పాత్రలే ముఖ్యం.. వేదిక కాదు...

Published: Thu, 23 Jun 2022 02:46:53 ISTfb-iconwhatsapp-icontwitter-icon
పాత్రలే ముఖ్యం.. వేదిక కాదు...

నటనలో దిట్ట. బడి రోజుల్లోనే నాటకాల్లో నటించింది.

చిన్న వయసులోనే సినీ కెరీర్‌ మొదలైంది. 

కొద్ది చిత్రాలతోనే మంచి నటిగా పేరు తెచ్చుకుంది.

తమిళ తెరపై తళుకులీనుతున్న తెలుగు అమ్మాయి నివేదితా సతీష్‌.

ఒక వెబ్‌సిరీస్‌ ద్వారా తొలిసారి తెలుగులో నటిస్తున్న 

నివేదిత ఎన్నో సంగతులను ‘నవ్య’తో పంచుకుంది... 


‘‘ఒక రకంగా నేను పాత తరం ట్రెండ్‌ను ఫాలో అవుతున్నానేమో అనిపిస్తుంది. ఎందుకంటే సినీ పరిశ్రమలోకి వచ్చే ముందు ఎన్నో నాటక ప్రదర్శనలు ఇచ్చాను. వాటికి లభించిన గుర్తింపువల్లే సినిమాల్లో అవకాశం వచ్చింది. ఆ అనుభవం ఒక మంచి నటిగా ఎదగడానికి ఇప్పుడు ఎంతో దోహదపడుతోంది. నేను తెలుగు అమ్మాయినే. మాది గుంటూరు. కాకపోతే పుట్టింది పెరిగింది చెన్నైలో. మా నాన్న సతీ్‌షకుమార్‌ రేసింగ్‌ కార్లు తయారు చేస్తారు. ఆయన ఆటోమొబైల్‌ ఇంజనీర్‌. అదే బిజినె్‌సలో ఉన్నారు. రేసుల్లో కూడా పాల్గొన్నారు. పన్నెండుసార్లు జాతీయ చాంపియన్‌షిప్‌ సాధించారు. మా తమ్ముడు విజయ్‌ ఆదిత్య కూడా ఆటోమొబైల్‌ ఇంజనీరింగ్‌ చేస్తున్నాడు. వాడూ రేస్‌లకు వెళతాడు. మా తాతగారి వారసత్వమే వాళ్లు తీసుకున్నారు. నాకైతే రేసింగ్‌ కార్లు నడిపించడం వచ్చు కానీ... రేస్‌ల్లో మాత్రం పాల్గొనలేదు. కానీ రేస్‌ ట్రాక్‌లకు మిస్‌ కాకుండా వెళుతుంటా.  


నేనొక్కదాన్నే..

ఇంట్లో వాళ్లందరికీ భిన్నం నేను. రేస్‌లు, ఆటోమొబైల్‌ బిజినెస్‌ కాదని ఇలా సినిమాల వైపు వచ్చాను. ఎందుకో నాకు చిన్నప్పటి నుంచి నటిని కావాలనే కోరిక బలంగా ఉండేది. దాని కోసమే ఇంటర్‌ తరువాత విజువల్‌ కమ్యూనికేషన్‌లో డిగ్రీ చదివాను. సినిమాకు సంబంధించి కొంత నేర్చుకోవాలనుకున్నాను. దాంతోపాటు  సినిమాటోగ్రాఫ్‌, ఫిలిమ్‌ మేకింగ్‌పై ఆసక్తితో ఆ కోర్సు చేశాను. స్కూల్లో ఉండగా ప్రతి సాస్కృతిక కార్యక్రమంలో పాల్గొనేదాన్ని. స్కూల్‌ సెక్రటరీగా ఉన్నాను. కథక్‌ వంటి సంప్రదాయ నృత్యాలు నేర్చుకున్నాను. చాలా నాటకాల్లో కీలక పాత్రలు పోషించాను. ఇలా ఎన్నో! మా ఇంట్లో నటన వైపు వచ్చింది నేనొక్కదాన్నే!  


సినిమాతో మొదలు... 

