ఇదెక్కడి దా‘రుణం’

Published: Thu, 30 Jun 2022 05:28:43 ISTfb-iconwhatsapp-icontwitter-icon
ఇదెక్కడి దారుణం

ఇన్‌స్టంట్‌ లోన్లు తీసుకున్నవారిపై వేధింపులు..

అప్పు తీరినా ఇంకా చెల్లించాలంటూ ఫోన్లు

కాంటాక్ట్‌ లిస్ట్‌లోని స్నేహితులు, 

బంధువులకూ బెదిరింపులు

వేధింపులు తట్టుకోలేక అదృశ్యమైన బాధితుడు

హైదరాబాద్‌ సిటీ, జూన్‌ 29 (ఆంధ్రజ్యోతి): ఇటీవల ఓ యువతికి గుర్తుతెలియని వ్యక్తి ఫోన్‌ చేశాడు. ‘మీ స్నేహితుడు రాజేశ్‌ (పేరు మార్చాం) మా వద్ద ఇన్‌స్టంట్‌ లోన్‌ తీసుకొని చెల్లించడం లేదు.. కాబట్టి ఆ లోన్‌ మీరు తీర్చాలి’ అని దబాయించాడు. ఎవరో లోన్‌ తీసుకుంటే నేనెందుకు కట్టాలంటూ ఆ యువతి నిలదీసింది. ‘లోన్‌ తీసుకున్న వ్యక్తి ఫోన్‌ కాంటాక్టు లిస్టులో మీ నంబర్‌ కూడా ఉంది. మా లోన్‌ తీరకపోతే మీరందరూ అతడి బాకీ తీర్చాల్సి ఉంటుంది. అందుకే మీరు వెంటనే లోన్‌ చెల్లించండి’ అన్నాడు. మరుసటి రోజు మళ్లీ ఫోన్‌ చేసి అసభ్యంగా మాట్లాడి వేధించాడు. ‘లోన్‌ చెల్లించకపోతే నీ నంబర్‌ను అశ్లీల సైట్లో పెట్టేస్తాం.. నీ ఫోటోను మార్ఫింగ్‌ చేసి సోషల్‌ మీడియాలో పోస్టు చేయడంతోపాటు మీ బంధువులకు, స్నేహితుల నంబర్‌లకు పంపిస్తాం.. మీ దిక్కున్న చోట చెప్పుకోండి’ అంటూ నీచంగా మాట్లాడాడు. దాంతో ఆ యువతి భయపడి... లోన్‌ తీసుకున్న స్నేహితుడికి కాల్‌ చేసి జరిగిన విషయం చెప్పింది. అప్పటికే అతడు మానసిక క్షోభ అనుభవిస్తుండటంతో ఏం చేయాలో అర్థం కాలేదు. దారుణంగా వేధిస్తున్నారంటూ అతడూ గొల్లుమన్నాడు. ఇద్దరూ కలిసి సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇప్పటివరకు ఇన్‌స్టంట్‌ రుణం తీసుకున్న వారి ని మాత్రమే లక్ష్యంగా చేసుకొని వేధించిన కేటుగాళ్లు.. ఇప్పుడు వారి కాంటాక్టు లిస్టులో ఉన్న నంబర్లకూ ఫోన్‌లు చేసి రుణం తీర్చాలంటూ దారుణంగా వేధిస్తున్నారు. కాంటాక్టు లిస్టులో ఉన్న తల్లిదండ్రులతోపాటు.. బంధువులు, స్నేహితులను రుణ దందాలో ఇరికించి పరువుతీస్తున్నారు. గడచిన రెండు నెలల్లో అన్ని కమిషనరేట్ల పరిధిలో కలిపి 300పైగా ఇన్‌స్టంట్‌ రుణ వేధింపుల కేసులు నమోదైనట్లు సైబర్‌ క్రైం పోలీసులు తెలిపారు.

