నిర్మల వెలిగించాల్సిన ఆశాదీపాలు

ABN , First Publish Date - 2021-01-16T09:05:59+05:30 IST

‘మీరుఇంతకుముందు ఎన్నడూ చూడనటువంటి ఒక బడ్జెట్‌ను రూపొందించబోతున్నాను’ 2021–22 బడ్జెట్ రూపకల్పన సన్నాహాల...

నిర్మల వెలిగించాల్సిన ఆశాదీపాలు

‘మీరుఇంతకుముందు ఎన్నడూ చూడనటువంటి ఒక బడ్జెట్‌ను రూపొందించబోతున్నాను’ 2021–22 బడ్జెట్ రూపకల్పన సన్నాహాల సందర్భంగా ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఉద్ఘాటన అది. ఇది చదివిన వెంటనే చకితుడిని అయ్యాను. వివాదాస్పద కొత్త వ్యవసాయ చట్టాలతో సంబంధమున్న ప్రతి ఒక్కరితో చర్చలకు గాను దేశ సర్వోన్నత న్యాయస్థానం నియమించిన కమిటీలోని నలుగురు సభ్యుల పేర్లు చదివినప్పుడు కూడా చాలామంది ఇలానే చకితులయ్యారు మరి. ఆ నలుగురూ కొత్త సాగుచట్టాలకు అనుకూలురే కావడం గమనార్హం. అలాంటి వారు రైతు ఆందోళనలను చిత్తశుద్ధితో పట్టించుకుంటారా?


మన జన్మభూమి-.. ఈ పవిత్ర భారతావని అంతకంతకూ వింతలూ నిడ్డూరాలకు నెలవుగా మారుతోంది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వం రైతుల నిరసనల పట్ల మొండి వైఖరితో వ్యవహరించడమేమిటి? రక్తం గడ్డ కట్టే చలిని కూడ లెక్కచేయకుండా వారు కొనసాగిస్తున్న ఉద్యమం 54వ రోజులోకి ప్రవేశించనున్నది. అయినా అన్నదాతల నిరసనల పట్ల నరేంద్ర మోదీ ప్రభుత్వం నిర్లక్ష్యంతో వ్యవహరిస్తోంది. దాని ఏమైతేనేం, అధికారం భద్రంగా ఉంటే చాలు కాబోలు మన పాలకులకు! కష్టనష్టాలకు గురవుతూ సాగుచట్టాల రద్దే లక్ష్యంగా పోరాడుతున్న రైతులను ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించడం ఆశ్చర్యంగా లేదూ? మరి ఆ ప్రభుత్వ మంత్రులు, అధికార పక్షం నాయకులతో పాటు అటార్నీ జనరల్ సైతం ఆ ఆందోళనాకారులను ఖలిస్థాన్‌ వాదులుగా నిందించడం వింతకాదా? వింతగా ఉంది, సందేహం లేదు. 


