దివిసీమలో మానవతా దీప్తి

ABN , First Publish Date - 2020-11-27T06:07:55+05:30 IST

అది1977 నవంబరు 19. అర్ధరాత్రి సముద్రం అలలు ఉవ్వెత్తున ఎగసిపడి దివిసీమలో ఉప్పెన సంభవించి ఊళ్ళకు ఊళ్లనే తుడిచిపెట్టేసింది...

దివిసీమలో మానవతా దీప్తి

ముప్పయి సంవత్సరాల వయసులో దివిసీమ తుఫాను బాధితుల మధ్య ఒక సామాజిక కార్యకర్తగా నేను గడిపిన రెండు సంవత్సరాల కాలం ఎన్నో జీవన సత్యాలను నేర్పింది. భిన్నత్వంతో కూడిన సమాజాన్ని ఏకత్వంతో చూసే దృష్టి అలవడింది. ఇది నా జీవితంలో ఒక పెద్ద మార్పు.


అది1977 నవంబరు 19. అర్ధరాత్రి సముద్రం అలలు ఉవ్వెత్తున ఎగసిపడి దివిసీమలో ఉప్పెన సంభవించి ఊళ్ళకు ఊళ్లనే తుడిచిపెట్టేసింది. ఇది కనీవినీ ఎరుగని విషాదం. వార్తా కథనాలు ఒక్క దివిసీమ లోనే సుమారు 8,504 మంది మృత్యువాతకు గురైనారని పేర్కొనగా, లెక్కకు తేలినవే పది వేలయితే లెక్కకు లేకుండా కొట్టుకుపోయిన శవాలు ఎన్నో వేలు. ఉప్పెన ప్రాంతాల్లో మృతుల కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటి అంతటా వింతైన నిశ్శబ్దం ఆవరించింది. ఆ కరాళ నృత్యం దివిసీమ ప్రజల జీవితాలను అతలాకుతలం చేసింది. వారిని నిస్సహాయులుగా, నిరాశ్రయులుగా మార్చింది. ఆంధ్రప్రదేశ్ ప్రాంత ఆరెస్సెస్ ప్రచారక్ సొంపల్లి సోమయ్య సహాయక కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించడంతో నేను, ద్వారకాచార్యులు, శ్రీధర్ జీ, విద్వాన్ రెడ్డి, శ్యామ్‌ప్రసాద్ రెడ్డి, డాక్టర్ సుబ్రహ్మణ్య శాస్త్రి, ఇంకా కొంతమంది స్వయంసేవకులతో కలసి ఒక బృందంగా 1977 నవంబరు 21న దివిసీమకు బయలుదేరాము.


ముందుగా అవనిగడ్డకు చేరాము. భావదేవరాపల్లి, అవనిగడ్డ, కోడూరు, సొర్లగొంది, మూలపాలెం తదితర గ్రామాలలో కనుచూపు మేరలో ఎక్కడ చూసినా గుట్టలు గుట్టలుగా శవాలు పడి ఉన్నాయి. సొంతవారు కూడా దహన సంస్కార కార్యక్రమాలను చేయలేని నిస్సహాయస్థితిలో ఉన్నారు. మా బృందం మొదటి ప్రాధాన్యంగా శవాలను తొలగించేందుకు ఉపక్రమించింది. దహనం చేయడానికి కట్టెలు సైతం దొరకని పరిస్థితులలో శవాలను మోసుకుని ‘రాం నామ్ సత్య్ హే’ అంటూ కిరోసిన్‌తో దహన కార్యక్రమాలను నిర్వహించాం. దాదాపుగా కుళ్ళిపోయి ఉన్న ఆ శవాల నుంచి వెలువడే దుర్గంధంతో హృదయ విదారకమైనటువంటి మనస్థితిలో కేవలం పాలు, బిస్కెట్లు, మంచి నీళ్లు మాత్రమే ఆహారంగా స్వీకరిస్తూ చేతులకు గ్లౌజులు, నోటికి మాస్కులు, ఖాకీ నిక్కరు ధరించి వారి అంతిమ దహన సంస్కారాలను నిర్వహించడం చూసిన అనేక మంది మమ్మల్ని ‘శవసేన’ గా భావించేవారు. మా ఈ కార్యక్రమాలు ప్రభుత్వ అధికారులను సైతం ఎంతగానో ఆశ్చర్యపరిచాయి. అటు పిమ్మట శిబిరాలలో తలదాచుకున్న బాధితులకు సేవలందించడం ఆరంభించాం.


