దేశం కోరుతున్న బిజెపి పురోగతి

ABN , First Publish Date - 2021-03-30T06:08:41+05:30 IST

భారత రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీకి తిరుగులేని ప్రభావం ఉన్నదన్న విషయం ప్రస్తుతం అయిదు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం జరుగుతున్న తీరు...

దేశం కోరుతున్న బిజెపి పురోగతి

భారత రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీకి తిరుగులేని ప్రభావం ఉన్నదన్న విషయం ప్రస్తుతం అయిదు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం జరుగుతున్న తీరు స్పష్టం చేస్తున్నది. ఒకప్పుడు ఎన్నికల రాజకీయాల్లో బిజెపి గురించి ఏ మాత్రం చర్చ జరిగేది కాదు. కాని ఇప్పుడు దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా బిజెపి పైనే చర్చ కేంద్రీకృతమవుతున్నది. సరిగ్గా అయిదేళ్ల క్రితం పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి ఒక శక్తి కూడా కాదు. మొత్తం 294 సీట్లలో బిజెపి కేవలం 3 సీట్లను గెలుచుకుంది. ఒకప్పుడు దేశాన్ని ఆరు దశాబ్దాలు ఏలిన కాంగ్రెస్ పార్టీ నేతలు రాహుల్, ప్రియాంక ఇప్పుడు పశ్చిమ బెంగాల్‌లో అడుగుపెట్టేందుకే జంకుతుండగా, ఆ రాష్ట్రంలో బిజెపి ప్రభంజనం వీస్తున్న ఛాయలు కనిపిస్తున్నాయి. తొలి దశ పోలింగ్ జరిగిన 30 సీట్లలో 26 సీట్లు బిజెపికే లభిస్తాయని అంచనాలు వినపడుతున్నాయి. అయిదు సంవత్సరాల క్రితం అస్సాంలో కాంగ్రెస్‌ను గద్దె దించి అధికారంలోకి వచ్చిన భారతీయ జనతా పార్టీ రెండవసారి మళ్లీ ఘన విజయం సాధిస్తుందని, తొలి దశ పోలింగ్ జరిగిన 47 సీట్లలో 37 సీట్లు బిజెపికి లభిస్తాయని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు.


భారతీయ జనతాపార్టీ ఎందుకు విస్తరిస్తోంది? ప్రతిపక్షాలు అధికారంలో ఉన్నరాష్ట్రాల్లో అక్కడి అరాచక, అవినీతి పాలన పట్ల ప్రజలు విసిగిపోయారని, బిజెపి అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలు తమకు అందుబాటులోకి రావడమే కాక, ఎలాంటి అవినీతిలేకుండా అభివృద్ధి అమలులోకి వస్తుందని వారు గ్రహిస్తున్నారనే వాస్తవం సరిగా ఆలోచించే వారెవరికైనా అర్థమవుతుంది. ప్రజలు మార్పు కోరుకోవడమే కాదు, ఆ మార్పుకు నరేంద్రమోదీ సారథ్యంలోని బిజెపి ప్రభుత్వం దోహదం చేయగలదని విశ్వసిస్తున్నారు. దళితులు, గిరిజనులు, వెనుకబడిన వర్గాలు, నిమ్న జాతులు అందరూ ఇవాళ దేశంలో అభివృద్ధి ఫలాలు తమకు అందాలని భావిస్తున్నారు. మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో అమలు జరుగుతున్న భారీ ఎత్తున మౌలికసదుపాయాల ప్రాజెక్టులు ఆయనపై ప్రజలకు విశ్వాసం ఏర్పరిచాయి.


