మువ్వన్నెల రెపరెపలు

ABN , First Publish Date - 2022-01-27T08:09:13+05:30 IST

వాడవాడలా మువ్వన్నెల జెండా రెపరెపలాడింది.గణతంత్ర దినోత్సవాలతో వూరూవాడా సందడి నెలకొంది.

మువ్వన్నెల రెపరెపలు
చిత్తూరులో కలెక్టర్‌,డీఐజీ,జడ్పీ ఛైర్మన్‌ తదితరుల జెండా వందనం

చిత్తూరు కలెక్టరేట్‌/చిత్తూరు, జనవరి 26:వాడవాడలా మువ్వన్నెల జెండా రెపరెపలాడింది.గణతంత్ర దినోత్సవాలతో వూరూవాడా సందడి నెలకొంది. చిత్తూరు పోలీసు పరేడ్‌ మైదానంలో జరిగిన రిపబ్లిక్‌ డే వేడుకల్లో విధినిర్వహణలో ప్రతిభ కనబరచిన 516మంది ప్రభుత్వ ఉద్యోగులకు ప్రశంసాపత్రాలు అందజేశారు.రివర్స్‌ పీఆర్సీ తమకొద్దంటూ ఉద్యోగులు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో పురస్కారాలను అందుకుంటారో లేదో అన్న అనుమానాల నడుమ ఉద్యోగులంతా ఉత్సాహంతో వచ్చి  పురస్కారాలను అందుకోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.ఉదయం 9 గంటలకు జాతీయ పతాకాన్ని ఎగురవేసిన కలెక్టర్‌ ఎం.హరినారాయణన్‌ పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. పోలీసుల, ఎన్‌సీసీ క్యాడెట్ల కవాతులను, ప్రభుత్వ శాఖల శకటాల ప్రదర్శనను వీక్షించారు. విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి.పిచ్చాటూరు మండలం పులిగుడ్రం జడ్పీ హైస్కూల్‌ విద్యార్థులు ప్రదర్శించిన నాటుదామా నందనం నృత్యప్రదర్శనను కలెక్టర్‌ తదితరులు అభినందించారు. డీఐజీ శెంథిల్‌కుమార్‌,జేసీలు రాజాబాబు, వెంకటేశ్వర్‌, శ్రీధర్‌, రాజశేఖర్‌, జడ్పీ చైర్మన్‌ శ్రీనివాసులు, చిత్తూరు మేయర్‌ అముద, డీఆర్వో ఎంఎస్‌ మురళి, ఆర్డీవో రేణుక, ఏఎస్పీ రాజేంద్ర ప్రసాద నాయుడు తదితరులు పాల్గొన్నారు. 


వారి త్యాగాలే మనందరికీ స్ఫూర్తి కావాలి:కలెక్టర్‌ 

  స్వాతంత్రోద్యమంలో ముందుండి పోరాడిన త్యాగధనులు మనందరికీ స్ఫూర్తిదాయకం కావాలని కలెక్టర్‌ ఎం.హరినారాయణన్‌ పేర్కొన్నారు.గణతంత్ర దినోత్సవాల్లో ప్రజలనుద్దేశించి కలెక్టర్‌ మాట్లాడారు.జిల్లా ప్రగతిని వివరించారు.ప్రభుత్వ పథకాల ద్వారా  ఏయే వర్గాలు లబ్ధి పొందుతున్నాయో చెప్పుకొచ్చారు. 47వేల ఎకరాల్లో మల్బరీ సాగులో జిల్లా ప్రథమస్థానంలో ఉందన్నారు.పాలఉత్పత్తిని రెండేళ్ళలో 38 లక్షల లీటర్లకు పెంచేందుకు ప్రణాళిక రూపొందించామన్నారు.కరోనా మహమ్మారిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు మొదటి డోస్‌ 100 శాతం, రెండో డోస్‌ 80శాతం పూర్తి చేశామన్నారు. ఢిల్లీలో జరుగుతున్న గణతంత్ర దినోత్సవాల్లో ప్రదర్శించే కళారూపాల్లో శ్రీకాళహస్తి కళంకారీకి చోటు లభించడం హర్షణీయమన్నారు.10 మంది స్వాతంత్ర సమరయోధుల చిత్రాలను కళంకారీ కళతో మిళితం చేసి 30 మీటర్ల వస్త్రంపై చిత్రీకరించిన  శ్రీకాళహస్తి కళాకారుడు సుధీర్‌కు, ఆయన భార్య జమునాసింగ్‌కు అభినందనలు తెలిపారు.





Updated Date - 2022-01-27T08:09:13+05:30 IST