రక్తం చిందుతోంది

ABN , First Publish Date - 2021-07-27T05:30:00+05:30 IST

జిల్లాలో జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, పులివెందుల, మైదుకూరు నియోజకవర్గాలతో పాటు పలు ఫ్యాక్షన్‌ గ్రామాలు ఉన్నాయి.

రక్తం చిందుతోంది
కోమన్నూతలలో ఏర్పాటుచేసిన పోలీస్‌ పికెట్‌

పెరుగుతున్న హత్యల సంస్కృతి

ఆధిపత్య పోరుకు కోమన్నూతల సర్పంచి బలి

జూన్‌ 15న మాజీ ఎంపీటీసీ తూటాకు ఓ వ్యక్తి హతం

పులివెందుల ప్రాంతంలో నెలన్నరలో ఇద్దరి హత్య

వివిధ కారణాలతో ప్రత్యర్థుల దాడుల్లో పలువురు మృత్యువాత

చంపడమే పరిష్కారమా..? 

పల్లెల్లో పోలీస్‌ నిఘా లోపించిందా..?


 కడప అంటేనే గుర్తొచ్చేది ముఠా తగాదాలు.. ఆధిపత్య పోరు. ఇది ఒకనాటి పరిస్థితి. ప్రజల్లో చైతన్యం, విద్యావ్యాప్తితో ఫ్యాక్షన్‌ సంస్కృతి దాదాపు కనుమరుగు అవుతూ వచ్చింది. అయితే.. ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలు చూస్తే మళ్లీ పూర్వ సంస్కృతికి బీజం పడుతోందా..? అనే భయం ఆయా గ్రామాల్లో వెంటాడుతోంది. ఆరునెలల వ్యవధిలో జిల్లాలో 38 మంది హత్యకు గురయ్యారు. తాజాగా కోమన్నూతల సర్పంచి గడ్డం మునెప్ప దారుణ హత్యకు గురయ్యారు. పోలీస్‌ నిఘా పెంచకపోతే ఈ విష సంస్కృతి మళ్లీ విజృంభించే అవకాశం లేకపోలేదు.


(కడప-ఆంధ్రజ్యోతి): జిల్లాలో జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, పులివెందుల, మైదుకూరు నియోజకవర్గాలతో పాటు పలు ఫ్యాక్షన్‌ గ్రామాలు ఉన్నాయి. పాతికేళ్లు వెనక్కి వెళితే.. ఎప్పుడు ఏం జరుగుతుందో..? ఏ క్షణంలో ఎలాంటి చేదు నిజం వినాల్సి వస్తుందో..? అని నిత్యం పల్లెజనం భయంతో వణికిపోయేవారు. మూఠా పోరులో పలు కుటుంబాలు ఛిన్నాభిన్నం అయ్యాయి. చెట్టుకొకరు పుట్టకొకరుగా మారిపోయారు. హత్యకు గురైన వారి కుటుంబాలు.. హత్య చేసిన నిందితుల కుటుంబాలు ఎన్నో ఆర్థికంగా చితికిపోయాయి. పలువురు ఇళ్లు పొలాలు ఊరు వదిలి వెళ్లిపోయారు. అయితే.. ఈ మూఠా పోరుకు చరమగీతం పాడాలనే సంకల్పంతో పోలీస్‌ యంత్రాంగం తీసుకున్న పలు కీలక చర్యలు, చదువుకున్న వారు పెరగడంతో పల్లెల్లో ప్రశాంతత నెలకొంటోంది. జిల్లాలో వ్యవసాయం, అరటి, చీనీ, బొప్పాయి, మామిడి, నిమ్మ.. తదితర ఉద్యాన పంటలతో పల్లెసీమలు పచ్చని పంటలతో కళకళలాడుతున్నాయి. ఇలాంటి తరుణంలో పులివెందుల నియోజవర్గం లింగాల మండల పరిధిలో కోమన్నూతల గ్రామంలో ఆధిపత్య పోరుకు ఆ గ్రామ సర్పంచి గడ్డం మునెప్ప మంగళవారం దారుణ హత్యకు గురికావడంతో కడప గడప ఒక్కసారిగా ఉలిక్కిపడింది.


