ధాన్యోస్మి..!

ABN , First Publish Date - 2020-11-24T10:04:24+05:30 IST

జిల్లాలో ఈ ఏడాది ఖరీ్‌ఫలో సాగు చేసిన వరిధాన్యం అన్నదాత మోముల్లో ఆనందాన్ని నింపింది. దశాబ్ధకాలంగా పడావుగా ఉన్న బీడు భూములు సైతం వరుణుడి కరుణాకటాక్షాలతో ధాన్యపు సిరులను కురిపించాయి

ధాన్యోస్మి..!

పల్లె ముంగిట్లో కళకళలాడుతున్న వడ్ల రాశులు

జలవనరులతో బీడు భూముల్లో పండిన పంటలు


లింగాలఘణపురం నవంబరు 23: జిల్లాలో ఈ ఏడాది ఖరీ్‌ఫలో సాగు చేసిన వరిధాన్యం అన్నదాత మోముల్లో ఆనందాన్ని నింపింది. దశాబ్ధకాలంగా పడావుగా ఉన్న బీడు భూములు సైతం వరుణుడి కరుణాకటాక్షాలతో ధాన్యపు సిరులను కురిపించాయి. మొత్తంగా ఈ ఏడాది మిగతా పంటలను పోల్చుకుంటే వరిసాగు అన్నదాతకు భరోసాను కల్పించింది. జిల్లా వ్యాప్తంగా ఖరీ్‌ఫలో 1.49 లక్షల ఎకరాల్లో వరిపంటను సాగు చేయగా 35.76 లక్షల క్వింటాళ్ల ధాన్యం దిగుబడి రానున్నట్లు వ్యవసాయశాఖ అంచనా వేసింది. అయితే ప్రభుత్వ అంచనాల ప్రకారమే దిగుబడి అనుకూలంగా ఉండగా పంటచేతికందే సమయంలో ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు కొద్దిమేర దిగుబడిపై ప్రభావం చూపినప్పటికీ గత ఏడాదితో పోల్చుకుంటే భారీ స్థాయిలో పంటదిగుబడిని సాధించారు. ఫలితంగా ఇప్పుడు పల్లెసీమల్లో ఎటుచూసినా ధాన్యపు రాశులే కనిపిస్తు న్నాయి. ధాన్యోస్మి అన్నట్లుగా జాతీయ రహదారిలకిరువైపులా పల్లె వాకిళ్ల నిండుగా, ఐకెపీ కేంద్రాల్లో సైతం అవే దర్శనమిస్తున్నాయి.


జిల్లాలో 147 కొనుగోలు కేంద్రాలు..

జిల్లా వ్యాప్తంగా 12 మండలాల్లో 147 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిన జిల్లా అధికార యంత్రాంగం మద్దతు ధరను చెల్లించేందుకు అందుబాటులో అవసరమైన ఏర్పాట్లను చేపట్టింది. వీటిలో 86 కేంద్రాలను ఐకెపీ నిర్వహిస్తుండగా 61 కేంద్రాలను ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు నిర్వహిస్తున్నాయి. 16శాతం కంటే తక్కువగా ఉన్న ఏగ్రేడ్‌ ధాన్యానికి రూ. 1888లు చెల్లిస్తుండగా కామన్‌ గ్రేడ్‌ ధాన్యానికి రూ. 1868లు మద్దతు ధరను చెల్లిస్తున్నారు. 


65,171 క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు..

జిల్లాలో పదిరోజుల క్రితం ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం కాగా, ఇప్పటివరకు 2190 మంది రైతుల నుంచి 65,171 క్వింటాళ్ల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. వీటిలో ఐకెపీ కేంద్రాల ద్వారా 62,682, పీఏసీఎ్‌సల ద్వారా 2489 క్వింటాళ్ల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు ప్రభుత్వ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అయితే వరిపంట నూర్పిడి ప్రారంభం కావడంతో ధాన్యం కొనుగోలు కేంద్రాలు మరో 10 రోజుల్లో ధాన్యపురాసులతో పోటెత్తనున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.


ఖర్చులు.. తడిసి మోపెడు..

ధాన్యం దిగుబడి పెరిగిందనే ఆనందంతో పాటుగా సాగు ఖర్చులు సైతం రెట్టింపు కావడంతో అన్నదాతలు ఒకింత ఆందోళనకు గురవుతున్నారు. నారుమడి యాజమాన్యం నుంచి మొదలుకుని వరిపంట నూర్పిడి, మార్కెట్‌కు తరలించే దాకా ప్రతీ పనికి కూడా గతంతో పోల్చుకుంటే ఈ ఏడాది ఖర్చులు కూడా తడిసిమోపెడు అవుతున్నట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

Updated Date - 2020-11-24T10:04:24+05:30 IST