సన్నాల రైతులకు మద్దతు దక్కేనా?

ABN , First Publish Date - 2020-10-27T11:33:41+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం నియంత్రిత సాగు విధానాన్ని ప్రకటించి ఈ ఏడాది 60శాతం సన్న, 40శాతం దొడ్డురకం వరి సాగు చేయాలని సూచించింది.

సన్నాల రైతులకు మద్దతు దక్కేనా?

ప్రభుత్వ నియంత్రిత సాగు విధానంతో పెరిగిన సాగు

ఉమ్మడి జిల్లాలో 5లక్షల ఎకరాల్లో వరి

మద్దతు ధర ప్రకటించని కేంద్రప్రభుత్వం

దొడ్డు రకం కొనుగోలుకే సర్కారు సన్నాహాలు

సన్నాలకు రూ.200కుపైగా బోనస్‌ ఇవ్వాలంటున్న రైతులు


మోత్కూరు, అక్టోబరు 26: రాష్ట్ర ప్రభుత్వం నియంత్రిత సాగు విధానాన్ని ప్రకటించి ఈ ఏడాది 60శాతం సన్న, 40శాతం దొడ్డురకం వరి సాగు చేయాలని సూచించింది. దీంతో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సన్నాల సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. నవంబరు మొదటి వారం నుంచి వరి కోతలు ప్రారంభంకానున్నాయి. ఇప్పటికే కేంద్రప్రభుత్వం ధాన్యానికి మద్దతు ధరలు ప్రకటించగా, అందులో సన్నరకం లేదు. సన్నాల సాగును ప్రోత్సహించిన రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు ధరపై స్పష్టత ఇవ్వలేదు. కేంద్రం నిబంధనల ప్రకారం సన్నాలు సైతం సాధారణ రకం కిందికి వస్తాయి. సన్నాల సాగు ఖర్చు, దిగుబడి కాలపరిమితి ఎక్కువ. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ ధాన్యానికి రూ.200కుపైగా బోనస్‌ ఇవ్వాలని రైతులు కోరుతున్నారు.


సన్న బియ్యానికి డిమాండ్‌ ఎక్కువ

ఉన్నత, మధ్య తరగతి కుటుంబాలకు సన్న అన్నం లేనిదే ముద్ద దిగదు. విద్యార్థులు దొడ్డు బియ్యం తినలేకపోతున్నారని పాఠశాలలు, హాస్టళ్లకు రాష్ట్ర ప్రభుత్వం సన్నబియ్యం సరఫరా చేస్తోంది. కాగా, అంగన్‌వాడీలు, రేషన్‌ దుకాణాలకు సైతం సన్న బియ్యం ఇవ్వాలన్న డిమాండ్‌ చాలా కాలంగా ఉంది. ఈ ఏడాది సన్నాల సాగును ప్రోత్సహించిన సీఎం కేసీఆర్‌, రేషన్‌ దుకాణాల్లోనూ పేదలకు సన్నబియ్యం ఇస్తామని ప్రకటించారు. అంతటి ప్రాధాన్యం ఉన్న సన్నరకాలను రైతులు సాగు చేస్తే, వారికి గిట్టుబాటు ధర అందడం లేదు.


పంట కాలం, ఖర్చు ఎక్కువ

దొడ్డు రకం వరి నాలుగు మాసాలకే చేతికి వస్తుంది. బీపీటీ, ఇతర సన్న రకాలు మాత్రం ఐదు మాసాల తరువాత దిగుబడి వస్తుంది. అంతేగాక సన్నాలకు చీడపీడల బాధ ఎక్కువ. దోమకాటు, గొట్టం రోగం ఎక్కువగా వస్తుంది. దొడ్డు రకాలతో పోలిస్తే సన్నాలకు అదనంగా రెండుమార్లు క్రిమిసంహారక మందు పిచికారీ చేయాల్సి వస్తుంది. దొడ్డు రకాలకు ఎకరాకు రూ.25,950 ఖర్చు వస్తుండగా, సన్నాలకు రూ.29,950వరకు వ్యయం అవుతుంది. అదనంగా రూ.4వేలు ఖర్చు. దొడ్డు రకం ఎకరాకు 40 బస్తాల దిగుబడి వస్తే, సన్నాలు 30 బస్తాలే వస్తాయి. దొడ్డు రకం వరి గడ్డిని పశువులు ఇష్టంగా తింటాయి. సన్నాల గడ్డిని ఎక్కువగా తినవు. దీంతో పాడి రైతులు దొడ్డురకం వరి గడ్డినే కొనుగోలు చేస్తారు. దొడ్డు రకం కంటే బహిరంగ మార్కెట్లో సన్న ధాన్యానికి ధర ఎక్కువగా ఉండేది. ప్రస్తుతం పరిస్థితి అలా లేదు. దొడ్డు ధాన్యాన్ని ప్రభుత్వం మద్దతు ధరతో కొనుగోలు చేస్తుండగా, వ్యాపారులు సన్నాలకు ధర తగ్గించి, బియ్యంగా మార్చి ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారు. దీంతో రైతులకు లాభం లేకపోగా, వ్యాపారులు మాత్రం ఆదాయం పొందుతున్నారు.