ఆరు నెలల్లో 38 మంది హత్య

ఆస్తి తగాదాలు.. కుటుంబ కలహాలు.. వివాహేతర సంబంధాలు.. వర్గపోరు.. వంటి పలు కారణాలతో ఆరు నెలల్లో సుమారుగా 38 మంది హత్యకు గురైనట్లు పోలీసుల రికార్డుల ద్వారా తెలుస్తోంది. ఆస్తి తగాదాలు, వివాహేతర సంబంధాల వల్ల జరిగిన హత్యలే అధికమని సమాచారం. కారణం ఏదైనా.. సమస్య పరిష్కారానికి చంపడమే కారణమా..? అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. ఓ క్షణం ఆలోచిస్తే ఇలాంటి సంఘటనలు పునరావృత్తం కావంటున్నారు. వివిధ కారణాలతో 2018లో 69 మంది, 2019లో 59 మంది, 2020లో 46 మంది హత్యకు గురయ్యారు. పోలీసు రికార్డుల ప్రకారం మూడేళ్లలో వరుసగా హత్యలు తగ్గుతూ వచ్చాయి. అయితే ఈ ఏడాది జూన్‌ 30 నాటికి 38 మంది హత్యకు గురయ్యారు. ఇది భయపెట్టే అంశమే.


పోలీస్‌ నిఘా లోపించిందా..?

సమస్యాత్మక గ్రామాలు, ఫ్యాక్షన్‌ నేపథ్యం కలిగిన గ్రామాలపై పోలీస్‌ నిఘా పక్కాగా ఉండాలని పలువురు సూచిస్తున్నారు. ప్రతి గ్రామానికి విలేజ్‌ పోలీస్‌ ఉంటారు. జిల్లాలో స్పెషల్‌ బ్రాంచి పోలీసులు (ఎస్‌బీ), ఇంటలిజెన్స్‌, లోకల్‌ పోలీస్‌ నిఘా ఉంటుంది. అంతేకాదు.. తరుచుగా అనుమానిత గ్రామాల్లో ‘కార్డన్‌ అండ్‌ సెర్చ్‌’ నిర్వహించడం.. అనుమానితులను బైండోవర్‌ చేయడం వంటి పోలీస్‌ చర్యలతో పల్లెల్లో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిరోధించే అవకాశం ఉంది. పకడ్బంది పోలీస్‌ వ్యవస్థ ఉన్నా.. కోమన్నూతలలో ప్రత్యర్థుల దాడిలో సర్పంచి దారుణకు హత్యకు గురికావడం చర్చనీయాంశమైంది. పోలీస్‌ నిఘా లోపించిందా..? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సర్పంచి ఫలితాలు వచ్చిన రోజు రాత్రే ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఇరువర్గాలకు వారికి సుమారుగా 20 రోజులు స్టేషన్‌కు పిలిపించి కౌన్సిలింగ్‌ ఇచ్చి పంపారు. ఆ రోజునే ఇరువురిపై కేసులు పెట్టి ఉంటే.. కొంత భయం ఉండేదని, ఈ రోజున సర్పంచి హత్యకు గురయ్యే అవకాశాలు తక్కువగా ఉండేవని గ్రామస్థులు అంటున్నారు.


ఇటీవల జరిగిన కొన్ని ఘటనలు

పులివెందుల మండలం నల్లపురెడ్డిపల్లిలో జూన్‌ 15న వైసీపీ మాజీ ఎంపీటీసీ సభ్యుడు కొమ్మా శివప్రసాద్‌రెడ్డి తన లైసెన్స్‌ తుపాకితో భూమిరెడ్డి పార్థసారథిరెడ్డిని కాల్చి హత్య చేశారు. ఆ తరువాత ఆయన కూడా తుపాకితో కాల్చుకొని ఆత్యహత్య చేసుకున్నారు. ఇద్దరు ఎదురెదురు ఇళ్లలో ఉంటున్నారు. భేదాభిప్రాయాలే ఇద్దరి ప్రాణాలను బలి తీసుకున్నాయని గ్రామస్తులు అంటున్నారు. 

తొండూరు మండలం అగడూరులో జూలై 15న కులాయప్ప అనే యువకుడిని ముగ్గురు దారుణంగా హత్య చేశారు. పాత గొడవలే ఇందుకు కారణమని అంటున్నారు. 

మైదుకూరు నియోజకవర్గం బి.మఠం మండలం గొల్లపల్లిలో భూ తగాదాల వల్ల సుబ్బారెడ్డిని స్వంత సోదరులే హత్య చేశారు. ఏడుగురు కటకటాలపాలయ్యారు. 

ప్రొద్దుటూరు పట్టణంలో గత ఏడాది డిసెంబరు నెలలో టీడీపీ జిల్లా అధికార ప్రతనిధి నందం సుబ్బయ్య వైసీపీ వర్గీయుల చేతిలో దారుణ హత్యకు గురయ్యారు. ఈ ఘటన మరవకనే నందం సుబ్బయ్య తరహాలో హత్యకు గురౌతావంటూ ఎమ్మెల్సీ రమేశ్‌ యాదవ్‌నే ఫోన్లో బెదిరించడం ప్రొద్దుటూరులో కలకలం రేపుతోంది. 


