విజృంభిస్తున్న కరోనా

Published: Mon, 17 Jan 2022 22:51:02 ISTfb-iconwhatsapp-icontwitter-icon
విజృంభిస్తున్న కరోనా

జిల్లాకు ‘మహా’ ముప్పు

అంతర్రాష్ట్ర వంతెన ద్వారా ప్రజల రాకపోకలు

పెరుగుతున్న కరోనా  కేసులు

ఒకరోజే 451 మందికి పాజిటివ్‌

కోల్‌బెల్ట్‌ ప్రాంతంలో అధికంగా నమోదు

మంచిర్యాల, జనవరి 17 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో కరోనా థర్డ్‌ వేవ్‌ విజృంభిస్తోంది. జిల్లాకు పొరుగున ఉన్న మహారాష్ట్ర నుంచి అతిపెద్ద ముప్పు పొంచి ఉందని అధికార యంత్రాంగం భావిస్తోంది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే జిల్లా యంత్రాంగానికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. కోటపల్లి మండలం రాపనపల్లి వద్ద మూడేళ్ల క్రితం తెలంగాణను మహారాష్ట్రలోని సిరొంచాతో కలుపుతూ ప్రాణహిత నదిపై అంతర్రాష్ట్ర వంతెన నిర్మాణం చేపట్టారు. బ్రిడ్జి దాటితే నేరుగా మంచిర్యాల జిల్లాకు ప్రవేశించే వెసులుబాటు ఉండడంతో మహారాష్ట్రతో పాటు ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా రాష్ట్రాల నుంచి ప్రజలు రాకపోకలు సాగిస్తుం టారు. అలాగే నాగపూర్‌, చంద్రాపూర్‌ వాసులు ఆసిఫాబాద్‌ జిల్లా వాం కిడి మీదుగా మంచిర్యాల మీదుగా వంతెన దాటి మహారాష్ట్రకు వెళుతుం టారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో న్యూఢిల్లీ-సికింద్రాబాద్‌ ప్రధాన రైల్వే లైను అందుబాటులో ఉండడంతో ఇతర ప్రాంతాలకు వెళ్లే పొరుగు రాష్ట్రాల ప్రజలు మంచిర్యాల వరకు రైలులో వచ్చి, అనంతరం తమతమ ప్రాంతాలకు  ప్రయాణాలు సాగిస్తుంటారు. జిల్లాలోని జైపూర్‌ విద్యుత్‌ ప్లాంటులో పని చేస్తున్న కార్మికులతోపాటు మరమ్మతుల సమయంలో మహారాష్ట్ర, బీహార్‌, ఉత్తరప్రదేశ్‌ నుంచి టెక్నీషియన్లు, కూలీలు రైళ్ల ద్వారా ఇక్కడికి వస్తుంటారు. ప్రస్తుతం జరుగుతున్న జాతీయ రహదారి విస్తరణ పనులు, ఇటుకల బట్టీలు, హోటళ్లు, బార్లలో పని చేసే కూలీలు కూడా పొరుగు రాష్ట్రాల నుంచి ఇక్కడి వస్తుంటారు. వీరి ద్వారా జిల్లాలో కొవిడ్‌ కేసులు పెరుగుతున్నట్లు అధికారులు భావిస్తున్నారు. 

మహారాష్ట్ర నుంచి రోగుల రాక...

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఆసుపత్రుల్లో చికిత్స పొందేందుకు మహారాష్ట్రకు చెందిన వారు అధికంగా వస్తుంటారు. కరోనా సెకండ్‌ వేవ్‌లో మహారాష్ట్రలో కొవిడ్‌ విలయతాండవం చేయగా చికిత్స కోసం అంబులెన్సుల్లో నిత్యం పదుల సంఖ్యలో పేషెంట్లు జిల్లా కేంద్రానికి వచ్చారు. ముఖ్యంగా సిరొంచా లాంటి మారుమూల ప్రాంతాల్లో వైద్య సౌకర్యం తక్కువగా ఉండడంతో మంచిర్యాలకు వస్తున్నారు. అక్కడి రోగులకు వారి జిల్లా కేంద్రమైన గడ్చిరోలికి వెళ్లాలంటే దాదాపు 200 కిలోమీటర్లు ప్రయాణించాలి. అదే మంచిర్యాల జిల్లా కేంద్రానికి కేవలం 60 కిలోమీటర్లు ప్రయాణిస్తే సరిపోతుంది. దీంతో ఆయా ప్రాంతాల రోగులు మంచిర్యాలకు వస్తుంటారు. రోగుల వెంట ముగ్గురు, నలుగురు అటెండెంట్లు వచ్చి ఇక్కడి బస్టాండ్లు, లాడ్జీల్లో మకాం వేయడంతో గతంలో ఈ ప్రాంతంలో కొవిడ్‌ ఉధృతి పెరిగింది. సెకండ్‌ వేవ్‌కు సం బంధించి జిల్లాలోని చెన్నూరు మండలం ముత్తరావుపల్లిలో తొలి కొవిడ్‌ కేసు నమోదైంది. గ్రామానికి చెందిన ఓ మహిళ చేలో పనులకు మహా రాష్ట్ర కూలీలు రావడంతో వారి ద్వారా సదరు మహిళకు వైరస్‌ సోకినట్లు అధికారులు ధ్రువీకరించారు. 

పరీక్ష కేంద్రం ఏర్పాటు..

