే పెద్ద గోతులు పడ్డాయి. విజయనగరం పట్టణంలో చాలా రహదారులు రాళ్లు తేలి కనిపిస్తున్నాయి. గంట్యాడ మండలం నరవ నుంచి జగ్గాపురం, బొండపల్లి మండలం ఒంపల్లి, రాజకిండాం తదితర గ్రామాలకు వెళ్లే రోడ్లు చూస్తే షాకవ్వాల్సిందే. గుర్ల మండలంలోని నడుపూరు, భోపాలపురం, చింతలపేట వెళ్లే రహదారిలో ప్రయాణం అంటే ప్రజలు హడలుతున్నారు. ఇలా గ్రామీణ రహదారులు చాలా వరకూ దెబ్బతిన్నాయి. కొద్ది సంవత్సరాలుగా రహదారులు బాగు చేయకపోవడంతో ఈ సమస్య వచ్చింది. జిల్లాలో గత నెలలో వారం రోజుల పాటు కురిసిన వర్షాలకు ఆర్‌అండ్‌బీ రోడ్లు 388.6 కిలోమీటర్ల పొడవున పాడవ్వగా.. పంచాయతీరాజ్‌ రహదారులు 340.09 కిలోమీటర్లలో మరమ్మతులకు గురైనట్లు అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. పంచాయతీరాజ్‌ రహదారులకు తాత్కాలికంగా చేపట్టిన పనులకు రూ.404 లక్షలు నష్టం రాగా.. శాశ్వత నిర్మాణాలకు రూ.7718 లక్షల నష్టం వాటిల్లింది. ఆర్‌అండ్‌బీ రోడ్లకు సంబంధించి తాత్కాలిక పనులకు రూ.2455 లక్షలు, శాశ్వత రోడ్లకు రూ.11562 లక్షల మేర నష్టం జరిగినట్లు అధికారులు నివేదిక సమర్పించారు. అధ్వాన రహదారుల విషయాన్ని ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ విజయశ్రీ వద్ద ప్రస్తావించగా కొన్ని రహదారులకు మరమ్మతులు చేసేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పింపించామని చెప్పారు. నిధులు మంజూరైతే పనులు చేపడతామన్నారు.


 వెన్నెముక సమస్యలు తప్పవు

గుంతలు ఉన్న రహదారులపై ప్రయాణం వల్ల నడుము, భుజాలు, మెడ నొప్పులు అధికంగా వస్తాయి. ఇటీవీల కాలంలో ఈ సమస్యలపై ఎక్కువ మంది ఆసుపత్రులకు వస్తున్నారు. ప్రయాణ సమయంలో గుంతల్లో వాహనాలు దిగడం వల్ల వెన్నెముక డిస్క్‌ల్లో కదిలిక ఎక్కువగా వచ్చి జాయింట్లు అరిగిపోయే ప్రమాదం ఉంది. దూర ప్రాంతాలకు ప్రయాణం చేసే వారు కనీసం రెండు గంటలకు ఒకసారి కాస్త విశ్రాంతి తీసుకోవాలి. ద్విచక్ర వాహనాలపై ప్రయాణం చేసేవారు తేలిక పాటి హెల్మెట్‌ ధరించాలి. 

                                            - డాక్టర్‌ భూపతి, ఎముకల వ్యాధి నిపుణులు, విజయనగరం 


Updated Date - 2020-11-13T03:59:56+05:30 IST