సమస్యకు హత్య పరిష్కారం కాదు

- కేకేఎన్‌ అన్బురాజన్‌, ఎస్పీ, కడప

సమస్యకు హత్య పరిష్కారం కాదు. కోమనూతల గ్రామ సర్పంచి మునెప్ప హత్యకు దారితీసిన పరిస్థితులపై దర్యాప్తు చేస్తున్నాం. రెండు మూడు రోజుల్లో వాస్తవాలు వెల్లడిస్తాం. ఆస్తి తగాదాలు, కుటుంబ కలహాలు.. వంటి కారణాలతో పలు హత్య జరిగాయి. నిత్యం గ్రామాలు, పట్టణాల్లో అవగాహన కార్యాక్రమాలు నిర్వహిస్తున్నాం. సమస్యాత్మక గ్రామాల్లో పక్కా పోలీస్‌ నిఘా ఉంచాం. ఆస్తి తగాదాలు వంటి సమస్యలు ఏమైనా ఉంటే మా దృష్టికి తీసుకొస్తే పరిష్కారానికి కృషి చేస్తా. క్షణికావేశానికిలోనై హత్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు.



కోమన్నూతలలో టెన్షన్‌.. టెన్షన్‌

లింగాల, జూలై 27: కోమన్నూతల గ్రామ సర్పంచ్‌ గడ్డం మునెప్ప (55) దారుణ హత్యతో గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. పచ్చని పంటలతో అరటి తోటలతో కళకళలాడుతున్న గ్రామంలో సర్పంచ్‌ హత్యతో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఎప్పుడు ఏం జరుగుతుందోనని క్షణక్షణం గ్రామస్థులు భయాందోళన చెందుతున్నారు. కోమన్నూతల జనాభా 2,800. ఆ గ్రామం ప్రధాన జీవనాధారం వ్యవసాయం. ఎప్పుడూ నవ్వుతూ పలకరించుకునే వారు. ఒకరి క్షేమ సమాచారాలు గురించి తెలుసుకొని కష్టసుఖాలు పంచుకునే వారు. పంచాయతీ ఎన్నికల వరకు ఆ గ్రామంలో ఎలాంటి గొడవలు లేవు. అందరూ కలిసిమెలసి ఉండేవారు. సర్పంచు ఎన్నికలతో ఆ గ్రామం రెండు వర్గాలుగా చీలిపోయింది. వైసీపీలోనే రెండు వర్గాలుగా ఏర్పడ్డాయి. ఆధిపత్యపోరులో భాగంగా మంగళవారం సర్పంచు మునెప్ప హత్యకు గురయ్యాడు. పులివెందుల నుంచి వస్తున్న మునెప్పను అతి దారుణంగా వేటకొడవళ్లతో విచక్షణరహితంగా నరికి చంపారు. ఈయనకు భార్య లింగమ్మ, కుమారుడు మునీంద్ర, కుమార్తె మనీషా ఉన్నారు. హత్య జరిగిన వెంటనే పులివెందుల డీఎస్పీ శ్రీనివాసులు, సీఐలు రవీంద్రనాథరెడ్డి, భాస్కర్‌రెడ్డి, లింగాల ఎస్‌ఐ హాజీవల్లి, వేంపల్లె, ఆర్కేవ్యాలీ ఎస్‌ఐలు చేరుకొని మృతుని బంధువుల వద్ద నుంచి వివరాలు సేకరించారు. అనంతరం మృతదేహాన్ని పులివెందుల ఏరియా ఆసుపత్రికి తరలించారు.


భారీగా పోలీసుల మోహరింపు

కోమన్నూతల సర్పంచు మునెప్ప హత్యతో గ్రామంలో భారీగా పోలీసు బలగాలు మోహరించాయి. ముగ్గురు సీఐలు, ఐదుగురు ఎస్‌ఐలు, 40మంది సిబ్బందితో గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా మూడు చోట్ల పోలీస్‌ పికెట్లను ఏర్పాటుచేసినట్లు డీఎస్పీ తెలిపారు. కాగా పులివెందుల ఏరియా ఆసుపత్రి వద్ద మునెప్ప మృతదేహాన్ని కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి పరిశీలించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను ఓదార్చి అండగా ఉంటామని తెలిపారు. 



Updated Date - 2021-07-27T05:30:00+05:30 IST