కేటుగాళ్ల కీచక పర్వం

నగరంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో పనిచేస్తున్న మహిళకు.. తన కొడుకు ఆరోగ్యం బాగోలేకపోవడంతో అత్యవసరంగా డబ్బులు అవసరం అయ్యాయి. ఎక్కడా అప్పు దొరక్కపోవడంతో ఆన్‌లైన్‌లో మూడు యాప్‌ల ద్వారా రూ.21వేల వరకు ఇన్‌స్టంట్‌ లోన్‌ తీసుకుంది. తీసుకున్న రుణానికి వాయిదాల పద్ధతిలో సుమారు రూ.60వేలకు పైగా చెల్లించింది. అయినా ఇంకా డబ్బులు చెల్లించాలంటూ ఆమెకు వేధింపులు మొదలయ్యాయి. ఫోన్‌ తీయకపోతే స్నేహితులకు, బంధువులకు, ఆమెతోపాటు ఆస్పత్రిలో పనిచేస్తున్న కొలీగ్స్‌కు అసభ్యకర మెసేజ్‌లుపెట్టి వేధిస్తున్నారు. సదరు మహిళను మోసగత్తెగా చిత్రీకరించడంతోపాటు.. ఆమె ఫొటోను అశ్లీలంగా మార్ఫింగ్‌ చేసి తండ్రికి, తల్లికి, కొలీగ్స్‌కు పంపారు. దీంతో ఆమె మానసికంగా తల్లడిల్లిపోయింది. కన్నవాళ్లు ఆ ఫోటో చూసి తట్టుకోలేకపోయారు. స్నేహితులు, బంధువుల ముందు పరువుపోయిందని భావించిన ఆ బాధితురాలు ఆత్మహత్య చేసుకోవాలనుకుంది. కానీ భర్త అడ్డుపడటంతో ఆగిపోయింది. భర్తతో కలిసి సైబరాబాద్‌ సైబర్‌ క్రైం పోలీసులను ఆశ్రయించింది. ‘ఎలాగైనా ఈ వేధింపుల నుంచి గట్టెక్కించండి సార్‌’ అని ఆమె వేడుకుంది.

వద్దన్నా రుణం.. చెల్లించినా వేధింపులు

కొద్దిరోజుల క్రితం ఓ యువకుడికి గూగుల్‌ ప్లేస్టోర్‌లో రూపీ టైగర్‌ అనే యాప్‌ కనిపించింది. అతి తక్కువ వడ్డీకే ఇన్‌స్టంట్‌ లోన్‌ ఇస్తామని ఉండటంతో దాన్ని డౌన్‌లోడ్‌ చేసుకున్నాడు. వడ్డీ ఎంత పడుతుందో తెలుసుకోవాలంటే బ్యాంకు ఖాతా సహా అన్ని వివరాలను ఇవ్వాలనే నిబంధన ఉండటంతో యాప్‌లో ఆ వివరాలు నింపా డు. వడ్డీ వివరాలు చెప్పకుండానే, లోన్‌ గురించి అడగకుండానే రూ.6వేలు రుణం మంజూరైనట్లు మెసేజ్‌ వచ్చింది. వెంటనే రూ.3300 బ్యాంకు అకౌంట్లో జమయ్యాయి. మిగతా రూ.2700 ప్రాసెసింగ్‌ ఫీజు కింద మి నహాయించుకున్నట్లు చూపించారు. ఇక అప్పటి నుంచి డబ్బులు చెల్లించాలంటూ వేధించడం మొదలుపెట్టారు.

ఇతర దేశాల్లో ఐపీ అడ్ర్‌సలు

ఇన్‌స్టంట్‌ రుణ దందాకు పాల్పడుతున్న కేటుగాళ్లు.. ఐపీ అడ్ర్‌సలను నేపాల్‌, ఫిలిప్పీన్స్‌ దేశాలకు మార్చారు. ఈ మేరకు సైబర్‌ క్రైం పోలీసుల విచారణలో తేలినట్లు సమాచారం. ఈ నేరగాళ్లు గతంలో దేశంలోని వివిధ నగరాల నుంచి కార్యకలాపాలను నిర్వహించేవారు. అయితే 2020, 2021లో పోలీసులు దాడులు జరపడంతో.. తమ మూలాలను ఇతర దేశాలకు తరలించారు. ఆ దేశాల చట్టాలు వేరుగా ఉండటంతో నేరస్థులను పట్టుకోవడం కష్టంగా మారుతోందని పోలీసులు అంటున్నారు.