పశ్చిమ బెంగాల్‌లో నరేంద్రమోదీ ‘దీదీ, ఖేలా హోబే’ (దీదీ, ఆట మొదలైంది) అన్నప్పుడల్లా ప్రజలు హర్షధ్వానాలు చేస్తున్నారు. ‘చుప్ చాప్ కమల్ ఛాప్, బూత్ బూత్ సే టీఎంసి సాఫ్’ (మౌనంగా కమలానికి ఓటు వేయండి, ప్రతి బూత్ నుంచి తృణమూల్‌ను నిర్మూలించండి) అన్న ఆయన పిలుపుకు ప్రతిస్పందన లభిస్తోంది. ఇది ఒక్క రోజులో వచ్చిన పరిణామం కాదు. గత పది సంవత్సరాలుగా అక్కడ తృణమూల్ కాంగ్రెస్ దుర్మార్గ పాలన పట్ల ప్రజలు విసిగిపోయినందువల్లే ప్రజలు బిజెపిని ఆదరిస్తున్నారు. భారీ ఎత్తున కుంభకోణాలు, నాసిరకం అభివృద్ధి పనులు, ప్రజల సంక్షేమ పథకాలకు ఇచ్చే డబ్బుల నుంచి కూడా ముడుపులు తీసుకోవడం, అడిగిన వారిపై దౌర్జన్యాలు చేయడం, ముస్లింల బుజ్జగింపు రాజకీయాలు మితిమీరడం వల్ల గతంలో ఉన్న వామపక్షాల ప్రభుత్వానికీ, మమతా బెనర్జీ పాలనకూ మధ్య ప్రజలు వ్యత్యాసాన్ని చూడలేకపోయారు. అక్కడ బిజెపి పుంజుకోవడం, పరివర్తన యాత్రల్లో జనం పెద్ద ఎత్తున పాల్గొనడం యాదృచ్ఛి కంగా జరిగింది కాదు. ‘అస్లీ పరిబర్తన్’ (నిజమైన మార్పు) కోసం బిజెపి నేతలు ఇచ్చిన పిలుపుకు ప్రజలు అందుకే స్పందిస్తున్నారు. సినీనటుడు మిథున్ చక్రవర్తి రోడ్ షోలకు అనూహ్యమైన ఆదరణ లభిస్తోంది.


పశ్చిమ బెంగాల్‌లో బిజెపికి లభిస్తున్న ఆదరణ అఖిల భారతస్థాయిలో భారతీయ జనతాపార్టీ విస్తరణకు సంకేతం. ఇప్పటికే అస్సాంలో ప్రజల మనసులను చూరగొన్న బిజెపి పశ్చిమ బెంగాల్‌లో విజయంతో తూర్పున తన విజయకేతనాన్ని ఎగురవేసినట్లవుతుంది. అంతకు ముందే ఈశాన్య రాష్ట్రాలను అన్నిటినీ బిజెపి గెలుచుకో గలిగినందువల్ల ఈశాన్యం నుంచి తూర్పుకు విస్తరించడం బిజెపికి పెద్ద కష్టం కాలేదు, 2014లోనే ఈశాన్యంలోని 25 లోక్‌సభ సీట్లలో బిజెపి 17 సీట్లను గెలుచుకుంది, 2019లో జరిగిన సార్వత్రక ఎన్నికల్లో బిజెపి అస్సాంలో పదిసీట్లలో 9సీట్లు గెలుచుకుంది,


ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న ప్రతి రాష్ట్రంలోనూ ఒకే రకమైన దేశ వ్యతిరేక కార్యకలాపాలు జరుగుతున్నాయి. కేరళలో గత కొన్ని దశాబ్దాలుగా విదేశాలనుంచి బంగారం స్మగ్మింగ్ విచ్చలవిడిగా సాగుతోంది. కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత కేరళలోని అనేక అంతర్జాతీయ విమానాశ్రయాల్లో భారీ ఎత్తున బంగారాన్ని స్వాధీన పరుచుకున్నారు. కేరళ విమానాశ్రయాల్లో 2018-–19లో 251 కిలోల బంగారాన్ని, 2019-–20లో 540 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు, స్మగ్లర్లు, ఉగ్రవాదులు, మాఫియా,రాజకీయ నాయకులు కుమ్మక్కై సాగిస్తున్న ఈ బంగారం స్మగ్లింగ్ దేశ భద్రతకు ముప్పుగా పరిణమించింది. గత జులైలో యునైటెడ్ అరబ్ ఎమిరెట్స్ మాజీ ఉద్యోగి స్మప్నా సురేశ్ దుబాయి నుంచి వచ్చిన దౌత్యకార్యాలయ బ్యాగేజీ ద్వారా పెద్ద ఎత్తున బంగారం స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డారు. ఈ బంగారం స్మగ్లింగ్ తో ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులకూ సంబంధం ఉన్నట్లు కూడా తేలింది.ఈ కుంభకోణంతో ముఖ్యమంత్రి పినరాయి విజయన్‌కు సంబంధం ఉన్నట్లు స్వప్నా సురేశ్ దర్యాప్తులో వెల్లడించారు. విచిత్రమేమంటే అవినీతి, అరాచక పాలనను సాగిస్తున్న పినరాయి విజయన్ రాజ్యాంగ విరుద్ధంగా ఈ స్మగ్లింగ్‌ను దాచిపెట్టేందుకు కేంద్ర ఏజెన్సీలపైనే న్యాయవిచారణకు ఆదేశించారు.


భారత దేశ చిత్రపటాన్ని చూస్తే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు బిజెపి ఏ విధంగా విస్తరించిందో అర్థమవుతుంది, 7516.6 కిమీలో కోస్తా తీరంలో ఎడమ వైపు గుజరాత్ నుంచి కుడి వైపు పశ్చిమ బెంగాల్ వరకు బిజెపి ఒక పద్దతి ప్రకారం విస్తరిస్తోంది. కోస్తా తీరంలో ఉన్న తొమ్మిది రాష్ట్రాలు గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక,కేరళ, తమిళనాడు,ఆంధ్రప్రదేశ్, ఒడిషా, పశ్చిమ బెంగాల్, రెండు కేంద్ర పాలిత ప్రాంతాలు డామన్ డయ్యూ, పుదుచ్చేరిలు కాక బంగాళాఖాతంలో ద్వీప భూభాగాలైన అండమాన్, నికోబార్ ద్వీపాలు, అరేబియన్, సముద్రంలో లక్షద్వీప్‌లలో మెజారిటీ నియోజకవర్గాలు భారతీయ జనతాపార్టీ హస్తగతం చేసుకుంది. ఈ రాష్ట్రాల్లో బిజెపి విస్తరించాలనుకోవడానికి ప్రధాన కారణం దేశ ప్రయోజనాల పట్ల ప్రత్యేకమైన అవగాహన ఉండడమే. ఉగ్రవాదం, మాదకద్రవ్యాలు, బంగారం, ఆయుధాలు, నకిలీ నోట్ల స్మగ్లింగ్ అరికట్టడం బిజెపి నాయకత్వంలోనే సాధ్యమని ప్రజలు విశ్వసిస్తున్నారు.


అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు దేశ ప్రజల దృష్టిని జాతీయ ప్రయోజనాలు, ప్రాంతీయ భద్రత వైపు ఆకర్షించడం ఒక చారిత్రక అవసరంగా గుర్తించాలి. భారతీయ జనతాపార్టీ అధికార దాహంతో దేశంలో అన్ని రాష్ట్రాల్లో విస్తరించాలని భావించడం లేదు. బిజెపికి జాతీయ ప్రయోజనాలు, దేశ భద్రత, విదేశీ శక్తులనుంచి కాపాడుకోవడం, దేశమంతా సమాన ఆర్థిక అభివృద్ధిని సాధించడం ముఖ్యం. ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో జరుగుతున్న దోపిడీ, అరాచకత్వం గమనించిన ప్రజలు ఏదో ఒక సమయంలో బిజెపిని ఆహ్వానించడం ఒక సహజ పరిణామం.


వై. సత్యకుమార్

బిజెపి జాతీయ కార్యదర్శి

Updated Date - 2021-03-30T06:08:41+05:30 IST