అమ్మ కోరిన మార్పు

ABN , First Publish Date - 2020-09-18T05:30:00+05:30 IST

మనిషికి తొలి గురువు తల్లి. బిడ్డలకు అమ్మే మార్గదర్శి...

అమ్మ కోరిన మార్పు

మనిషికి తొలి గురువు తల్లి. బిడ్డలకు అమ్మే మార్గదర్శి. చెడు మార్గంలో నడుస్తున్న పిల్లలను సరైన మార్గంలో పెట్టవలసిన బాధ్యత తల్లులదే అని చెప్పే కథ ఇది.


ఒక ఊర్లో సర్వానంద్‌ అనే వ్యక్తి ఉండేవాడు. అతను సర్వ శాస్త్రాలనూ అధ్యయనం చేసిన గొప్ప పండితుడు. పాండిత్యం అతనిలో అహంకారాన్ని పెంచింది. శాస్త్ర చర్చలకు రావాలంటూ అందరికీ అతను సవాల్‌ విసిరేవాడు. చర్చల్లో ఎందరినో ఓడించాడు. తన పేరును ‘సర్వజిత్‌’గా మార్చుకున్నాడు. అతని తల్లి ఇదంతా గమనిస్తూనే ఉంది. కొడుకు వక్రమార్గంలో ఉన్నాడని బాధపడింది. ఏం చేయాలని ఆలోచించింది. ఆమె భక్తురాలు. కబీర్‌దాసు శిష్యురాలు. కబీర్‌ గొప్పతనం ఆమెకు బాగా తెలుసు. ఒక రోజు ఆమె తన కుమారుడితో ‘‘నీవు కబీర్‌ను శాస్త్ర చర్చలో ఓడించినప్పుడు మాత్రమే నువ్వు ‘సర్వజిత్‌’వు అని నేను అంగీకరిస్తాను’’ అంది. ఆమె మాటలు సర్వజిత్‌కు ములుకుల్లా గుచ్చుకున్నాయి. తాను చదివిన గ్రంథాలన్నిటినీ మూటకట్టి, ఒక ఎద్దు మీద వేసుకొని, కబీర్‌దాస్‌ నివసిస్తున్న వారణాసికి చేరాడు. సరాసరి కబీర్‌ ఇంటి ముందుకు వెళ్ళి నిలబడి, ‘‘కబీర్‌, కబీర్‌’’ అని పిలిచాడు.


కబీర్‌ కుమార్తె కమాలి బయటకు వచ్చింది, ఎద్దు మీద ఉన్న గ్రంథాల మూటనూ, దానితోపాటు నిలుచున్న సర్వజిత్‌నూ చూసి నవ్వుతూ విషయం తెలుసుకుంది. ‘‘కబీర్‌ ఉండే చోటు ఆ శిఖరం మీద ఉంది. అక్కడకు పోయే మార్గం జారుడుగా ఉంటుంది. దానిమీద చీమ కాళ్ళు కూడా నిలబడవు. తమరేమో గ్రంథాల మోపును మోసే ఎద్దుతో అక్కడికి చేరాలని వచ్చారు’’ అంది. ఆ మాటలు విని సర్వజిత్‌ కొంత నిశ్చేష్టుడయ్యాడు. ఆమె మాటల్లోని అంతరార్థం అతనికి అంతరంగంలో తెలిసివస్తోంది. అంతలోనే కబీర్‌దాస్‌ అక్కడకు వచ్చాడు. సర్వజిత్‌ సవాల్‌ విని ‘‘నేను చదువురాని ఒక సామాన్యమైన నేత పనివాడిని. మీరేమో మహా పండితులు. ఇన్ని గ్రంథాలను నా జీవితంలో చూడను కూడా లేదు. మీరు వాటన్నిటినీ కూలంకషంగా అధ్యయనం చేశారు. సోదరా! శాస్త్ర చర్చలో నేను మీతో గెలవలేను గాక గెలవలేను. నా ఓటమిని ఇప్పుడే అంగీకరిస్తున్నాను’’ అన్నాడు. 


