రజాకార్ల రణనినాదాలు!

ABN , First Publish Date - 2022-09-17T07:16:52+05:30 IST

హైదరాబాద్‌ సంస్థానాన్ని భారత యూనియన్‌లో విలీనం చేసి ఇక్కడ ఒక సంపూర్ణ జవాబుదారీ సర్కారు ఏర్పాటు డిమాండ్‌పై స్టేట్‌ కాంగ్రెస్‌ 1947 ఆగస్టులో అవిచ్ఛిన్న ఉద్యమాన్ని ప్రారంభించింది.

రజాకార్ల రణనినాదాలు!

హైదరాబాద్‌ సంస్థానాన్ని భారత యూనియన్‌లో విలీనం చేసి ఇక్కడ ఒక సంపూర్ణ జవాబుదారీ సర్కారు ఏర్పాటు డిమాండ్‌పై స్టేట్‌ కాంగ్రెస్‌ 1947 ఆగస్టులో అవిచ్ఛిన్న ఉద్యమాన్ని ప్రారంభించింది. ఉద్యమకారులపై నిజాం సైనికులు, పోలీసుల లాఠీలు విరిగాయి. పదివేల మందికి పైగా అరెస్టు చేసి జైల్లో పెట్టారు. రెండు వేలమంది దాకా ప్రాణాలు కోల్పోయారు. సర్కారు తన చేతిలోని సైనికులను, పోలీసులను, రజాకార్లను ఊర్లమీదికి వదిలింది. వారు ప్రజలపై గుండ్ల వర్షం కురిపించారు. రజాకార్లు గ్రామాల్లోని మహిళలపై అత్యాచారాలకు పాల్పడ్డారు.


ముస్లింల కోసం పాకిస్థాన్‌ ఏర్పాటు చేయాలంటూ ముస్లింలీగ్‌ ద్విజాతి సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం, దాన్ని కాంగ్రెస్‌ వ్యతిరేకించడంతో ఆ ప్రభావం నేరుగా హైదరాబాద్‌లోని ముస్లిం మీడియాపై పడింది. ముస్లిం పత్రికలు ముస్లింలీగ్‌కు వంతపాడసాగాయి. ఈ శక్తులన్నీ చేతులు కలిపి హైదరాబాద్‌లో మజ్లిస్‌ ఇత్తెహాదుల్‌ ముస్లిమీన్‌ పార్టీకి పురుడుపోశాయి. మజ్లిస్‌ క్రమంగా బలపడి ప్రభుత్వాన్ని కూడా తన గుప్పిట్లోకి తెచ్చుకొంది. 1947 ఆగస్టు 15 తర్వాత ఆ పార్టీ భారీ సంఖ్యలో రజాకార్లను చేర్చుకొని, సంస్థాగతంగా పనిచేయడం మొదలయ్యింది. మూడు, నాలుగు నెలల్లోనే వారి సంఖ్య రెండు లక్షలకు చేరుకుంది. హైదరాబాద్‌ను గత 600 ఏండ్లుగా మహమ్మదీయులు సంపూర్ణాధికారంతో పాలించారనీ, భవిష్యత్తులో కూడా తమ పాలన కొనసాగుతుందని మజ్లిస్‌ నేతలు ముస్లింలకు చెప్పడం మొదలుపెట్టారు.


స్వాతంత్య్రం తర్వాత హైదరాబాద్‌ సంస్థానాన్ని యూనియన్‌లో విలీనం చేసి ఒక బాధ్యతాయుత సర్కారు ఏర్పాటు కోసం ప్రజలు ఉద్యమించసాగారు. దీనికి స్టేట్‌ కాంగ్రెస్‌తో పాటు షెడ్యూలు కులాల నేతలు, కైస్త్రవులు, ఆది హిందూ లీగ్‌, అన్ని వర్గాలూ మద్దతు ప్రకటించాయి. ప్రజాస్వామ్యమంటే విముఖత పెంచుకొన్న మజ్లిస్‌ పార్టీ కాంగ్రెస్‌పై ఎదురుదాడికి దిగుతోంది. జవాబుదారీ సర్కారు డిమాండ్‌పై హిందువులకు ఎలాంటి హక్కూ లేదని మజ్లిస్‌ నేత కాసిం రిజ్వీ అనేకసార్లు ప్రకటించారు. ఈ డిమాండ్‌ చేసేవారు విశ్వాసఘాతకులనీ, వారంతా హైదరాబాద్‌ వదిలి వెళ్ళిపోవాలని వ్యాఖ్యానించారు. భారత యూనియన్‌లో హైదరాబాద్‌ను విలీనం చేస్తే యూనియన్‌తో పాటు స్టేట్‌లోని హిందువుల వినాశనం తప్పదని వార్నింగ్‌ ఇచ్చారు. హైదరాబాద్‌పై భారత్‌ సైన్యం దాడి చేస్తే రక్తం ఏరులై పారుతుందని, ఇంత ఘోరం జరిగితే ప్రపంచవ్యాప్తంగా ముస్లిం సమాజం చూస్తూ ఊరుకోదని ఆయన అన్నారు.