అవును, వింత వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. కొత్త సాగుచట్టాలపై సమగ్ర సమాచారాన్ని, మరీ ముఖ్యంగా ప్రతిపాదిత చట్టాలపై చర్చలు, సంప్రదింపులు నిర్వహించిన తేదీలు, ఆ సంప్రదింపులు, సమావేశాల వివరాలను తెలియజేయాలని కోరుతూ సహచారహక్కు చట్టం కింద వివిధ ప్రభుత్వ విభాగాలకు అంజలి భరద్వాజ్ అనే సమాచారహక్కు ఉద్యమ కార్యకర్త దరఖాస్తు చేశారు. దాన్ని అందుకున్న ప్రతి మంత్రిత్వశాఖ ప్రతిస్పందించింది. ఏమని? ఆమె అడిగిన సమాచారానికి సంబంధించిన రికార్డులు ఏవీ తమ వద్ద లేవని! అంజలి ప్రశ్నలను ప్రతి మంత్రిత్వశాఖ మరో మంత్రిత్వ శాఖకు నివేదించింది. ఇదిలావుంటే మోదీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఒక అఫిడవిట్ సమర్పించింది. ‘కొత్త సాగు బిల్లులను ప్రతిపాదించే ముందు కేంద్ర ప్రభుత్వం ఎవరితోనూ ఎటువంటి సంప్రదింపులు జరపలేదని, ఆ బిల్లులను ఆమోదించే ముందు పార్లమెంటులో వాటిపై చర్చలు జరగలేదన్న అభిప్రాయం రైతుల్లో ఉంది. ఇది తప్పుడు అభిప్రాయం. ఆందోళనకారులు అల్ప విషయాలపై ఆసక్తి చూపుతూ వాస్తవాలను విస్మరిస్తున్నారు. ప్రభుత్వం పట్ల రైతుల అపోహలను తొలగించేందుకే ఈ అఫిడవిట్‌ను దాఖలు చేస్తున్నాం’ అని మోదీ ప్రభుత్వం పేర్కొంది. పవిత్ర ప్రమాణపత్రంలో అసత్యాలు చెప్పవచ్చునా? 


ఆర్‌టిఐ కార్యకర్త అంజలీ భరద్వాజ్ విన్నపాలకు ప్రభుత్వం ప్రతిస్పందించలేదని వార్తాపత్రికలు వెల్లడించడంతో వ్యవసాయ మంత్రిత్వశాఖ హడావిడిగా ఒక వివరణ ఇచ్చింది. సాగుచట్టాల వివాదం వివిధ న్యాయస్థానాలలో విచారణలో ఉన్నందున ఆర్‌టిఐ దరఖాస్తుదారు కోరిన సమాచారాన్ని వెల్లడించలేమని పేర్కొంది. వాస్తవమేమిటంటే, ప్రతిపాదిత సాగుబిల్లులపై ప్రభుత్వం రైతులతో గానీ, వ్యవసాయ ఆర్థికవేత్తలతో గానీ ఎలాంటి సంప్రదింపులు జరగలేదు. అసలు 2020 జూన్ 5న ఆర్డినెన్స్‌లు జారీ చేసే ముందు కూడా ప్రభుత్వం ఎవరితో ఎటువంటి చర్చలు జరపనే లేదు. అంతేకాదు పార్లమెంటులో ఆ బిల్లులను మూజువాణీ ఓటుతో ఆమోదించారు. వాటిపై పూర్తి స్థాయి చర్చ జరగాలని లేదా పార్లమెంటరీ సెలెక్ట్ కమిటీకి నివేదించాలని వివిధ ప్రతిపక్షాలు చేసిన డిమాండ్‌ను ప్రభుత్వం నిర్ద్వంద్వంగా తోసిపుచ్చింది. బిల్లులపై ఓటింగ్ నిర్వహించాలన్న డిమాండ్ కూడా పాలకులకు ఆమోదయోగ్యం కాలేదు. అలా ఆ కొత్త సాగుచట్టాలు రైతుల జీవితాలలోకి ప్రవేశించాయి. అవి తమ ఆదాయాల మెరుగుదలకు ఏమాత్రం తోడ్పడేవికావని అత్యధిక రైతులు భావించారు. మొదటనే వాటిని తిరస్కరించకపోతే తాము తమ భూములను సైతం కార్పొరేట్ కంపెనీలకు కోల్పోవలసివస్తుందని వారు భయపడ్డారు. ఈ భయాందోళనలతోనే ఆ చట్టాలకు వ్యతిరేకంగా రాజీలేని పోరాటాన్ని ప్రారంభించారు. 