అయితే ఓటమిని ఒప్పుకున్నట్టు రాసి, సంతకం చేసి ఇమ్మన్నాడు సర్వజిత్‌. తనకు చదువు రాదన్నాడు కబీర్‌. ఆ మేరకు సర్వజిత్‌ రాస్తే కబీర్‌ సంతకం చేసి ఇచ్చాడు. సర్వజిత్‌ విజయగర్వంతో ఇంటికి తిరిగి వచ్చాడు.  ‘‘అమ్మా! ఇదిగో కబీర్‌దాసు ఓటమిని అంగీకరించాడు’’ అంటూ ఆ చీటీని తల్లికి చూపించాడు.  దాన్ని చూసి సర్వజిత్‌ తల్లి నవ్వింది. ఆమె ఎందుకు నవ్వుతోందో అర్థం కాక ఆ చీటీని తన చేతిలోకి తీసుకొని చూశాడు. ఆశ్చర్యం! ‘సర్వజిత్‌ కబీర్‌ను ఓడించాడు’ అని తానే రాసి, కబీర్‌తో సంతకం చేయించుకున్న ఆ చీటీలో ఇప్పుడు ‘కబీర్‌ సర్వజిత్‌ను ఓడించాడు’ అని ఉంది. మళ్ళీ కబీర్‌ దగ్గరకు వెళ్ళి, మరొక కాగితంపై జాగ్రత్తగా ‘సర్వజిత్‌ కబీర్‌ను ఓడించాడు’ అని రాసి, కబీర్‌తో సంతకం చేయించుకున్నాడు. ‘ఎక్కడా, ఏ పొరపాటూ లేదు కదా!’ అని జాగ్రత్తగా గమనించి, దాన్ని ఇంటికి తెచ్చి తల్లికి చూపించాడు. ఈసారి కూడా ‘కబీర్‌ సర్వజిత్‌ను ఓడించాడు’ అనే అందులో ఉంది. సర్వజిత్‌ మూడోసారి ప్రయత్నించాడు. అప్పుడూ అలాగే జరిగింది. ‘‘ఈ కబీర్‌ గొప్ప గారడీవాడిలా ఉన్నాడు’’ అన్నాడు తన తల్లితో. అప్పుడామె ‘‘నాయనా! కబీర్‌దాస్‌ ఒక మహాత్ముడు. నీవు వారి ఉపదేశం పొందు. ఆయన ఔన్నత్యం, నీ గ్రంథ పాండిత్య అల్పత్వం క్రమంగా తెలుస్తుంది’’ అని నచ్చచెప్పింది. 


సర్వజిత్‌ ఒట్టి చేతులతో వెళ్ళి కబీర్‌దాస్‌ను కలిసాడు. అతను పక్కన పడేసింది గ్రంథాల మూటనే కాదు, అజ్ఞానాన్నీ, అహంకారాన్నీ కూడా! కబీర్‌దాస్‌ సాంగత్యంలో కొన్నిరోజులు గడిపిన సర్వజిత్‌ వెలుగుతున్న ముఖంతో, పొంగుతున్న నమ్రతతో ఇంటికి తిరిగి వచ్చాడు.  ‘‘అమ్మా! కబీర్‌దాస్‌ నిజంగానే గొప్పవారు. నేను వారి పాదాలకు మొక్కి, నా ఓటమిని అంగీకరించాను. ఆయన ఎంతో దయతో నన్ను శిష్యునిగా చేసుకున్నారు’’ అని కన్నీరు కారుస్తూ చెప్పాడు తల్లితో. తన కుమారుడిలో కలిగిన మార్పును చూసి ఆమె సంతోషించింది.

- రాచమడుగు శ్రీనివాసులు 


Updated Date - 2020-09-18T05:30:00+05:30 IST