Chinese Visa Case : నాపై అన్నీ బోగస్ కేసులే : కార్తి చిదంబరం

ABN , First Publish Date - 2022-05-26T15:46:57+05:30 IST

కాంగ్రెస్ ఎంపీ కార్తి చిదంబరం గురువారం కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI) ప్రధాన

Chinese Visa Case : నాపై అన్నీ బోగస్ కేసులే : కార్తి చిదంబరం

న్యూఢిల్లీ : కాంగ్రెస్ ఎంపీ కార్తి చిదంబరం గురువారం కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI) ప్రధాన కార్యాలయంలో అధికారుల సమక్షంలో హాజరయ్యారు. 263 మంది చైనీయులకు అక్రమంగా వీసాలు మంజూరవడానికి సహాయపడినట్లు నమోదైన ఆరోపణలపై ఆయనను అధికారులు ప్రశ్నిస్తారు. 


CBI కార్యాలయానికి చేరుకున్న తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ, తనపై నమోదైన ఆరోపణలన్నీ బూటకమేనని చెప్పారు. తాను కనీసం ఒక చైనా జాతీయునికైనా వీసా ఇప్పించలేదన్నారు. 


కార్తి చిదంబరం (Karti Chidambaram) సన్నిహితుడు ఎస్ భాస్కర రామన్‌ను ఈ కేసులో CBI మే 17న అరెస్టు చేసింది. ఈ కేసులో మొత్తంమీద నలుగురిని అరెస్టు చేసింది. కార్తి చిదంబరం బెయిలు షరతుల ప్రకారం ఆయన భారత దేశానికి చేరుకున్న 16 గంటల్లోగా సీబీఐ సమక్షంలో హాజరుకావలసి ఉంది. 


ఓ సీబీఐ అధికారి మాట్లాడుతూ, కార్తి చిదంబరానికి తాము సమన్లు జారీ చేయలేదన్నారు. భారత దేశానికి చేరుకున్న 16 గంటల్లోగా సీబీఐ సమక్షంలో హాజరుకావాలని కోర్టు ఆదేశించిందని చెప్పారు. 


కార్తిపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) కూడా కేసు నమోదు చేసింది. చైనీస్ వీసా కుంభకోణంలో మనీలాండరింగ్ జరిగినట్లు ఆరోపించింది. పంజాబ్‌లో ఓ విద్యుత్తు ప్రాజెక్టుకు సంబంధించిన, చైనాకు చెందిన 263 మందికి అక్రమంగా వీసాలు ఇప్పించేందుకు కార్తి రూ.50 లక్షలు స్వీకరించినట్లు సీబీఐ ఆరోపించింది. కేంద్ర హోం మంత్రిగా పి చిదంబరం పని చేసిన కాలంలో 2011లో ఈ కుంభకోణం జరిగినట్లు ఆరోపించింది. అయితే పి చిదంబరాన్ని నిందితునిగా చేర్చలేదు. 


Updated Date - 2022-05-26T15:46:57+05:30 IST