Advertisement

ప్రచార పోరుకు నేడు ఆఖరు

Mar 7 2021 @ 00:00AM

నేటి సాయంత్రం 5 గంటలకు బంద్‌ 

ఇప్పటికే మొదలైన ప్రలోభాల పర్వం 

ఆఖరి రోజు ఎక్కువ మందిని కలిసేందుకు అభ్యర్థుల ప్రణాళిక 

బరిలో 652 మంది 


వారం పది రోజులుగా హోరాహోరీగా సాగిన మున్సిపల్‌ ఎన్నికల ప్రచారం నేడు ముగియనుంది. మైకుల గోల.. బ్యాండ్‌ బాజాల దరువు.. ఇంటింటి ప్రచారాలకు సోమవారం సాయంత్రం 5 గంటలకు తెరపడనుంది. కాళ్లకు బలపం కట్టుకుని పరుగులు పెట్టిన అభ్యర్థులు చివరి రోజు వీలైనంత ఎక్కువ మందిని కలిసేందుకు ప్రణాళికలు రూపొందించుకున్నారు. అదే క్రమంలో ఓటర్లను తమ వైపు తిప్పుకోవడానికి ప్రలోభాల పర్వానికి తెర తీశారు. నగదు, మద్యం పంపిణీకి సిద్ధమవుతున్నట్లు తెలిసింది. ఎన్నికలు జరుగుతున్న 137 వార్డుల్లో 652 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు..


(కడప-ఆంధ్రజ్యోతి): జిల్లాలో కడప కార్పొరేషన, ప్రొద్దుటూరు, మైదుకూరు, బద్వేలు, రాయచోటి, జమ్మలమడుగు, ఎర్రగుంట్ల మున్సిపాలిటీలలో 137 వార్డులకు ఈనెల 10వ తేదీ పోలింగ్‌ జరగనుంది. 652 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వారిలో వైసీపీ అభ్యర్థులు 137, టీడీపీ 92, బీజేపీ-జనసేన 63, ఇతరులు 366 మంది ఉన్నారు. ఎన్నికలకు రీనోటిఫికేషన జారీ కాగానే అభ్యర్థులు ఓటర్లను కలుసుకుని తమ వైపు ఆకర్షించుకునేందుకు పలు విధాలా ప్రచారాలకు పదును పెట్టారు. అస్త్రశస్త్రాలతో ప్రచార పర్వాన్ని కొనసాగించారు. మరో 48 గంటల్లో పుర ప్రజలు తమ ఓటు అస్త్రం ద్వారా అభ్యర్థుల భవితవ్యం, గెలుపోటములను నిర్ణయించబోతున్నారు. ఎవరికి పట్టం కట్టబోతున్నారో అన్నది ప్రధాన చర్చగా ఉంది. బరిలో ఉన్న అభ్యర్థుల్లో టెన్షన నెలకొంది. అయితే.. ప్రొద్దుటూరు, మైదుకూరు, బద్వేల్‌ మున్సిపాలిటీల్లో వైసీపీని బలంగా ఢీకొట్టేందుకు టీడీపీ అన్ని విధాలుగా సిద్ధమవుతోంది. 


మారిన ప్రచార వ్యూహం

అభ్యర్థులకు ఇక మిగిలిన సమయం 48 గంటలే. దీంతో ప్రతి క్షణాన్ని సద్వినియోగం చేసుకుని ఓటర్లకు మరింత చేరువయ్యేందుకు అభ్యర్థులు ప్రచార వ్యూహాన్ని మార్చారు. ప్రధానంగా కడప, ప్రొద్దుటూరు, మైదుకూరు వంటి పట్టణాల్లో ఇటు టీడీపీ, అటు వైసీపీ అభ్యర్థులు తమ సన్నిహితులు, బంధువులు, మిత్రులను వార్డుల్లోకి రహస్యంగా పంపి ఓటర్ల నాడి తెలుసుకుంటున్నారు. ఏ సామాజికవర్గం ఎటువైపు మొగ్గు చూపుతోంది.. ఏ వీధిలో ఎవరికి బలముంది.. వంటి అంశాలను తెలుసుకుని, అభ్యర్థులను నేరుగా ఆ సామాజికవర్గ నాయకుల ఇంటికి వెళ్లి తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. దూరపు బంధువుల ద్వారా ఫోన్లు చేయించి తమకే ఓటు వేసేలా ఒప్పించేందుకు శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్నారు.  


