కేంద్రం ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందో శ్వేత పత్రం విడుదల చేయాలి

ABN , First Publish Date - 2022-01-22T06:51:51+05:30 IST

యువతకు ఏటా రెండు కోట్ల ఉద్యోగాలిస్తామంటూ ఢిల్లీలో గద్దెనెక్కిన కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందో శ్వేతపత్రం విడుదల చేయాలని రోడ్డు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు.

కేంద్రం ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందో శ్వేత పత్రం విడుదల చేయాలి

మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి

కమ్మర్‌పల్లి, జనవరి 21: యువతకు ఏటా రెండు కోట్ల ఉద్యోగాలిస్తామంటూ ఢిల్లీలో గద్దెనెక్కిన కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందో శ్వేతపత్రం విడుదల చేయాలని రోడ్డు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. మండల కేంద్రంలో రూ.2కోట్ల 50లక్షలతో నిర్మించిన మినీ స్టేడియాన్ని శుక్రవారం ప్రారభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాలకు సముచిత స్థానం కల్పిస్తూ అభివృద్ధిని చేస్తుంటే బీజేపీ నాయకులు అసత్య ప్రచారాలు చేస్తూ ప్రజలను తప్పుతోవ పట్టిస్తున్నారని విమర్శించారు. యువతకు ఉద్యోగావకాశాలు కల్పించ డంలో రాష్ట్ర ప్రభుత్వం ముందుందన్నారు. లక్షా 32 వేల ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ నుంచి 40వేల ఉద్యోగాలు ఇచ్చారని గుర్తుచేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో యూపీలో 19వేలు, బీహార్‌లో 8.950, కర్ణాటకలో 14.893, మహారాష్ట్రలో 8వేల పబ్లిక్‌ కమిషన్‌ ఉద్యోగాలు మాత్రమే కల్పించాలరని ఈ విషయాన్ని యువత గ్రహించాలన్నారు. ఒకవేళ నేను చెప్పింది అబద్ధమైతే తన పదవికి రాజీనామా చేస్తానని లేదంటే మీరు రాజీనామా చేస్తారా అని బీజేపీ నాయకులను ప్రశ్నించారు. టీఎస్‌ఐ పాస్‌ ద్వారా ఏడేళ్లలో కొత్తగా 17వేల  పరిశ్రమలు వచ్చాయని వీటిద్వారా 13లక్షల ప్రైవేటు ఉద్యోగాలు వచ్చాయన్నారు. ఐటీ ఎగుమతులు 50కోట్ల నుంచి లక్షా 40వేలకు పెరిగిందని, మూడు లక్షల ఉద్యోగాలు వచ్చాయన్నారు. 

అంతర్జాతీయ క్రీడాకారులుగా ఎదగాలి..

శారీకదారుఢ్యాన్ని, మానసిక ఉల్లాసాన్ని పెంపొందించే క్రీడల పట్ల యువత ఆసక్తి కనబరుస్తూ జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులుగా రాణించాలని మంత్రి సూచించారు. ప్రస్తుతం అన్ని హంగులతో స్టేడియం నిర్మాణం పూర్తయిందని అరకొరగా మిగిలిన పనులను త్వరలోనే పూర్తిచేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గౌతమి, జడ్పిటీసీ రాధరాజాగౌడ్‌, మండల పార్టీ అద్యక్షుడు రేగుంట దేవేందర్‌, ఏఎంసీ చైర్మన్‌ ప్రకాశ్‌ నాయక్‌, రైతుబందు అద్యక్షుడు బద్దం రాజేశ్వర్‌ సర్పంచ్‌ గడ్డం స్వామి, ఎంపీటీసీ మైలారం సుధాకర్‌, బద్దం చిన్నారెడ్డి, భాస్కర్‌ యాదవ్‌, లుక్కగంగాధర్‌, అజ్మత్‌ హుసేన్‌ వివి గ్రామాల సర్పంచ్‌లు ఎంపీటీసీలు, నాయకులు, ప్రజాప్రతినిదులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-22T06:51:51+05:30 IST