అనుమానాస్పద స్థితిలోఇంటర్‌ విద్యార్థిని మృతదేహం లభ్యం

ABN , First Publish Date - 2022-05-22T05:58:23+05:30 IST

మెదక్‌ జిల్లా రామాయంపేట మండల పరిధి కోనాపూర్‌ చెరువులో అనుమానాస్పద పరిస్థితిలో ఇంటర్‌ విద్యార్థిని మృతదేహం లభ్యమైంది.

అనుమానాస్పద స్థితిలోఇంటర్‌ విద్యార్థిని మృతదేహం లభ్యం
ధర్నా చేస్తున్న మృతురాలి బంధువులు, గ్రామస్థులు, శ్రావణి(ఫైల్‌)

 ఇది హత్యేనంటూ కుటుంబీకుల ఆరోపణ

 అనుమానితులను అరెస్టు చేయాలని డిమాండ్‌.. రాస్తారోకో

 రామాయంపేట, మే 21: మెదక్‌ జిల్లా రామాయంపేట మండల పరిధి కోనాపూర్‌ చెరువులో అనుమానాస్పద పరిస్థితిలో ఇంటర్‌ విద్యార్థిని మృతదేహం లభ్యమైంది. ఇది హత్యేనంటూ కుటుంబీకులు గ్రామస్థులతో కలిసి శనివారం ఆందోళనకు దిగడం ఉద్రిక్తతను సృష్టించింది. వివరాల్లోకి వెళ్తే.. కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం బాగిర్తిపల్లి గ్రామానికి చెందిన పెద్దపొట్టి శ్రావణి(17) రామాయంపేటలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం పూర్తి చేసింది. పరీక్షలు అయిపోవడంతో బాగిర్తిపల్లిలోని తమ ఇంట్లోనే ఉంటున్న శ్రావణి శుక్రవారం సాయంత్రం బయటకు వెళ్లింది. రాత్రి అయినా తిరిగి రాకపోవడంతో  కుటుంబీకులు చుట్టు పక్కల వారి సహాయంతో పలు చోట్ల వెతికినా ఫలితం లేక పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. శనివారం వేకువజామునుంచే వెతికే క్రమంలో కామారెడ్డి, మెదక్‌ జిల్లాల సరిహద్దు గ్రామమైన కోనాపూర్‌ ఊరచెరువులో మృతదేహాన్ని గుర్తించారు. ఈ సమాచారమందుకున్న ఎస్‌ఐ రాజేశ్‌ ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని చెరువు నుంచి బయటకు తీయించి పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. అయితే పోలీస్‌ స్టేషన్‌ చేరుకున్న మృతురాలి కుటుంబీకులు శ్రావణి ఆత్మహత్య చేసుకోలేదని, ఇద్దరు వ్యక్తులు ఆమెని వేధించి చంపేశారంటూ ఆరోపించారు. వారిని అరెస్టు చేసేంత వరకు మృతదేహాన్ని తీసుకెళ్లబోమని పట్టుబట్టారు. అనంతరం గ్రామస్థులతో కలిసి స్థానిక అంబేడ్కర్‌ చౌరస్తాలో రాస్తారోకో చేపట్టారు. దీంతో సీఐ చంద్రశేఖర్‌రెడ్డి, ఎస్‌ఐ రాజేశ్‌లు బాధితులను సముదాయించి న్యాయం చేస్తామంటూ నచ్చజెప్పడంతో ధర్నా విరమించారు. కాగా శనివారం సాయంత్రం పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.   

Updated Date - 2022-05-22T05:58:23+05:30 IST