అందమైన నిర్ణయం

Jun 4 2021 @ 00:00AM

పూర్వం వారణాసిలో సమిద్ధి అనే యువకుడు ఉండేవాడు. అతను అందగాడు. గొప్ప శరీర సౌష్టవం కలిగినవాడు. బంగారం లాంటి శరీరచ్ఛాయ, నల్లటి ఉంగరాల జుట్టు, మంచి పొడుగు, దానికి తగిన దేహం, చక్కటి ముక్కు, ఆకర్షించే కళ్ళు, చిత్తాల్ని దోచుకొనే చిరునవ్వు... వీటన్నిటికీ మించి చదువు, సంస్కారం ఉన్నవాడు. అన్నిటిలోనూ సమృద్ధి కలిగినవాడు కాబట్టే ‘సమిద్ధి’గా పేరు పొందాడు. అలాంటి వ్యక్తిని భర్తగా పొందాలని ఎందరో యువతులు కోరుకున్నారు. అతని వెంటపడ్డారు. 

ఒక రోజు సమిద్ధి ఊరు చివర ఉన్న అడవిలోని సెలయేటికి ఉదయాన్నే స్నానానికి వెళ్ళాడు. స్నానం చేసి ఒడ్డుకు వచ్చి నిలబడ్డాడు. ఉదయభానుడి లేత కిరణాలు అతని శరీరం మీద పడి, అతడి బంగారు రంగు శరీరం మరింత మెరుగు పెట్టినట్టు మెరిసింది. ఆ సమయంలో ఒక దేవకాంత అతణ్ణి చూసి మోహించింది. అతని ముందుకు వచ్చి నిలబడింది. 

‘‘ఎవరు నువ్వు’’ అని అడిగాడు సమిద్ధి. 

‘‘నేను దేవకాంతను. ఏ లోకంలోనూ నీ అంతటి అందగాణ్ణి చూడలేదు. నన్ను వివాహం చేసుకో. జీవితాంతం సుఖంగా ఉండవచ్చు’’ అంది ఆమె. 

ఆమె అన్న మాటల్లో ‘జీవితాంతం’ అనే పదం అతని మనసును బలంగా తాకింది. కలవరపాటు కలిగింది. ‘ఈ దివ్య సుందరి నాకు గొప్ప సందేశాన్ని ఇవ్వడానికే వచ్చిందా అనిపించింది. అతని మనసు పొరలు విచ్చుకున్నాయి. ఆమె అందం తన జీవితాన్ని నిరుపయోగం చేస్తుందేమోనని భయపడ్డాడు. మానవ జీవితానికి పరిపూర్ణతను ఇచ్చి, జ్ఞానోదయం కలిగించి, జీవితానికి సాఫల్యత చేకూర్చే ధ్యాన సాధన చేయాలని నిశ్చయించుకున్నాడు. 

‘‘సోదరీ! ఈ అందం, ఈ యవ్వనం శాశ్వతం కావు. తాత్కాలికమైన సుఖం కోసం అర్రులు చాచి.. శాశ్వతమైన సుఖాన్నీ, దుఃఖరహితమైన జీవితాన్నీ చేజార్చుకోలేను. నీ దర్శనభాగ్యం వల్ల నా కళ్ళు తెరుచుకున్నాయి. నేను తాపసిని అవుతాను. ధ్యాన మార్గంలో జీవితాన్ని ధన్యం చేసుకుంటాను’’ అన్నాడు. 

‘‘సుందరా! ఎంత వెర్రివాడివి? ఇప్పుడు నువ్వు యువకుడివి. ముసలివాడిలా ఆలోచించకు. వృద్ధుడివయ్యాక సన్యసించవచ్చు’’ అంది దేవకన్య.

‘‘ఈ జీవితం ఎప్పుడు ముగుస్తుందో చెప్పలేం. ఏ క్షణంలో చావు వచ్చి పడుతుందో తెలీదు. కాబట్టి నేను ఇప్పుడే పరివ్రాజకుడిగా మారుతాను. లేకుంటే... నా అందచందాలే నా జీవితాన్ని హరించి వేస్తాయి’’ అన్నాడు సమిద్ధి. 

వెంటనే ఇంటికి వెళ్ళి, తల్లితండ్రుల అనుమతి తీసుకున్నాడు. ధ్యాన మార్గంలో ప్రవేశించాడు. గొప్ప జ్ఞానిగా జీవించాడు.

- బొర్రా గోవర్ధన్‌


Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.