సన్నాలకు మద్దతు ధర ప్రకటించని ప్రభుత్వం

దొడ్డు రకానికి కేంద్ర ప్రభుత్వం ఏటా మద్దతు ధర ప్రకటిస్తూ సన్నాలను మాత్రం పట్టించుకోవడం లేదు. దీంతో ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వం క్వింటాకు రూ.200 బోనస్‌ ఇచ్చి కొనుగోలు చేసే ది. వ్యాపారులు ధర తగ్గిస్తే రైతులు ప్రభుత్వానికి విక్రయించేవారు. అటు కేంద్రం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.


5లక్షల ఎకరాల్లో సాగు

ఉమ్మడి జిల్లాలో వానాకాలం సీజన్‌లో సుమారు 5లక్షల ఎకరాల్లో సన్నరకం వరి సాగైంది. ప్రభుత్వం ధాన్యం కొనుగోలుకు ఉమ్మడి జిల్లాలో 482 కేంద్రాల ఏర్పాటుకు కసరత్తు చేస్తోంది. దొడ్డు రకం ఏ-గ్రేడ్‌ ధాన్యానికి ప్రభుత్వ మద్దతు ధర క్వింటాకు రూ.1888, సాధారణ రకానికి రూ.1868గా ప్రకటించింది. ఈ కేంద్రాల్లోనే సన్న రకం ధాన్యాన్ని కొనుగోలు చేయనున్నారు. సన్నాలకు క్వింటా రూ.2500 మద్దతు ధర ప్రకటించాలని, లేదంటే క్వింటాలకు రూ.200కు పైగా బోనస్‌ ఇవ్వాలని రైతులు కోరుతున్నారు.


పెట్టుబడి కూడా వచ్చేలా లేదు

రెండు ఎకరాల్లో సన్నవరి సాగు చేశా. ఎకరాకు రూ.30వేల వరకు పెట్టుబడిపెట్టా. ఇటీవల కురిసిన వర్షాలతో వరి నేలవాలింది. రోగం తగిలి గింజలపై పసుపురంగు బొడిపెలు వస్తున్నాయి. క్రిమిసంహారక మందు పిచికారీ చేసినా తగ్గలేదు. దీంతో ఎకరాకు 25 బస్తాల దిగుబడి కూడా వచ్చేలా లేదు. సన్న ధాన్యానికి ఎక్కువ ధర ఇవ్వకుంటే పెట్టుబడి కూడా చేతికి రాదు.

- కుమ్మరికుంట్ల దయాకర్‌రెడ్డి, రైతు, మోత్కూరు


క్వింటా రూ.2500కు కొనుగోలు చేయాలి

నాలుగు ఎకరాల్లో దొడ్డు, మరో నాలుగు ఎకరాలు కౌలుకు తీసుకుని సన్నవరి సాగు చేశా. సన్న వరి సాగుకు ఎకరాకు సుమారు రూ.4వేల వరకు పెట్టుబడి అయింది. దొడ్డు రకాలకంటే దిగుబడి సుమారు పది బస్తాలు తక్కువ వస్తుంది. పంట కాల పరిమితి కూడా నెల రోజులు ఎక్కువ. సన్నరకాల గడ్డిని పశువులు ఎక్కువగా తినవు. ప్రభుత్వం క్వింటా రూ.2500కు కొనుగోలు చేస్తేనే మాకు గిట్టుబాటు అవుతుంది.        - బొమ్మగాని లక్ష్మయ్య, రైతు, లక్ష్మీదేవికాల్వ

Updated Date - 2020-10-27T11:33:41+05:30 IST