కొత్త సాగుచట్టాలపై తమ సందేహాలకు వారు ఒక గట్టి రుజువును చూపుతున్నారు. నితీశ్ కుమార్ నేతృత్వంలోని బిహార్ ప్రభుత్వం కొద్ది సంవత్సరాల క్రితం ‘వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ కమిటీ’ చట్టాన్ని రద్దు చేసింది. దీనివల్ల రైతుకు ఎలాంటి మేలు జరగలేదు. క్వింటాల్ ధాన్యానికి ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధర రూ.1800 కాగా బిహార్ రైతు రూ.800కే అమ్ముకోవాల్సిన దుస్థితిలో పడ్డాడు. మరి కొత్త సాగుచట్టాలు తమకు మేలు చేస్తాయని రైతులు ఎలా భావించగలుగుతారు? అందుకే వాటిని రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కానీ, మోదీ ప్రభుత్వం వాటిని గట్టిగా సమర్థించుకుంటోంది. పైగా ఆ చట్టాలలోని ప్రతి అంశంపైన కూలంకష చర్చలకు రావాలని రైతులను, రైతు సంఘాల నాయకులను ఆహ్వానిస్తోంది. చర్చలకు రావాలట.. ఇది వింతగా లేదూ? రాజ్యసభలో సాగుబిల్లులోని ఒక్క అంశం పైన అయినా చర్చకు ప్రభుత్వం ముందుకు వచ్చిందా, అంశాలవారీ చర్చ తరువాత ఓటింగ్ నిర్వహణకు ప్రభుత్వం అంగీకరించిందా? లేదు కదా. మరి ఇప్పుడు సింఘు వీధుల్లో అనేక కష్ట నష్టాలకు లోనవుతూ నిరసన తెలుపుతున్న రైతులతో చర్చలకు సిద్ధమయ్యారు మన పాలకులు. పార్లమెంటును ఉపేక్షించిన వారి చిత్తశుద్ధిని ఎలా విశ్వసించాలి? 


‘ఇంతకుముందు మీరు ఎన్నడూ చూడని ఒక బడ్జెట్‌ను రూపొందిస్తున్నానని’ ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ చేసిన ప్రకటన దిగ్భ్రాంతి కలిగిస్తోంది. నిర్మల వాస్తవంగా ఏమి చేసి తీరాలన్నది ఆమె చేయగలిగే దానికి, చేయాల్సినది, సంకల్పించిన దానికి పూర్తిగా భిన్నమైనది. 2020–-21 ఆర్థిక సంవత్సరంలో చేపట్టవలసిన చాలా చర్యలను పాలకులు భయం, పిరికి తనం, అవగాహనా రాహిత్యంతో చేపట్టలేకపోయారన్న విమర్శతో ప్రముఖ ఆర్థికవేత్తలందరూ ఏకీభవిస్తున్నారు. 


