ప్రజలను పీల్చి పిప్పి చేస్తున్న బీజేపీ

ABN , First Publish Date - 2022-01-23T04:44:31+05:30 IST

ప్రజలను ప్రధాని మోదీ పీల్చి పిప్పి చేస్తున్నారని, దేశం కోసం, ధర్మం కోసం అంటూ పెట్రోల్‌, డీజిల్‌, సిలిండర్‌, నిత్యావసర వస్తువుల ధరలను బీజేపీ ప్రభుత్వం పెంచుతోందని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు.

ప్రజలను పీల్చి పిప్పి చేస్తున్న బీజేపీ
గజ్వేల్‌-ప్రజ్ఞాపూర్‌ మునిసిపాలిటీ పరిధిలోని 3వ వార్డులో మురుగు కాలువ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తున్న మంత్రి హరీశ్‌రావు, ఎఫ్‌డీసీ చైర్మన్‌ వంటేరు ప్రతాప్‌రెడ్డి

 దేశంకోసం, ధర్మకోసం అంటూ ధరలను పెంచుతున్న కేంద్ర ప్రభుత్వం

 రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు

 గజ్వేల్‌, బెజ్జంకిలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన


గజ్వేల్‌, జనవరి 22: ప్రజలను ప్రధాని మోదీ పీల్చి పిప్పి చేస్తున్నారని, దేశం కోసం, ధర్మం కోసం అంటూ పెట్రోల్‌, డీజిల్‌, సిలిండర్‌, నిత్యావసర వస్తువుల ధరలను బీజేపీ ప్రభుత్వం పెంచుతోందని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. గజ్వేల్‌ పట్టణంలోని ఇంటిగ్రేటెడ్‌ ఆఫీస్‌ కాంప్లెక్స్‌లో ఎమ్మెల్సీ డాక్టర్‌ యాదవరెడ్డి, ఎఫ్‌ఢీసీ చైర్మన్‌ వంటేరు ప్రతా్‌పరెడ్డి, జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ వేలేటి రోజాశర్మతో కలసి అంగన్‌వాడీ టీచర్లు, కార్యకర్తలకు ఏకరూప దుస్తులను శనివారం పంపిణీ చేశారు. అనంతరం కళ్యాణలక్ష్మి, షాదీముభారక్‌ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సిలిండర్‌ సబ్సీడీని ఎగబెట్టి, ధర రూ.వెయ్యి చేసి దేశభక్తి కోసం భరించాలని అంటున్నారన్నారు. గ్లోబల్‌ ప్రచారాలతో కాలాన్ని గడుపుతున్న పార్టీ బీజేపీ అని విమర్శించారు. కానీ రాష్ట్రంలో కులం, మతం చూడకుండా కళ్యాణలక్ష్మి, షాదీముభారక్‌లను అందిస్తున్నామని, ఇప్పటివరకు రాష్ట్రంలో 9లక్షల 96వేల 690 పెళ్లిల్ల ప్రభుత్వం తరఫున ఆర్థిక సహాయాన్ని అందజేసినట్లు మంత్రి హరీశ్‌రావు తెలిపారు. అంగన్‌వాడీ కార్యకర్తలకు చేనేత చీరలిచ్చిన ప్రభుత్వం టీఆర్‌ఎ్‌సదేనని చెప్పారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అంగన్‌వాడీ కార్యకర్తలకు రూ.3,950 వేతనాలిస్తున్నారని, తెలంగాణలో సీఎం కేసీఆర్‌ రూ.7,800 ఇస్తున్నారని చెప్పారు. కాగా గజ్వేల్‌-ప్రజ్ఞాపూర్‌ మునిసిపాలిటీ పరిధిలోని 3వ వార్డులో డిపో వద్ద మురుగు కాలువ నిర్మాణానికి, జగదేవ్‌పూర్‌ రోడ్డులోని ఈద్గా వద్ద డ్రయింగ్‌ఫ్లాట్‌ ఫారం పనులకు, గజ్వేల్‌ విద్యుత్‌శాఖ డీఈ కార్యాలయ భవనానికి, ప్రజ్ఞాపూర్‌ మెయిన్‌ రోడ్డు పక్కన నిర్మించనున్న స్ట్రామ్‌ వాటర్‌ డ్రైనేజీ నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ప్రజ్ఞాపూర్‌లో బస్టాండ్‌ను ఏర్పాటు చేయాలని ప్రజ్ఞాపూర్‌కు చెందిన కౌన్సిలర్లు మర్కంటి వరలక్ష్మి, పంబాల అర్చన, ఉప్పల మెట్టయ్య, తలకొక్కుల దుర్గాప్రసాద్‌, గ్రామ నాయకులు మంత్రి హరీశ్‌రావుకు వినతిపత్రాన్ని అందజేశారు. కార్యక్రమాల్లో గడ ప్రత్యేకాఽధికారి ముత్యంరెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ లక్కిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, మునిసిపల్‌ చైర్మన్‌ ఎన్‌సీ రాజమౌళి, వైస్‌ చైర్మన్‌ జకీయోద్దీన్‌, ఏఎంసీ చైర్‌పర్సన్‌ మాదాసు అన్నపూర్ణశ్రీనివాస్‌, ఎంపీపీ దాసరి అమరావతి, జడ్పీటీసీ పంగ మల్లేశం, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు బెండే మధు, విద్యుత్‌శాఖ డీఈ శ్రీనివా్‌సచారీ, నాయకులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.


