కాలువను మింగేశారు

ABN , First Publish Date - 2022-06-30T05:42:29+05:30 IST

అడిగేవారు లేరు.. అడ్డుకునే అధికారులు అసలే లేరనుకున్నారో ఏమో.. చిన్న, సన్నకారు రైతుల పొలాల్లోకి నీరందించే పంట కాలువలను రియల్టర్లు కబ్జా చేశారు.

కాలువను మింగేశారు
వెంచర్‌లో కాలువను మూసేసి నిర్మించిన రోడ్డు

నిజాం కాలంలో తవ్వించిన సాగునీటి కాలువ

చిన్న, సన్నకారు రైతులకు జీవనాధారం

రియల్టర్ల ఆక్రమణ... పట్టించుకోని అధికారులు


సదాశివపేటరూరల్‌, జూన్‌ 29: అడిగేవారు లేరు.. అడ్డుకునే అధికారులు అసలే లేరనుకున్నారో ఏమో.. చిన్న, సన్నకారు రైతుల పొలాల్లోకి నీరందించే పంట కాలువలను రియల్టర్లు కబ్జా చేశారు. ఇబ్రహీంపూర్‌, బిల్కల్‌ నుంచి సదాశివపేట మండలంలోని మొగిలిపేట కాలువల ద్వారా ప్రవహించి గంగతకత్వవాగులో కలుస్తుంది. ఈ కాలువ నిజాం కాలంలో తవ్వించారు. ఈ కాలువ ద్వారా సుమారు 200 ఎకరాలకు నీరందుతున్నది. ప్రస్తుతం సదాశివపేట మండలంలో ఎక్కడ చూసినా వెంచర్లు వెలువడడంతో భూములకు మంచి డిమాండ్‌ ఏర్పడింది. 65వ నంబరు జాతీయ రహదారి సమీపంలో ఉండటంతో కొంతకాలంగా ఇక్కడి భూములకు ధరలు ఆకాశాన్నంటాయి. దీంతో బడాబాబులు పంట భూములను కొనుగోలు చేసి వెంచర్లుగా తీర్చిదిద్దుతున్నారు. మొగిలిపేటలో సర్వే నెంబర్‌ 53, 54 మీదుగా ప్రవహించే కత్వ కాలువను పూర్తిగా ఆక్రమించారు. వారి భూమి చుట్టూ ఎత్తయిన ప్రహరీ నిర్మించారు. తూములను పగలకొట్టి ప్లాట్లు, పార్కులు, రోడ్లను నిర్మించారు. కాలువలు ఆక్రమణకు గురికావడంతో చిన్న, సన్నకారు రైతులు పంటలు పండక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పట్టింపులేని రెవెన్యూ

అయితే ఈ అంశంపై బాధిత రైతులు పలుమార్లు రెవెన్యూ, ఇరిగేషన్‌ అధికారులకు ఫిర్యాదు చేసి తమ గోడు వెళ్లబోసుకున్నా అధికారుల చర్యలు మాత్రం శూన్యం. ఆర్థికంగా పలుకుబడి ఉన్న వ్యక్తులు కాబట్టి సంబంధిత శాఖ అధికారులు వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేక పోతున్నారని రైతులు మండిపడుతున్నారు. 

Updated Date - 2022-06-30T05:42:29+05:30 IST