డిగ్రీలో చేరగానే నాకు సినిమా ఆఫర్‌ వచ్చింది. ‘మగిలిర్‌ మట్టుమ్‌’లో జ్యోతికతో కలిసి చేశాను. 2017లో విడుదలైంది. అది నా మొదటి చిత్రం. రెండో సినిమా ‘సిల్లు కారుపట్టి’. పెద్ద హిట్‌. నాకు మంచి పేరు, క్రేజ్‌ వచ్చాయి. తెలుగులో ‘ఆరెంజ్‌ మిఠాయి’గా దాన్ని విడుదల చేశారు. తరువాత మరో నాలుగైదు తమిళ సినిమాల్లో నటించాను. దాంతోపాటు వెబ్‌సిరీ్‌సలు కూడా చేస్తున్నాను. నెట్‌ఫ్లిక్స్‌లో ‘సేతుమ్‌ ఆరియమ్‌ పోన్‌’ చిత్రానికి దేశవిదేశాల ఫిలిమ్‌ ఫెస్టివల్స్‌లో పలు అవార్డులు వచ్చాయి. ప్రస్తుతం ‘సుడల్‌’ వెబ్‌సిరీస్‌ అమెజాన్‌ ప్రైమ్‌లో వచ్చింది. నాకు తెలిసి ముప్ఫైకి పైగా ప్రపంచ భాషల్లో విడుదలైన ఏకైక భారతీయ వెబ్‌సిరీస్‌ అది. అందులో నేను చేసిన ‘లక్ష్మి’ కేరెక్టర్‌కు విపరీతమైన ఆదరణ లభిస్తోంది. నా వీడియోలు వైరల్‌ అవుతున్నాయి. 


తెలుగులో అలా... 

ఒక తెలుగు అమ్మాయిగానే కాదు... తెలుగు సినీ పరిశ్రమపై ఉన్న ఇష్టంతో తెలుగులో చేయాలని ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నాను. ఆ నిరీక్షణ ఇన్ని రోజులకు ఫలించింది... ‘ఆహా’ ఓటీటీలో ప్రసారం కానున్న ‘అన్యాస్‌ ట్యుటోరియల్‌’లో చేస్తున్నాను. అది కూడా ‘ఆర్కా మీడియా’ వంటి పెద్ద సంస్థ ద్వారా తెలుగులో లాంచ్‌ అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నా తమిళ సినిమాలు, వెబ్‌సిరీ్‌సలు చూసి సినిమాటోగ్రాఫర్‌ విజయ్‌ గారు ‘ఇందులో నువ్వే చేయాలి’ అని అడిగారు. భిన్నమైన కథ, నటనకు ఆస్కారమున్న పాత్ర. అందుకే వెంటనే ఓకే చేసేశాను. ‘అన్య’గా ఇందులో నాది లీడ్‌ రోల్‌. ఒక ఇరవై నాలుగేళ్ల అమ్మాయి ఇంట్లో నుంచి బయటకు వచ్చేస్తే ఏంజరుగుతుంది అనేది కథ. థ్రిల్‌, హారర్‌, డ్రామా... అన్నీ ఉన్నాయి ఇందులో. నా సోదరిగా రెజీనా గారు నటిస్తున్నారు. ఎప్పుడూ నా డబ్బింగ్‌ నేనే చెప్పుకోవడం అలవాటు. ఇందులో కూడా చెప్పాను. ఇటీవల ఈ వెబ్‌సిరీస్‌ ట్రైలర్‌ విడుదల సందర్భంగా రాజమౌళి గారు నన్ను, మా టీమ్‌ను అభినందించారు. ఇది నాకు కొత్త ఉత్సాహాన్నిచ్చింది. 

పాత్రలే ముఖ్యం.. వేదిక కాదు...

అందుకే వెబ్‌సిరీ్‌సలు... 

‘వరుస సినిమా అవకాశాలు వస్తున్నప్పుడు వెబ్‌సిరీ్‌సల వైపు ఎందుకెళ్లార’ని చాలామంది అడుగుతుంటారు. పరిశ్రమలో ఇంకా రెండిటినీ వేరు వేరుగా చూస్తున్నారు. నా దృష్టిలో రెండిటికీ తేడా లేదు. ఒక నటిగా నాటకాలైనా... సినిమాలైనా... వెబ్‌సిరీ్‌సలైనా నాకు ఒక్కటే. కథ ఎలా ఉంది? అందులో నా పాత్ర ఏంటి? ఎంత కష్టపడుతున్నాను? ఎవరితో కలిసి పనిచేస్తున్నాను?... ఇవే నాకు ముఖ్యం. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు సినిమాల కంటే వెబ్‌సిరీ్‌సలకే ప్రపంచ వ్యాప్త ఆదరణ లభిస్తోంది. ముఖ్యంగా ఓటీటీలు వచ్చాక. వీటివల్ల చాలామంది ప్రతిభ గల టెక్నీషియన్లు రాగలుగుతున్నారు. నటన పరంగానే కాదు... ఉపాధి అవకాశాలూ పెరిగాయి. అన్నిటికీ మించి మంచి గుర్తింపు లభిస్తోంది. 


కనీసం మూడు చిత్రాలు... 

