Uttar Pradesh : ఆ బాలునికి 22 ఏళ్ళ తర్వాత జువెనైల్ జస్టిస్ బోర్డులో ఊరట

ABN , First Publish Date - 2022-06-26T00:17:05+05:30 IST

కళ్లు కాయలు కాసేలా ఎదురు చూసిన తర్వాత ఆ బాలునికి న్యాయం జరగింది.

Uttar Pradesh : ఆ బాలునికి 22 ఏళ్ళ తర్వాత జువెనైల్ జస్టిస్ బోర్డులో ఊరట

ఆగ్రా : కళ్లు కాయలు కాసేలా ఎదురు చూసిన తర్వాత ఆ బాలునికి న్యాయం జరగింది.  ఆయన అత్యాచారం చేసినట్లు నమోదైన ఆరోపణలను అలీగఢ్‌లోని జువెనైల్ జస్టిస్ బోర్డు రద్దు చేయడంతో ఊపిరి పీల్చుకున్నాడు. ఈ తీర్పు కోసం ఆయన దాదాపు 22 సంవత్సరాలపాటు ఎదురు చూశాడు. చివరికి తన ఆశ, కలలు ఫలించడంతో సంతృప్తి చెందాడు. 


ఓ మైనర్ బాలికపై అత్యాచారం జరిగినట్లు 2000 ఆగస్టు 26న కేసు నమోదైంది. ఈ కేసులో నిందితుడు కూడా అప్పటికి మైనర్. ఆయనను జువెనైల్ హోం‌మ్‌కు తరలించారు. అనంతరం ఆయనకు బెయిలు మంజూరైంది. జువెనైల్ జస్టిస్ బోర్డులో విచారణ కొనసాగింది. అప్పటి బాల నిందితుని వయసు ప్రస్తుతం 38 సంవత్సరాలు. నిందితుడు అత్యాచారానికి పాల్పడినట్లు రుజువు చేయడంలో ప్రాసిక్యూషన్ విఫలమైందని జువెనైల్ జస్టిస్ బోర్డు తీర్పు చెప్పింది. ఆయనను నిర్దోషిగా విడుదల చేస్తున్నట్లు తెలిపింది. 


తనపై నమోదైన అత్యాచారం ఆరోపణలను కొట్టివేయడంతో ఆయన చాలా సంతోషించారు. మీడియాతో మాట్లాడుతూ, తాను రేపిస్టునని తనపై ఉన్న ముద్ర తొలగిపోయిందన్నారు. రేపిస్ట్ అనే ట్యాగ్ నుంచి తాను ఎట్టకేలకు విముక్తి పొందానని చెప్పారు. తాను చేయని నేరానికి నిందితుడినయ్యానని ఆవేదన వ్యక్తం చేశారు. అంతిమ తీర్పు వచ్చే వరకు ఈ కళంకం తనకు, తన కుటుంబ సభ్యులకు అవమానకరంగా ఉండేదన్నారు. తనను ఈ కేసులో ఇరికించడానికి కారణం రెండు పార్టీల మధ్య ఉన్న భూ వివాదమేనని ఆరోపించారు. 


నిందితుని తరపున జీసీ సిన్హా, కేకే గౌతమ్ వాదనలు వినిపించారు. ఉదయం పొలంలోకి వెళ్ళిన మైనర్ బాలికపై తమ క్లయింటు అత్యాచారం చేసినట్లు 2000 ఆగస్టు 26న అత్రౌలీ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారని చెప్పారు. బాధితురాలు, ఆమె తండ్రి, అంకుల్‌ల స్టేట్‌మెంట్లను పరిశీలించిన కోర్టు బాధితురాలు, ఆమె తండ్రి ఇచ్చిన స్టేట్‌మెంట్లు పరస్పర విరుద్ధంగా ఉన్నట్లు గుర్తించిందని తెలిపారు. 


జువెనైల్ జస్టిస్ బోర్డు ప్రిన్సిపల్ మేజిస్ట్రేట్ నరేశ్ కుమార్ దివాకర్, సభ్యులు సాధన గుప్త, ప్రశాంత సింగ్ రాఘవ్ ఈ తీర్పు చెప్పారు. 


Updated Date - 2022-06-26T00:17:05+05:30 IST