బీజేపీవి దిగజారుడు రాజకీయాలు


బెజ్జంకి, జనవరి 22: రాష్ట్రంలో అర్హులైన పేద ప్రజలందరికీ డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు ఇస్తామని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. బెజ్జంకి, చిలాపూర్‌లో శనివారం డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల లబ్ధిదారులకు ఆయన పట్టాలను అందజేశారు. అలాగే బెజ్జంకిలో సమీకృత మార్కెట్‌ను ప్రారంభించి, వైకుంఠధామం, మినీ స్టేడియం పనులను మానకొండూర్‌ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌, జడ్పీ చైర్‌ పర్సన్‌ రోజాశర్మ, స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి ప్రారంభించారు. రేగులపల్లిలో అంబేడ్కర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించారు. నూతన గ్రామ పంచాయతీ భవనం, మహిళా సంఘ భవనం, కమ్యూనిటీ హాల్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. ఇల్లు రాని పేదలు ఎవరు అధైర్య పడవద్దని వారికి సొంత స్థలాల్లో ఇల్లు నిర్మించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పారు. బెజ్జంకి మండలం కరువు ప్రాంతంగా ఉండేదని నేడు కాళేశ్వరం జలాలతో సస్యశ్యామలంగా మారిందన్నారు. కాగా ఓట్ల కోసం బీజేపీ దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతోందని విమర్శించారు. కులాలను మతాలను రెచ్చగొట్టి అధికారమే లక్ష్యంగా పని చేసే పార్టీ బీజేపీ అని, ప్రజలే కేంద్రబిందువుగా ప్రజా సమస్యలు, కష్టాలు, ప్రజల అవసరాలను ఎప్పటికప్పుడు గుర్తిస్తూ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పని చేస్తుందన్నారు. దేశంలోనే ప్రప్రథమంగా రాష్ట్రంలో రెసిడెన్షియల్‌ లా కాలేజీ తెచ్చిన ఘనత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి దక్కిందని అన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ నిర్మల, జడ్పీటీసీ కవిత, సర్పంచులు ఐలయ్య, మొండయ్య, మంజుల, లక్ష్మి, హుస్నాబాద్‌ ఆర్డీవో జయచంద్రారెడ్డి, తహసీల్దార్‌ విజయ ప్రకాశ్‌రావు, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ రాజయ్య, వైస్‌ చైర్మన్‌ లక్ష్మారెడ్డి, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు మహిపాల్‌రెడ్డి పాల్గొన్నారు.


డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు కేటాయించలేదని నిరసన 


డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల కేటాయింపులో అధికారులు, ప్రజాప్రతినిధులు అన్యాయం చేశారని శనివారం బెజ్జంకి మండల కేంద్రంలో పలువురు గ్రామస్థులు నిరసన చేపట్టారు. అర్హులైన వారికి కేటాయించలేదని ఆందోళన చేపట్టగా పోలీసులు అడ్డుకొని సర్దిచెప్పారు. మంత్రి హరీశ్‌రావు డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లను ప్రారంభించి వస్తున్న సమయంలో పలువురు గ్రామస్థులు సమస్యను తెలిపేందుకు ఒక్కసారిగా రావడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. గ్రామానికి చెందిన కరవెల్లి సునీత పురుగుమందు తాగేందుకు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. ఇదే సమయంలో గూడెం గ్రామానికి చెందిన మహంకాళి శ్రావణి అర్హత ఉన్నా తనకు ఇల్లు కేటాయించలేదని ఇటీవల మృతి చెందిన తన భర్త ఫొటోతో నిరసనకు దిగింది. మూడెకరాల భూమి కోసం తన భర్త ఆత్మహత్య చేసుకుంటే డబుల్‌ బెడ్రూం ఇల్లు ఇస్తామని చెప్పి మోసం చేశారని రోదించింది. పోలీసులు నిరసన తెలుపుతున్న వారిని శాంతింపజేసి అక్కడి నుంచి పంపించారు.


 


Updated Date - 2022-01-23T04:44:31+05:30 IST