నాకంటూ పెద్ద లక్ష్యాలంటూ ఏమీ లేవు కానీ... కొన్ని కోరికలున్నాయి. ఏడాదికి కనీసం మూడు సినిమాలు లేదా వెబ్‌సిరీ్‌సల్లో నటించాలి. చిరకాలం నన్ను ఒక మంచి నటిగా గుర్తుపెట్టుకోవాలి. జీవించి ఉన్నంతవరకు జనం మెచ్చే పాత్రల్లో నటించాలి. హీరోయిన్స్‌ చాలామంది వస్తారు. వరుసుగా కొన్ని సినిమాలు చేస్తారు. ఉన్నట్టుండి తెర మరుగైపోతారు. అలాంటి కెరీర్‌ నాకు వద్దు. భిన్న పాత్రల్లో... భిన్న దర్శకులు, నటులతో కలిసి పని చేయాలి. ‘ఈ అమ్మాయి ఏదైనా చేయగలదు’ అనిపించుకోవాలి. అలాగే కొన్నేళ్ల తరువాత కచ్చితంగా సినిమాటోగ్రఫీ, ఫిలిమ్‌ మేకింగ్‌ చేస్తాను. ఆ సబ్జెక్టులు చదువుకున్నాను కదా! ప్రస్తుతం చేతులో కొన్ని ప్రాజెక్ట్‌లు ఉన్నాయి. మరికొన్ని ఆఫర్లు వస్తున్నాయి. వాటి వివరాలు ఇప్పుడే చెప్పలేను. 

హనుమా 


పెయింటింగ్స్‌ వేయడం, ఇంగ్లీష్‌ పోయెట్రీ రాయడం, డ్యాన్స్‌ చేయడం నా అభిరుచులు. ఇంట్లో నేను గీసిన చిత్రాలు, రాసిన కవితలు చాలానే ఉన్నాయి. సినిమాల్లోకి వచ్చాక వాటికి సమయం కేటాయించలేక పోతున్నా. 


ఆ విషయంలో అదృష్టవంతురాలిని... 

చిన్న వయసులోనే నేను పరిశ్రమలోకి వచ్చాను. అప్పుడు నాకు ఏమీ తెలియదు. అయినా ఇబ్బంది పడిన సందర్భం లేదు. నాకూ కొందరు మిత్రులు చెప్పారు... ఈ రంగంలో ఏవేవో ఉంటాయని. నా వరకు అలాంటి అసౌకర్యం కలిగించే పరిస్థితులేవీ ఎదురుకాలేదు. ఎందుకంటే నేను సరైన సమయంలో పరిశ్రమలోకి వచ్చానని అనుకొంటున్నా. ఆ విషయంలో నేను అదృష్టవంతురాలిని. నా చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరూ కళను కళగానే చూస్తున్నారు. ఇప్పుడు పరిశ్రమ కూడా మారుతోంది. ప్రధానంగా ఓటీటీ వంటి మాధ్యమాలు పెరిగాక కథను అనుసరించి నటీమణులకు కూడా మంచి పాత్రలు లభిస్తున్నాయి. ఒక నటిగా నేనూ అలాంటి పాత్రలు చేయడానికే ఇష్టపడతాను. 

నాకు బాగా ఇష్టమైంది ట్రావెలింగ్‌. అది కూడా సోలో బ్యాక్‌ప్యాక్‌ ట్రిప్స్‌ చాలా ఇష్టం. షూటింగ్‌ లేకపోతే చాలు... పర్యాటక ప్రాంతాలన్నీ చుట్టేస్తుంటాను. హిమాలయాల్లాంటి ఎన్నో ప్రాంతాలు తిరిగొచ్చాను. అదే నా బలం...

నాకు బలహీనతలంటూ ఏమీ లేవు. అన్నీ బలాలే. దానికి కారణం నేను పెరిగిన వాతావరణం. మాది ఉమ్మడి కుటుంబం. తాతయ్య, నాన్న, నానమ్మ, అమ్మ, అమ్మమ్మ, అత్తలు, మామయ్యలు... అందరి మధ్య చాలా గారాబంగా పెరిగాను. నా చదువు, నా కెరీర్‌ విషయంలో నాకు పూర్తి స్వేచ్ఛనిచ్చారు. సినిమాల్లోకి వెళాతానని చెప్పినప్పుడు కూడా ఎవరూ నిరుత్సాహపరచలేదు. సినిమా కెరీర్‌ అనేది నా కోసం నేను నిర్మించుకున్న ప్రపంచం. కెరీర్‌లో ఎదిగే క్రమంలో ఎత్తుపల్లాలు సహజమని తెలుసు. ఆత్మవిశ్వాసంతో ఒక్కో మెట్టూ ఎక్కుతూ వాటిని దాటుకొని వెళ్లడం నేర్చుకున్నా. నాలో నాకు బాగా నచ్చేది అదే... ఆత్మవిశ్వాసం. అదే నా బలం. అది లేకపోతే ఇంత దూరం రాగలిగేదాన్ని కాదు. 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.