ప్రలోభాల పర్వం

తమకు ఓటేస్తే.. ఇంటి పన్ను తగ్గింపు, బకాయిలు రద్దు, నీటి పన్ను రద్దు వంటి అస్త్రాలతో టీడీపీ అభ్యర్థులు వీధి వీధి నాది నాదే అంటూ ప్రచారాన్ని సాగించారు. అదే క్రమంలో ప్రభుత్వం అమలు చేసిన నవరత్నాలు ప్రతి ఇంటికీ అందాలన్నా.. అర్హులైన ప్రతి ఒక్కరికీ నవరత్నాలు చేరువవ్వాలంటే తమనే గెలిపించాలని వైసీపీ అభ్యర్థులు ప్రచారం చేశారు. ఈ హామీలకు ప్రజలు ఆకర్షితులై ఎవరికి ఓటేస్తారో తెలియని పరిస్థితి. దీంతో పోటీల్లో బలంగా ఢీకొడుతున్న అభ్యర్థులు ప్రలోభాల పర్వానికి తెర తీశారు. ఓటుకు రేటు కట్టి నేటి రాత్రి నుంచే పంపిణీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. అంతేకాదు.. మద్యం విచ్చలవిడిగా పంపిణీ చేస్తున్నారు. కడప నగరంలో ఎన్నికలు జరిగే 27 వార్డుల్లో వైసీపీ మొత్తం వార్డుల్లో పోటీ చేస్తే.. టీడీపీ 15 వార్డుల్లో అభ్యర్థులను పెట్టింది. మిగిలిన వార్డుల్లో వామపక్షాలు, స్వతంత్రులకు మద్దతు ఇస్తోంది. దాదాపు 20 వార్డుల్లో పోటీ నువ్వా.. నేనా అన్నట్లుగా ఉంది. దీంతో ఇక్కడ అభ్యర్థులు కూడా పోటా పోటీగా ఓటుకు రూ.500 నుంచి రూ.1000 వరకు పంచేందుకు సిద్ధమయ్యారు. కొందరైతే.. అపార్టుమెంట్లు, ప్రత్యేక కాలనీలను గుర్తించి గంపగుత్తగా ఓటర్లను కొనేందుకు సిద్ధమయ్యారు. మైదుకూరు పట్టణంలో టీడీపీ బలంగా ఢీకొట్టనుంది. దీంతో ఆ పార్టీని బలహీన పరిచేందుకు అరెస్టుల పర్వం హైడ్రామాను కొనసాగించిన అధికార పార్టీ అధి విఫలం కావడంతో మద్యం, నగదు పంపిణీలకు సిద్ధమైనట్లు తెలిసింది. ఇక్కడ ఓటుకు రూ.1000 నుంచి రూ.2000 వరకు పంచే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. టీడీపీ అభ్యర్థులు కూడా వెనక్కు తగ్గకుండా అన్ని విధాలుగా ఢీకొట్టేందుకు సై అంటున్నారు. ప్రొద్దుటూరు, బద్వేలు, జమ్మలమడుగు, ఎర్రగుంట్ల మున్సిపాలిటీల్లోనూ ఎన్నికలు జరిగే వార్డుల్లో ప్రలోభాల జోరు పెరిగింది.  


ఎన్నికలు జరిగే వార్డులు, బరిలో అభ్యర్థులు


మున్సిపాలిటీ వార్డులు వైసీపీ టీడీపీ బీజేపీ-జనసేన ఇతరులు మొత్తం

కడప 27 27 15 11 184 237 

ప్రొద్దుటూరు 32 32 32 15 54 136

మైదుకూరు 24 24 24 14 39 101

బద్వేలు 25 25 15 - 45 85

రాయచోటి 03 03 03 - 02 08

జమ్మలమడుగు 18 18 - 18 23 59

యర్రగుంట్ల 08 08 03 05 13 29

మొత్తం 137 137 92 63 360 652

Follow Us on:
Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.