దందా వెనుక చైనా కేటుగాళ్లు

ఇన్‌స్టంట్‌ రుణ దందా వెనుక చైనాకు చెందిన కేటుగాళ్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. 2020, 2021లో చైనాకు చెందిన ఇన్‌స్టంట్‌ లోన్‌ యాప్‌లలో చిక్కుకొని అనేకమంది నరకం అనుభవించారు. వేధింపులు తట్టుకోలేక చాలామంది ఆత్మహత్య చేసుకున్నారు. భారత్‌ను టార్గెట్‌గా చేసుకున్న చైనా కేటుగాళ్లు.. యాప్‌ల ద్వారా దేశవ్యాప్తంగా లక్షలాది మందిని ఇన్‌స్టంట్‌ రుణాల వలలో చిక్కుకునేలా చేశారు. 30ు పైగా వడ్డీ వసూలు చేసి వందల కోట్లు కొల్లగొట్టారు. ఇప్పు డు లోన్‌పై ఏకంగా 150ు వడ్డీని వసూలు చేయాలని వారు లక్ష్యంగా పెట్టుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలోనే.. మొత్తం డబ్బులు చెల్లించినప్పటికీ రుణం తీరలేదని, ఇంకా చెల్లించాలంటూ వేధిస్తున్నారు. బంధువులను, స్నేహితులను, కాంటాక్టు లిస్టులో ఉన్న వారందరినీ టార్గెట్‌ చేసి అందినంత దండుకుంటున్నారు. బెంగళూరు, ముంబై, ఢిల్లీ, గుర్గావ్‌, కోల్‌కతా వంటి నగరాల్లో కాల్‌సెంటర్‌లను ఏర్పాటుచేసి ఈ దందాను కొనసాగిస్తున్నారు. గతంలో హైదరాబాద్‌లో ఉన్న కాల్‌ సెంటర్‌ను పోలీసులు సీజ్‌ చేసి, నిర్వాహకులను కటకటాల్లోకి నెట్టారు. ఇప్పుడు మళ్లీ ఇన్‌స్టంట్‌ దందా వేధింపులు పెరిగిపోవడంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. 

యాప్‌ నిర్వాహకుల వేధింపులతో వ్యక్తి అదృశ్యం

బంజారాహిల్స్‌, జూన్‌ 29 (ఆంధ్రజ్యోతి): రుణ యాప్‌ల నిర్వాహకుల వేధింపులు భరించలేక ఓ వ్యక్తి ఇళ్లు వదిలి వెళ్లిపోయాడు. కూకట్‌పల్లి ఆల్విన్‌ కాలనీకి చెందిన ఎం.వినోద్‌కుమార్‌ బంజారాహిల్స్‌ రెయిన్‌బో ఆస్పత్రిలో సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్నాడు. ఆర్ధిక ఇబ్బందుల నుంచి బయటపడేందుకు మొబైల్‌ యాప్‌ల ద్వారా అప్పులు తీసుకున్నాడు. సకాలంలో రుణం చెల్లించకపోవడంతో యాప్‌ నిర్వాహకులు అతడి స్నేహితులకు, బంధువులకు మెసేజ్‌లు పంపించారు. దీంతో బాధితుడు సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదుచేశాడు. అయితే యాప్‌ నిర్వాహకుల వేధింపులు తీవ్రం కావడంతో ఈ నెల 28న... ‘బై, ఇక వెళుతున్నా’ అని భార్యకు మెసేజ్‌ పెట్టి ఫోన్‌ స్విచ్చాఫ్‌ చేశాడు. కంగారుపడ్డ భార్య  బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.