బోగస్‌ చలానాల కేసు నత్తనడక

Sep 28 2021 @ 01:02AM
ఒంగోలులోని సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయం

వెలుగులోకి మరో రూ.8లక్షల వ్యవహారం

గుట్టుచప్పుడు కాకుండా సర్దుబాటు  

వచ్చే వారంలో ప్రత్యేక బృందాల తనిఖీలు

ఒంగోలు(క్రైం) సెప్టెంబరు 27 : బోగస్‌ చలానాల కుంభకోణం కేసు అడుగు ముందుకు పడటం లేదు. అయితే తవ్వేకొద్దీ పుట్టలుపుట్టలుగా అక్రమాలు బయట పడుతున్నాయి. ఒంగోలులోని సబ్‌రిజిస్ర్టార్‌ కార్యాలయంలో వెలుగుచూసిన బోగస్‌ చలానాల వ్యవహారం రూ.35లక్షలకు చేరింది. తొలుత రూ.27లక్షల బోగస్‌లు వెలుగు చూసినప్పడు రిజిస్ర్టేషన్‌ శాఖ అధికారులు అప్రమత్తమై ఒంగోలు వన్‌టౌన్‌ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అక్కడ స్టాంపురైటర్‌, గతంలో సబ్‌రిజిస్ర్టార్‌ కార్యాలయంలో కంప్యూటర్‌ ఆపరేటర్‌గా పనిచేసిన వ్యక్తిని బాధ్యుడిని చేసి నకిలీ చలానాల సృష్టికర్త అతనే అని ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే తాజాగా మరో రూ.8లక్షల బోగస్‌ చలానాలు బయిటపడ్డాయి. ఈ మొతాన్ని గుట్టుచప్పుడు కాకుండా అధికారులు సర్దుబాటు చేశారు. పైకి మాత్రం ప్రభుత్వానికి చెల్లించాల్సిన మొత్తం చెల్లించారు.. అంటూ సమర్ధింపు ధోరణిలో చెబుతున్నారు. ప్రభుత్వ కార్యాలయంలో రూ.35లక్షల కుంభకోణం జరిగితే ఇంతవరకు ఆ కేసులో పురోగతి లేదు. నిందితుడిగా ఉన్న పవన్‌కుమార్‌ కోసం గాలింపు చర్యలు చేపట్టలేదు. అదేక్రమంలో తాజాగా మరో వ్యవహారం బయటపడటం గమనార్హం. అయితే ఈ నగదు ఎవరు సర్దుబాటు చేశారు, అసలు ఇలాంటి కేసులో అడుగు ముందుకు పడకపోవడానికి కారణం ఏమిటి?, పోలీసులు ఎందుకు మీనమేషాలు లెక్కిస్తున్నారు అనేది అర్థం కాని విషయం. అయితే ఒక్కరోజు మాత్రమే ఒంగోలు వన్‌టౌన్‌ సీఐ దర్యాప్తు పేరుతో రిజిస్ర్టార్‌ ఆఫీసుకు వెళ్ళి వచ్చారు అంతే. దీనిపై పోలీసు ఉన్నతాధికారులు సైతం దృష్టిసారించిన దాఖలాలు లేవు.


నగదు ఎవరు చెల్లించారు?

తాజాగా దస్తావేజుల పరిశీలనలో మరో రూ.8లక్షల బాగోతం బయటపడగా అందుకు సంబంధించి నగదు చెల్లించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నకిలీ చలనాల కేసులో నిందితుడైన పవన్‌కుమార్‌ పరారీలో ఉంటే.. ఈ నగదు ఎవరు చెల్లించారనేది తెలియడం లేదు. అక్కడ పనిచేసే అధికారులు నగదు చెల్లించి, పవన్‌కుమార్‌ తండ్రి వద్ద వసూలు చేశామని చెబుతుండటం చర్చనీయాంశమైంది.  బోగస్‌ చలానాల కుంభకోణంలో మొత్తం 101 దస్తావేజులకు సంబంధించి 108 నకిలీ చలనాల్లో రూ.34,29,295ను మోసం చేసినట్లు తేల్చారు. 


వచ్చే వారంలో ప్రత్యేక తనిఖీలు

బోగస్‌ చలానాల కుంభకోణం రాష్ట్రవ్యాప్తంగా రిజిస్ట్రేషన్‌ శాఖను కుదిపేసింది. దీంతో కార్యాలయాలను స్వయంగా పరిశీలించడంతోపాటు అక్కడ ఉన్న లోటుపాట్లు తెలుసుకునేందుకు అధికారులు రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో పర్యటిస్తున్నారు. అందులో భాగంగా వచ్చేవారంలో జిల్లాలో తనిఖీలు ఉంటాయని తెలుస్తోంది. స్టాంపులు, రిజిస్ట్రేషన్‌ శాఖ కమిషనర్‌తోపాటుగా 30మంది అధికారులు జిల్లాలోని అన్ని సబ్‌రిజిస్ర్టార్‌ కార్యాలయాలను తనిఖీ చేయనున్నారు. 

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.