సరే, మహమ్మారితో కుదేలయిన ఆర్థికవ్యవస్థను, ప్రజల ఆర్థిక స్థితిగతులను చక్కదిద్దేందుకు ప్రభుత్వం చేపట్టి ఉండాల్సిన చర్యలు ఏవో చెబుతాను. అవి: పేద కుటుంబాలకు నగదు బదిలీ. ఇది జరగలేదు. పరోక్ష పన్నుల రేట్లు, ముఖ్యంగా వస్తుసేవల పన్ను రేట్లలో కోత. ఇదీ జరగలేదు. ప్రభుత్వ మూల ధన వ్యయాన్ని ఇతోధికంగా పెంచడం. ఈ దిశగా ప్రభుత్వం అసలు ఏమైనా ఆలోచించిందా? సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను ఆదుకునే పథకాన్ని రూపొందించనే లేదు. మరి ఉపాధి, ఉద్యోగాల కల్పనలో అగ్రగాములుగా ఉన్న ఆ పరిశ్రమల రంగానికి చేయూత నివ్వకపోతే ప్రజలకు ఆర్థికభద్రత ఎలా సమకూరుతుంది? ఆర్థికవ్యవస్థను పునరుజ్జీవింపచేసేందుకు కనీసం ఇప్పుడైనా ఆ చర్యలు చేపట్టాలని డాక్టర్ అరవింద్ పనాగరియా, డాక్టర్ సి. రంగరాజన్, డాక్టర్ జహంగీర్ అజీజ్‌తో సహా పలువురు ఆర్థికవేత్తలు కోరుతున్నారు. కరోనా విపత్తుకు ముందు మూడు ఆర్థిక సంవత్సరాలలో స్థిరధరల ప్రాతిపదికన స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) ఎలా ఉన్నదో చూడండి: 2017–18లో రూ.121.75 లక్షల కోట్లు, 2018–19లో రూ.139.81 లక్షల కోట్లు, 2019–20లో రూ.145.65 లక్షల కోట్లు. మొదటి ముందస్తు అంచనాల ప్రకారం 2020–21 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ రూ.134.40 లక్షల కోట్లుగా ఉంటుందని భావిస్తున్నారు. అంటే 2019–20 ఆర్థిక సంవత్సరపు జీడీపీ స్థాయికి మరలిపోనున్నది. ఈ నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థ సత్వరమే ఇతోధిక పురోగతి సాధించాలంటే 2021–22 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధిరేటు 8.37 శాతంగా ఉండి తీరాలి. అంతకంటే తక్కువగా ఉంటే జరిగేదేమిటి? స్థిరధరల ప్రాతిపదికన 2020–21 ఆర్థిక సంవత్సరంలో మనం 11లక్షల కోట్ల రూపాయలు నష్టపోతాం. 2021–22 ఆర్థికసంవత్సరంలో ఈ నష్టం మరింత భారీగా ఉంటుంది. ప్రస్తుత ధరల ప్రకారం 2020–21 ఆర్థికసంవత్సరంలో ఆర్థికవ్యవస్థ 9లక్షల కోట్ల రూపాయలు కోల్పోనున్నది. 


మరి 202–22 ఆర్థికసంవత్సరంలో వృద్ధిరేటు 8. 37 శాతంగా ఉండేందుకు మంత్రి నిర్మలా సీతారామన్ ఏమి చేయనున్నారు? వృద్ధిరేటు పతనాన్ని అరికట్టేందుకు పటిష్ఠ చర్యలు చేపట్టనందున ప్రభుత్వ ఆదాయ వనరులు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నాయి. ఈ దృష్ట్యా నగదు బదిలీ, పన్నురేట్ల కోతకు ఆమె సిద్ధమవుతారా అన్నది సందేహమే. ఏమైనా ప్రభుత్వ వ్యయాన్ని ఇతోధికంగా పెంపొందించాలి. దీంతో పాటు సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలను ఆదుకొనేందుకు ఒక పథకాన్ని రూపొందించాలి. మౌలిక సదుపాయాల రంగంలో మరింత భారీగా పెట్టుబడులు పెట్టాలి. ఎలాగూ, రక్షణ రంగానికి , ఆరోగ్య భద్రతా సదుపాయల అభివృద్ధికి భారీ కేటాయింపులు జరిగి తీరుతాయి. అయితే చిన్న పరిశ్రమలకు, ఆరోగ్యభద్రతకు కేటాయింపులు భారగా ఉండకపోవచ్చని నేను భయపడుతున్నాను. 2021–22 బడ్జెట్‌కు సంబంధించి నిర్మలా సీతారామన్ సంకల్పం ప్రశంసనీయమైనదే. అయితే బడ్జెట్ ఆ సంకల్పానికి అనుగుణంగా ఉంటుందా? కరోనా సంవత్సరంలో ఆర్థికవ్యవస్థను చక్కదిద్దేందుకు ఆమె చేపట్టిన చర్యలు స్ఫూర్తిదాయకంగా లేవు. ప్రజలు తీవ్ర నిరుత్సాహానికి లోనయ్యారు. కొత్త బడ్జెట్ విషయంలో వారిని ఆర్థికమంత్రి నిరాశపరచబోరని ఆశిస్తున్నాను.

పి. చిదంబరం

(వ్యాసకర్త కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు)

Updated Date - 2021-01-16T09:05:59+05:30 IST