ప్రస్తుతం ఽథర్డ్‌వేవ్‌లో పాజిటివ్‌ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతుం డడంతో అధికారులు కోటపల్లి మండలం రాపనపల్లి అంతరాష్ట్ర వంతెన వద్ద కొవిడ్‌ పరీక్షా కేంద్రాన్ని ఈ నెల 8న ఏర్పాటు చేశారు. పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చే వారికి పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఈ నెల 10న నిర్వహించిన పరీక్షల్లో ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా రాష్ట్రాలకు చెందిన నలుగురికి పాజిటివ్‌ రావడంతో వారిని అధికారులు వెనక్కి పంపించారు. అయితే ఆసిఫాబాద్‌ జిల్లా వాంకిడి వద్ద తెలంగాణలోకి ప్రవేశించే వారిపై నిఘా లేకపోవడం ఆందోళనకు గురి చేస్తోంది. బోర్డర్లలో స్ర్కీనిం గ్‌ సెంటర్లు, పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశించినా వాంకిడి వద్ద ఇప్పటి వరకు పకడ్బందీ ఏర్పాట్లు చేయలేదు. దీంతో పొరుగు రాష్ట్రాలకు చెందిన వారు నేరుగా ఆసిఫాబాద్‌ మీదుగా మంచి ర్యాలకు వస్తుండడంతో జిల్లా వాసులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా అఽధికారులు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు. 

భారీగా కేసులు నమోదు

జిల్లాలో కరోనా పంజా విసురు తోంది. థర్డ్‌వేవ్‌లో పాజిటివ్‌ రేటు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, క్లస్టర్‌, అర్బన్‌ హెల్త్‌ సెంటర్లు, జిల్లా ఆసుపత్రి, మొబైల్‌ టెస్టింగ్‌ సెంటర్లతోపాటు సింగరేణి ఏరియా ఆస్పత్రుల్లో సోమవారం నిర్వహించిన పరీక్షల్లో ఏకంగా 451 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. జిల్లా వ్యాప్తంగా 1950 రాపిడ్‌ యాంటిజెన్‌ పరీక్షలు నిర్వహించగా, మరో 115 మందికి ఆర్టీపీసీఆర్‌ టెస్టులు చేశారు. ఆర్టీపీసీఆర్‌ పరీక్షల ఫలితాలు రావడానికి సమయం ఉండగా రాపిడ్‌ యాంటిజెన్‌ ఫలితాలను వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. నస్పూర్‌లోని సింగరేణి డిస్పెన్సరీలో 190 మందికి పరీక్షలు నిర్వహించగా 109 మందికి కరోనా నిర్ధారణ అయింది. లక్షెట్టిపేట మండలం వెంకట్రావ్‌పేటలో 114 పరీక్షలు చేయగా ఇక్కడ ఒక్క పాజిటి వ్‌ కేసు కూడా నమోదు కాకపోవడం గమనార్హం. రామకృష్ణాపూర్‌ సింగ రేణి ఏరియా ఆస్పత్రిలో 111 టెస్టులకు 60 పాజిటివ్‌, జిల్లా ఆస్పత్రిలో 100 పరీక్షలకు 60 పాజిటివ్‌గా నమోదయ్యాయి. జిల్లా కేంద్రంలోని రాజీవ్‌నగర్‌ పీహెచ్‌సీలో 89 పరీక్షలకు 41, పాత మంచిర్యాల అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌లో 57కు 25, నస్పూర్‌ పీహెచ్‌సీలో 76కు 23, శంషీర్‌నగర్‌ పీహెచ్‌సీలో 107 పరీక్షలకు 4, చెన్నూరు మండలం అంగరాజుపల్లి పీహెచ్‌సీలో 103 పరీక్షలకు 3 పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. జిల్లాలో ఒకేసారి కేసుల సంఖ్య అమాంతంగా పెరగడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.  

ఆర్టీసీ డిపోలో 11 మందికి పాజిటివ్‌  

మంచిర్యాల కలెక్టరేట్‌: మంచిర్యాల ఆర్టీసీ డిపోలో అధికారులు, సిబ్బంది కరోనా బారిన పడుతున్నారు. సోమవారం 11 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.  ఇందులో డిపోలోని  నలుగురు సూపర్‌ వైజర్‌లకు, ఏడుగురు ఆర్టీసీ కార్మికులు ఉన్నారు. కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలని, జాగ్రత్తలు పాటిస్తూ విధులు నిర్వహించాలని అధికారులు సూచించారు. బస్సులకు ఎప్పటికప్పుడు శానిటైజేషన్‌ చేయిస్తున్నామని ప్రయాణికులు మాస్కులు ధరిస్తూ శానిటైజర్‌లను వాడాలని ఇన్‌చార్జి డీఎం పేర్కొన్నారు.  

కోల్‌బెల్ట్‌ ప్రాంతంలో

నస్పూర్‌ : కోల్‌బెల్ట్‌ ప్రాంతంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. దీంతో అధికారులు, కార్మికులు ఆందోళనకు గురవుతున్నారు. సింగరేణి డిస్పెన్సరీలో 190 మందికి పరీక్షలు చేయగా 109 మందికి కరోనా పాజిటివ్‌ నిర్థారణ అయ్యింది. సింగరేణిలో 15, 16 తేదిల్లో పరీక్షలకు సెలవు కావడం, సోమవారం నిర్వహించిన పరీక్షల్లో పాజిటివ్‌ ల సంఖ్య మరింత పెరిగింది. సింగరేణిలో కరోనా కట్టడికి పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని, ఉద్యోగులందరికీ పరీక్షలు నిర్వహించాలని, మాస్కులు, శానిటైజర్లను పంపిణీ చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.