కేంద్రం అడిగింది కొన్నే..ఇంకా చాలానే ఉన్నాయ్‌!

Aug 3 2021 @ 03:23AM

  • కాగ్‌తో విచారణ జరిపితే బయటికొస్తాయ్‌
  • గవర్నర్‌కు ఫిర్యాదుచేసినా కార్యాలయం పట్టించుకోలేదు: పయ్యావుల 


అమరావతి, ఆగస్టు 2 (ఆంధ్రజ్యోతి): అప్పులకు సంబంధించి జగన్‌ ప్రభుత్వం పాల్పడిన రాజ్యాంగ అతిక్రమణలపై కేంద్రం అడిగిన విషయాలు కొన్నేనని, ఇటువంటివి ఇంకా చాలా ఉన్నాయని ప్రజా పద్దుల కమిటీ (పీఏసీ) చైర్మన్‌, టీడీపీ సీనియర్‌ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ వ్యాఖ్యానించారు. ‘రాష్ట్రాభివృద్ధి కార్పొరేషన్‌ పేరుతో రూ.25 వేల కోట్ల రుణం తీసుకోవడానికి బ్యాంకులతో కుదుర్చుకున్న ఒప్పందాలు రాజ్యాంగ నిబంధనలను అతిక్రమిస్తున్నాయని కేంద్రం అభిప్రాయపడింది. ఉల్లంఘనలకు ప్రాథమిక సాక్ష్యాధారాలు కూడా ఉన్నాయని తేల్చింది. దీనిపై కాగ్‌తో విచారణకు కేంద్రం ఆదేశిస్తే ఇంకా చాలా బయటకు వస్తాయి. ఒప్పందాలు కుదుర్చుకున్న జాతీయ బ్యాంకులపై కూడా కేంద్రం విచారణ జరిపించాలి’ అని డిమాండ్‌ చేశారు. ఆయన సోమవారమిక్కడ విలేకరులతో మాట్లాడారు.  ‘రూ.41 వేల కోట్ల చెల్లింపులకు సంబంధించి సరైన వివరాలు లేవని స్వయంగా కాగ్‌ చెప్పింది. రూ.17 వేల కోట్లు అర్హతకు మించి అప్పులు తీసుకున్నారని కేంద్రం తేల్చింది. 


అప్పుల కోసం రాజ్యాంగ మౌలిక సూత్రాలను ఉల్లంఘించి చట్టాలు చేయడాన్ని ప్రశ్నించింది. ప్రభుత్వానికి వచ్చే ఆదాయం నేరుగా బ్యాంకులకు వెళ్లేలా ఎస్ర్కో ఖాతాలు తెరిచి అప్పులు తీసుకున్నారు. ఈ విషయం తెలియక బ్యాంకులు ఒప్పందాలు చేసుకుని అప్పులు ఇచ్చాయి. పాత చట్టం ప్రకారం బ్యాంకులు చేసుకున్న ఒప్పందాలు, వాటి ప్రకారం ఇచ్చిన అప్పులు చెల్లుబాటవుతాయా? తాము కుదుర్చుకున్న ఒప్పందాలు చట్టబద్ధంగా ఉన్నాయో లేదో చూసుకునే బాధ్యత బ్యాంకులకు లేదా? కేంద్రం విచారణ ప్రారంభిస్తే అవి కూడా సమాధానం ఇవ్వాల్సి వస్తుంది. ఇచ్చిన జీవోలకు, బ్యాంకులతో చేసుకున్న ఒప్పందాలకు మధ్య వ్యత్యాసాలున్నాయి. ఎవరు ఎవరిని మోసం చేశారో.. ఎవరెవరు ఇందులో భాగస్వాములయ్యారో తేలాలి. రుణాల విషయంలో గవర్నర్‌ కార్యాలయాన్ని కూడా ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తోంది. అది చేసిన చట్టం తన కార్యాలయానికి వచ్చినప్పుడు గవర్నర్‌ తన సిబ్బందితో అధ్యయనం చేయించారా? ఆ పని చేయకుండానే ఆమోదించడం సరైందేనా? ప్రభుత్వం ఏది పంపితే అది ఆమోదిస్తారా? రాష్ట్రాన్ని, వ్యవస్థలను కుప్పకూల్చేలా వ్యవహరిస్తుంటే గవర్నర్‌ కార్యాలయం పట్టించుకోదా’ అని ప్రశ్నించారు. తాము గవర్నర్‌కు ఫిర్యాదు చేసినా ప్రభుత్వాన్ని వివరణ కోరలేదని, కానీ పత్రికల్లో వచ్చిన కథనాలతో నేరుగా కేంద్రమే స్పందించిందన్నారు. ఇక్కడి ఆర్థిక వ్యవహారాలపై కేంద్రానికి ఫిర్యాదు చేస్తామన్న బీజేపీ నేతలు.. ఎవరిపై ప్రేమతో ఆగిపోయారో వారికే తెలియాలని వ్యాఖ్యానించారు.

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.