మద్యం మత్తులో యువకుల హల్‌చల్‌

ABN , First Publish Date - 2020-08-07T06:43:58+05:30 IST

కూరగాయలు, పండ్లు కొనుగోలు చేసేందుకు రైతుబజారుకు వచ్చిన దంపతుల పట్ల నలుగురు యువకులు అసభ్యకరంగా

మద్యం మత్తులో యువకుల హల్‌చల్‌

ఓ మహిళపై నలుగురు ఆకతాయిల అసభ్య ప్రవర్తన నలుగురు 

మందలించిన భర్తను పరుగెత్తించి మరీ కొట్టిన వైనం 

రక్షణ కోసం ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్‌లోకి వెళ్లినా వదలకుండా దాడి 

కొత్తగూడెం పట్టణంలో ఘటన


కొత్తగూడెం పోస్టాఫీస్‌ సెంటర్‌, ఆగస్టు 6 : కూరగాయలు, పండ్లు కొనుగోలు చేసేందుకు రైతుబజారుకు వచ్చిన దంపతుల పట్ల నలుగురు యువకులు అసభ్యకరంగా ప్రవర్తించి, సినీఫక్కీలో దాడి చేసి.. భయానక వాతావరణాన్ని సృష్టించిన సంఘటన గురువారం కొత్తగూడెం పట్టణంలో జరిగింది. చుంచుపల్లి మండలంలోని ఓ పంచాయతీకి చెందిన దంపతులు రైతుబజారులో చెరో దుకాణం వద్ద కూరగాయలు కొంటున్నారు. అప్పటికే మద్యం మత్తులో ఉన్న నలుగురు ఆకతాయిలు అజీమ్‌, అజ్జు, మున్నా, హమీద్‌.. ఓ దుకాణం వద్ద ఉన్న ఆ వివాహిత పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడంతో భయంతో ఆమె మరో దుకాణం వద్ద ఉన్న భర్త వద్దకు వెళ్లింది. దీంతో ఆమె భర్త వారిని మందలించగా.. ఆగ్రహంతో వారు ఆయనపై దాడికి దిగారు. ఈ క్రమంలో ఆ దంపతులిద్దరు రక్షణ కోసం సమీపంలోని ఎంజీ రోడ్డులో ఉన్న ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్‌లోకి వెళ్లేందుకు పరిగెడుతుండగా..  ఆ యువకులు మాత్రం ఆయనపై దాడి ఆపలేదు.


పోలీస్‌స్టేషన్‌లోకి వెళ్లిన తర్వాత ఆ యువకులు ఆయనపై దాడి చేస్తూనే వారిని ఆపేందుకు ప్రయత్నించిన పోలీస్‌ సిబ్బందిని కూడా పక్కను నెట్టేస్తూ రణరంగం సృష్టించారు. ఈ సన్నివేశం సినిమాల్లోని ఫైట్‌ సీన్‌ను తలపించిన రీతిలో జరగ్గా.. స్తానికులు భయంతో వణికిపోయారు. పోలీస్‌స్టేషన్‌లోనే ఆ ఆకతాయిలు హల్‌చల్‌ చేస్తుంటే... సామాన్యులకు రక్షణ ఎక్కడ ఉంటుందంటూ స్థానికులు వాపోయారు. ఈ సమాచారం తెలుసుకున్న కొత్తగూడెం త్రీ టౌన్‌ పోలీసులు ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్‌కు చేరుకొని ఆ ఆకతాయిలను అదుపులోకి తీసుకొని త్రీ టౌన్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. బాధిత మహిళ ఫిర్యాదు మేరకు అజీమ్‌, అజ్జు, మున్నా, హమీద్‌ అనే యువకులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని త్రీ టౌన్‌ సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎల్‌. ఆదినారాయణ తెలిపారు. అయితే ఆ యువకులు తాగింది మద్యం కాదని, గంజాయి తాగి ఆ మత్తులో పైశాచికంగా ప్రవర్తించారని పలువురు స్థానికులు చెబుతున్నారు. ఇటీవల కొత్తగూడెం పట్టణంలో గంజాయి, తదితర మాదకద్రవ్యాలకు యువత బానిసవుతున్నారని, వీటిపై పోలీసులు దృష్టిపెట్టాలని కోరుతున్నారు. 

Updated Date - 2020-08-07T06:43:58+05:30 IST