దివిసీమలో ప్రళయం సృష్టించిన ఈ ఉప్పెనలో తల్లితండ్రులను కోల్పోయి అనాథలయిపోయిన సుమారు 42 మంది పిల్లలను చేరదీసి వారి కోసం ప్రత్యేకంగా మచిలీపట్టణంలో ఒక అనాథ ఆశ్రమాన్ని నడిపాం. పలు గ్రామాలలో విద్యార్థులకు పుస్తకాలు, దుస్తులు అందించి వారి చదువును కొనసాగించడానికి తగిన సహాయ కార్యక్రమాలను చేపట్టాం. సర్వనాశనమయిన మూలపాలెం అనే మత్స్యకార గ్రామాన్ని పునర్నిర్మించడానికి పూనుకున్నాం. దాని పునర్నిర్మాణ ప్రణాళికను వాస్తు శైలిలో జిఎస్‌కే ఆర్య (నాటి ఆంధ్రప్రదేశ్ రోటరీ గవర్నర్) రూపకల్పన చేశారు. స్వయంసేవకులు ఆ గ్రామాన్ని ఒక ఆదర్శగ్రామంగా తీర్చిదిద్దాలని సంకల్పించారు. మా బృందం, గ్రామప్రజలు కుటుంబసభ్యులుగా అందరం కలిసిమెలసి ఒకే మెస్‌లో భోజనం చేస్తూ, తమ గృహాలను తామే కట్టుకోవాలనే స్ఫూర్తితో వారిని భాగస్వాములుగా చేశాం. ఇది నా జీవితంలో ఒక అద్భుతమైన అనుభవం. విద్యుశ్ఛక్తి లేని లోటు, రాత్రి కాగానే అంతటా అంధకారం, గాలి హోరుకు స్థిరంగా ఉండలేని దీపం వెలుతురు. నీళ్లు ఇటుకలు సుదూరప్రాంతం నుంచి రవాణా చేయడంలో ఎదుర్కొన్న తీవ్ర ఇబ్బందులు. ప్రణాళికను అనుసరిస్తూ అందరం సమష్టిగా క్రమశిక్షణతో నాలుగు మాసాల్లో 110 ఇండ్లను పక్కాగా నిర్మింపజేశాం. వీటి నిర్మాణంలో భాగంగా ప్రతి ఇంటికి తప్పనిసరిగా మంచి నీటి సౌకర్యాన్ని అలాగే వ్యక్తిగత మరుగుడొడ్డిని కల్పించాం. కమ్యూనిటీ హాల్, పోస్ట్ ఆఫీస్, పాఠశాల, ఆసుపత్రి లాంటి అవసరమయిన అన్ని సౌకర్యాలని ఏర్పాటు చేసి ఒక ఆదర్శగ్రామంగా తీర్చిదిద్దాము. 


ఇలా పునర్నిర్మించిన మూలపాలెం గ్రామాన్ని దీన్‌దయాళ్‌పురంగా నాటి విదేశీ వ్యవహారాల మంత్రి అటల్ బిహార్ వాజ పేయి ఆవిష్కరించారు. ఆ ప్రారంభోత్సవ సభలో వాజ పేయి మాట్లాడుతూ, వరుసగా తీర్చిదిద్దినట్లు ఉన్నటువంటి ఈ గృహాలన్నీ కూడా సుందరదృశ్యంగా, జపాన్ దేశం నుంచి తీసుకువచ్చి ఈ ప్రదేశంలో పొందికగా అమర్చినట్లుగా ఉన్నాయని అభివర్ణించారు. ‘ప్రకృతి విలయతాండవం చేసింది. అయితే ఆ విలయతాండవంపై విజయాన్ని సాధించినట్లుగా అనేక కార్యక్రమాలు జరిగాయి’ అని ఆయన అన్నారు. 


ముప్పయి సంవత్సరాల వయసులో దివిసీమ తుఫాను బాధితుల మధ్య ఒక సామాజిక కార్యకర్తగా నేను గడిపిన సుమారు రెండు సంవత్సరాల కాలం ఎన్నో జీవనసత్యాలను నేర్పింది. పేదరికం, ప్రజలు పడే కష్టాలు, ఇబ్బందులు తెలిసివచ్చాయి. వాటి పరిష్కారానికి కృషి చేసే సందర్భాలలో మంత్రులతో, ప్రభుత్వ యంత్రాంగంతో వ్యవహరించాల్సిన తీరు, పద్ధతులపై చక్కటి అవగాహన ఏర్పడింది. ఇదే క్రమంలో నాటి రాష్ట్రప్రభుత్వ ప్రముఖులు మండలి వెంకట కృష్ణారావు, చెన్నా రెడ్డి, వెంగళరావు, జనార్దన్ రెడ్డి మొదలైన వారితో పరిచయమయింది. ప్రజల సమస్యలపై సంపూర్ణ అవగాహనతో స్పష్టంగా వారికి వివరించి, వాటికి సరైన పరిష్కారాలు సూచించడం ద్వారా వారితో సాన్నిహిత్యం ఏర్పడింది. ఒకపక్క కృష్ణాజిల్లా కలెక్టర్, మరో పక్క హైదరాబాద్‌లోని సెక్రటేరియట్ అధికారులతో, ముఖ్యమంత్రితో, మంత్రులతో నేను నెరపిన ఉత్తరప్రత్యుత్తరాల మూలంగా ప్రభుత్వ యంత్రాంగం, దాని పనితీరు గురించి ఎన్నో విషయాలు తెలిశాయి. 