యుద్ధ ప్రేలాపనలు, మారణాయుధాలతో రజాకార్‌ సాయుధ దళాలు సైనిక కవాతులు నిర్వహించి హైదరాబాద్‌ అంతటా భయోత్పాత వాతావరణం సృష్టిస్తున్నాయి. తద్వారా ఒత్తిడి పెంచి భారత యూనియన్‌ను తమ దారికి తెచ్చుకొని ఒక అనుకూల పరిష్కారం సాధించుకోవాలన్నది మజ్లిస్‌ వ్యూహం. హైదరాబాద్‌ సమస్యకు శాంతియుత పరిష్కారం తాము కోరుకుంటున్నట్లుగా భారత ప్రభుత్వం స్పష్టం చేసేకొద్దీ... మజ్లిస్‌ నేతలు అంతే తీవ్రస్థాయిలో మిలిటెంట్‌ పోకడలతో భారత్‌ను భయపెట్టసాగారు. కానీ, మజ్లిస్‌ నేతల అరుపులూ, బెదిరింపులకూ హైదరాబాద్‌ స్టేట్‌లోని ప్రజలెవరూ బెంబేలెత్తలేదు. భారత యూనియన్‌ చలించలేదు. మజ్లిస్‌ పార్టీ ప్రస్తుత నాయకత్వం తమను ఎక్కడికి తీసుకుపోనున్నదో అన్న విషయాన్ని స్టేట్‌లో చదువుకొన్న ముస్లింలు ఆలోచించాల్సి ఉంటుంది. ఆ పార్టీ గమ్యం ఏమిటి? భారత యూనియన్‌ ఆధిపత్యానికి గండికొట్టగలమంటూ బీరాలు పలుకుతున్న మజ్లిస్‌ నాయకత్వ వ్యూహాన్ని వారు సక్రమంగా అర్థం చేసుకోగలరా? ఈ ధోరణిలో భారత్‌ను బెదిరించి, భయపెట్టి మజ్లిస్‌ ఏదైనా లబ్ధి పొందగలదా? హైదరాబాద్‌ స్టేట్‌లో ప్రజా సమరాన్ని సాయుధ బలగాలతో నిర్దాక్షిణ్యంగా అణచివేశాక మజ్లిస్‌ పార్టీ ఏ దేశ సానుభూతిని పొందగలదు? అపుడు భారతదేశంలోని నాలుగు కోట్లమంది ముస్లింలు మజ్లిస్‌ పార్టీ పట్ల సానుభూతి ఎందుకు చూపుతారు?


మజ్లిస్‌, స్టేట్‌లోని ముస్లింల ప్రయోజనాలను కాపాడుతున్న పార్టీగా నేను భావించడం లేదు. ముస్లింల ఉన్నతమైన సంప్రదాయాలు, విశ్వాసాలు, వారి సహనశీలత, న్యాయబద్ధత పట్ల నాకెంతో గౌరవం ఉంది. పరిస్థితులను జాగ్రత్తగా అర్థం చేసుకొని వ్యవహరించాల్సిందిగా నేను ముస్లింలను కోరుతున్నాను. నిరంకుశ పాలనతో అన్యాయంగా వ్యవహరిస్తున్న మజ్లిస్‌ నాయకత్వానికి మద్దతు పలకవద్దని కోరుతున్నాను. ముస్లింలకు శత్రువుగా కాదు... ఒక శ్రేయోభిలాషిగా వారినో ప్రశ్న అడుగుతున్నాను. మజ్లిస్‌ ప్రస్తుత నాయకత్వం పట్ల వారెందుకు అమిత సంతృప్తితో ఉన్నట్లు కనిపిస్తున్నారు? దక్కను గడ్డపై సంవత్సరాల తరబడి వారికి హిందువులతో కలిసిమెలిసి సహజీవనం చేసే ఆలోచన లేదా?  ప్రజల ఆశలు, ఆకాంక్షలను నిర్లక్ష్యం చేసి, స్వాతంత్య్రం కోసం ఉద్యమాన్ని పాశవికంగా అణచివేసే ప్రయత్నాలు జరిగితే దాని గురించి పట్టించుకొనేవారే లేరా? స్వేచ్ఛా స్వాతంత్యాల్ర కోసం జరిగే ఉద్యమాలను ఉక్కుపాదంతో అణచివేసిన వేలాది ఉదంతాలు చరిత్రలో మనకు కనిపిస్తాయి. కాబట్టి, విద్యావంతులైన ముస్లింలను నేను కోరేది ఒక్కటే. నాయకులు చేసే బూటకపు, దివాళాకోరు నినాదాలకు దూరంగా ఉంటూ జాగ్రత్తగా వ్యవహరించాలి. వివేకంతో, వాస్తవ దృక్పథంతో పనిచేసే నేతను ఎన్నుకొని, తమ సమస్యకు శాంతియుత పరిష్కారం గురించి ఆలోచించాలి.


చెరుకు మాధవరెడ్డి


(నాటి హైదరాబాద్‌ స్టేట్‌లో బాధ్యతాయుత ప్రభుత్వ ఏర్పాటు ఆవశ్యకతను వివరిస్తూ సోషలిస్టు సీనియర్‌ నేత, మాజీ ఎంపీ చెరుకు మాధవరెడ్డి 1948లో ‘హైదరాబాద్‌ కీ అవామీ జంగ్‌‘ పేరిట ఉర్దూలో ఒక పుస్తకం రాశారు. ఇందులో అప్పటి సామాజిక, రాజకీయ, ఆర్థిక, పరిస్థితులను స్పృశించారు. ‘హైదరాబాద్‌ ప్రజా సమరం’ పేరిట ‘మెహక్‌  హైదరాబాదీ’ అనువదించిన ఆ పుస్తకంలోని కొన్ని భాగాలివి. నేడు హైదరాబాద్ పెరేడ్ గ్రౌండ్స్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాల్గొనే ‘౭5వ హైదరాబాద్‌ విమోచన దినోత్సవ 

వేడుకలు’ సభలో ఈ పుస్తకావిష్కరణ)

Updated Date - 2022-09-17T07:16:52+05:30 IST