డివైడర్‌ను ఢీకొన్న కారు

ABN , First Publish Date - 2022-09-26T05:08:24+05:30 IST

దైవదర్శనానికి ఆనందంగా బయల్దేరిన కుటుంబంలో రోడ్డు ప్రమాదం తీరని శోకం నింపింది. అనంతపురం జిల్లా గార్లదిన్నె వద్ద 44వ నెంబరు జాతీయ రహదారిపై ఆదివారం కారు అదుపుతప్పి, ఐరన సేఫ్టీ డివైడర్‌ను ఢీకొన్న ప్రమాదంలో తల్లి, కూతురు జయంతి (42), సంకీర్తన (10) దుర్మరణం చెందారు.

డివైడర్‌ను ఢీకొన్న కారు
కారులోకి చొచ్చుకుపోయిన సేఫ్టీ డివైడర్‌ ఇనుప రేకు

దైవ దర్శనానికి వెళ్తూ అనంత లోకాలకు..

తల్లి, కూతురు దుర్మరణం

తండ్రీకొడుకు క్షేమం

బాధితులు హైదరాబాద్‌ వాసులు


గార్లదిన్నె, సెప్టెంబరు 25 : దైవదర్శనానికి ఆనందంగా బయల్దేరిన కుటుంబంలో రోడ్డు ప్రమాదం తీరని శోకం నింపింది. అనంతపురం జిల్లా గార్లదిన్నె వద్ద 44వ నెంబరు జాతీయ రహదారిపై ఆదివారం కారు అదుపుతప్పి, ఐరన సేఫ్టీ డివైడర్‌ను ఢీకొన్న ప్రమాదంలో తల్లి, కూతురు జయంతి (42), సంకీర్తన (10) దుర్మరణం చెందారు. హైదరాబాద్‌లోని రామ్‌కోఠీ ప్రాంతానికి చెందిన రఘువరన రాజు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి. అతడి భార్య జయంతి అమెజాన కంపెనీలో పనిచేస్తుండేవారు. వీరి ఇద్దరు పిల్లలు సంకీర్తన ఏడు, సంకల్ప్‌ ఐదో తరగతి చదువుతున్నారు. వీరు శ్రీసత్యసాయి జిల్లాలో ప్రసిద్ధిచెందిన లేపాక్షి దేవాలయాన్ని దర్శించుకునేందుకు ఆదివారం ఉదయం కారులో హైదారాబాద్‌ నుంచి బయల్దేరారు. మార్గమధ్యలో గార్లదిన్నె వద్ద జాతీయ రహదారిపై కారు ఆదుపు తప్పింది. రహదారిపై పక్కనే ఉన్న ఐరన సేఫ్టీ డివైడర్‌ను ఢీకొంది. డివైడర్‌ రేకు కారులోకి చొచ్చుకుపోయి, వెనుక వైపు నుంచి బయటకు వచ్చింది. దీంతో కారులో ఎడమవైపు ముందు, వెనుక సీట్లలో కూర్చున్న సంకీర్తన, జయంతి శరీరాల్లో నుంచి చొచ్చుకుపోయింది. దీంతో వారిరువురు అక్కడికక్కడే మృతిచెందారు. డ్రైవింగ్‌ చేస్తున్న రఘువరనరాజు, ఆయన వెనుక సీటులో కూర్చున కుమారుడు సంకల్ప్‌కు ఎలాంటి గాయాలు కాలేదు. కళ్ల ముందే భార్య, కుమార్తె చనిపోవడంతో రఘువరన రాజు బోరున విలపించాడు. గార్లదిన్నె ఎస్‌ఐ సాగర్‌, సిబ్బంది ప్రమాద స్థలానికి చేరుకుని, పరిశీలించారు. క్రేన, ఎక్స్‌కవేటర్‌ సాయంతో కారును పక్కకు తీశారు. మృతదేహాలను బయటకు తీసి, అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.


కూతుళ్ల దినోత్సవం రోజునే..

రఘువరన రాజుకు కూతురు అంటే చాలా ఇష్టం. అంతర్జాతీయ కూతుళ్ల దినోత్సవం రోజునే రక్తపు మడుగులో రెండు భాగాలుగా విడిపోయిన కూతురు శరీరాన్ని చూసి ఆ తండ్రి విలవిల్లాడాడు. ‘అప్పుడే నీకు నూరేళ్లు నిండాయా తల్లీ..’ అంటూ కన్నీరుమున్నీరుగా విలపించాడు. ఆ తండ్రీకొడుకులు విలపించిన తీరు అక్కడున్న వారిని కలచి వేసింది.


హైవే అధికారుల నిర్లక్ష్యం

జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎనహెచఏఐ) అధికారుల నిర్లక్ష్యం మూలంగానే ఇద్దరి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఐరన సేఫ్టీ డివైడర్‌ రేకు రెండువైపులా మొనదేలి ఉంటుంది. అది ప్రమాదకరం. కావున నిబంధనల మేరకు డివైడర్‌ రేకు మొనలను నేలలోకి పాతాలి. ఎనహెచఏఐ అధికారులు అలా చేయకుండా బయటే వదిలేశారు. దీంతో పదునైన రేకు కారులోకి చొచ్చుకెళ్లి, తల్లి, కుమార్తెను బలిగొంది. దానిని నేలలోకి పాతి ఉండుంటే ప్రాణనష్టం జరిగేది కాదేమోనని స్థానికులు చర్చించుకుంటున్నారు. ప్రమాదం తర్వా త తేరుకున్న అధికారలు.. ఎక్స్‌కవేటర్‌ సాయంతో డివైడర్‌ రేకు మొనలను పక్కకు వంచారు.

Updated Date - 2022-09-26T05:08:24+05:30 IST