దివిసీమ పునర్నిర్మాణంలో కీలకపాత్ర పోషించిన దాదాపు 125 స్వచ్ఛంద సంస్థలను ఏకతాటిపైకి తెచ్చి, వాటి కార్యకలాపాలను సమన్వయం చేయడానికి మండలి కృష్ణారావు అధ్యక్షతలో ఏర్పాటుచేసిన కమిటీకి మాజీ గవర్నర్ అక్బర్ అలీ ఖాన్ చైర్మెన్‌గా, నేను సెక్రటరీగా వ్యవహరించాం. ఈ బాధ్యతలలో భాగంగా పునర్నిర్మాణంలో పాలుపంచుకున్న పలు స్వచ్ఛంద సంస్ధల ప్రతినిధులతో, వివిధ వర్గాల వారితో తరచుగా సమావేశమవుతూ ఉండేవాడిని. ఒక సందర్భంలో ప్రముఖ నక్సలైట్ నాయకుడు సనక బుచ్చికోటయ్య నాతో సంభాషిస్తూ ‘మీరు హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడే ఉండి సేవ చేయడం ఎంతో గొప్ప విషయమని’ అని నాతో అన్నారు. హేతువాద సంఘ కార్యకర్తలైన లవణం, ఆయన భార్య హేమలత (మహాకవి జాషువా కుమార్తె) నాతో ఎన్నో విషయాలను చర్చించేవారు. సిద్ధాంతాలు వేరైనా, ఆలోచనలలో వైరుధ్యాలు ఉన్నప్పటికీ, నా మనోభావాన్ని గమనించి ఆత్మీయభావనతో వారందరితో కలసిమెలసి పనిచేయడంతో ఈ సమాజం ఎంత విశాలమో మొదటిసారిగా నాకు అనుభవంలోకి వచ్చింది.


అక్కడే ప్రముఖ గాంధేయవాది, సర్వోదయ నాయకుడు ప్రభాకర్‌జీతో పరిచయం ఏర్పడింది. సుమారు 8 నెలల పాటు ఆయన సాంగత్యం లభించింది. ఆయన నన్నెంతో ఆప్యాయంగా ‘దత్తోబా’ అని పిలిచేవారు. ‘దత్తోబా, నీవు ఇక్కడ ఆర్ఎస్ఎస్ తరపున సేవ చేస్తున్నావు, ఆర్‌ఎస్‌ఎస్ అంటే మేము ఏదో భావించుకుం టుంటాం. కానీ మీరు ఇక్కడ చేసిన సేవా కార్యక్రమాలను చూసిన తరువాత ఆర్ఎస్ఎస్ అంటే - రెడీ ఫర్ సెల్ఫ్‌లెస్ సర్వీస్ అనే భావన కలుగుతుంది’ అని ఆయన అన్నారు. 


అప్పటివరకు ఒక నియమిత పరిధిలోనే స్వయంసేవకుడిగా పనిచేస్తూ ఉండేవాణ్ణి. అయితే దివిసీమలో సామాజిక కార్యకర్తగా నేను చూసిన, భాగస్వామ్యం వహించిన విషయాలు నా ఆలోచనలు, అనుభవాలను మరింత విస్తృతం చేసి, ఈ సమాజం సువిశాలమైనదనే భావన నాలో జనింపజేశాయి. భిన్నత్వంతో కూడిన సమాజాన్ని ఏకత్వంతో చూసే దృష్టి అలవడింది. ఇది నా జీవితంలో ఒక పెద్ద మార్పు. దివి సీమలో నేను గడిపిన జీవితం, నా అనుభవాల వల్ల సమాజమే పరమేశ్వరుడనే భావన నాలో కలిగింది. అభాగ్యుల సేవే భగవంతుని సేవగా ప్రత్యక్ష అనుభవం పొందాను. ఆ విధంగా 1977 నవంబరు 25 న దివిసీమలో ఆరంభించిన నా సేవలను 1979 వరకు నిర్విరామంగా కొనసాగించాను. దివిసీమ ఉప్పెన స్మృతిలో మేము చేసిన సేవలను స్మరిస్తూ నిర్వహించిన అనేక వేది కలలో పాల్గొంటూ ఇప్పటికీ ఆ ప్రాంతంతో నా అనుబంధాన్ని కొనసాగిస్తూ వస్తున్నాను.


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సముద్రప్రాంతంలో దివిసీమ ఉప్పెన నాటి పరిస్థితులు పునరావృతం కాకుండా నివారించడానికి తీరప్రాంతం వెంబడి కరకట్టలను దృఢంగా నిర్మించి, మడ అడవుల పెంపకాన్ని ఇతోధికంగా ప్రోత్సహించి, రాబోయే తుఫానులు, వరదల బారి నుంచి ఆ తీర ప్రాంతాలను కాపాడడానికి, అవి కోతకు గురికాకుండా చూడడానికి శాశ్వత పరిష్కారాలకోసం కృషి చేయాలని కోరుతున్నాను. దివిసీమ ప్రజలందరూ సుఖ శాంతులతో వర్థిల్లాలని ఆ భగవంతుణ్ణి ప్రార్ధిస్తున్నాను.


బండారు దత్తాత్రయ

హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్

Updated Date - 2020-11-27T06:07:55+05:30 IST