రైతు బంధు ఆపం

ABN , First Publish Date - 2021-12-18T07:45:25+05:30 IST

యాసంగిలో వరి వేసిన రైతులకు రైతు బంధు నిలుపు చేద్దామంటూ వ్యవసాయాధికారులు చేసిన సూచనను సీఎం కేసీఆర్‌ తిరస్కరించారని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌ రెడ్డి చెప్పారు.

రైతు బంధు  ఆపం

  • వ్యవసాయాధికారుల ప్రతిపాదనను ముఖ్యమంత్రి తిరస్కరించారు
  • బీజేపీ రైతు వ్యతిరేక విధానంపై నినదిస్తాం.. నిరసిస్తాం.. నిగ్గదీస్తాం
  • ఆరుగురు మంత్రులు, ఎంపీల బృందంతో నేడు మరోసారి ఢిల్లీకి
  • ప్రధాన మంత్రి, కేంద్ర మంత్రుల అపాయింట్‌మెంట్‌ కోరాం
  • మిగిలిన ధాన్యం కొనుగోలుపై లిఖితపూర్వక హామీ ఇచ్చే వరకూ పోరు
  • ధాన్యం కొనుగోలులో రాష్ట్రానిదిసూపర్‌వైజరీ పాత్రే: నిరంజన్‌రెడ్డి


హైదరాబాద్‌, డిసెంబరు 17 (ఆంధ్రజ్యోతి): యాసంగిలో వరి వేసిన రైతులకు రైతు బంధు నిలుపు చేద్దామంటూ వ్యవసాయాధికారులు చేసిన సూచనను సీఎం కేసీఆర్‌ తిరస్కరించారని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌ రెడ్డి చెప్పారు. రైతు బంధును ఆపేది లేదంటూ శాసనసభ సాక్షిగా సీఎం కేసీఆర్‌ చేసిన ప్రకటనకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. రైతుబంధు విషయంలో అధికారుల నుంచి ఒక ప్రతిపాదన వచ్చిందని, దానిపై శాసనసభ్యులు, మండలి సభ్యులతో చర్చించామని వెల్లడించారు. తెలంగాణ ధాన్యం సేకరణ విషయంలో కమలం పార్టీ కర్కశ వైఖరిపై అటు ఢిల్లీలో ఇటు గల్లీలో ఏకకాలంలో నినదిస్తూ.. నిరసిస్తూ.. నిగ్గదీస్తామని అన్నారు. ఈనెల 20న పెద్దఎత్తున ఉద్యమిస్తామని చెప్పారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ రైతాంగ వ్యతిరేక నిర్ణయాలపై రాష్ట్రంలోని అన్ని నియోజక వర్గాల్లో గ్రామాలవారీగా వివిధ రకాలుగా నిరసనలు చేపడతామని చెప్పారు. తనతోపాటు సహచర మంత్రులు గంగుల కమలాకర్‌, ప్రశాంత్‌ రెడ్డి, జగదీశ్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌ రావు, పువ్వాడ అజయ్‌ కుమార్‌, టీఆర్‌ఎ్‌సఎల్పీ నేత నామా నాగేశ్వర్‌ రావు, పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు, ఇతర పార్లమెంటు సభ్యులతో కూడిన బృందం మరోసారి ఢిల్లీకి వెళ్లాలని నిర్ణయించామన్నారు.


 తెలంగాణ భవన్‌లో సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన శుక్రవారం పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్‌ చైర్మన్లు, రైతు సమితి అధ్యక్షులు, జడ్పీ చైర్మన్లతో సమావేశం జరిగింది. సుమారు నాలుగు గంటలపాటు జరిగిన భేటీ తర్వాత నిరంజన్‌ రెడ్డి మీడియాతో మాట్లాడారు. కేంద్రం అనాలోచిత నిర్ణయాలతో తెలంగాణ రైతాంగం తీవ్రంగా నష్టపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లో లోపలా, బయటా టీఆర్‌ఎస్‌ ఎంపీలు చిత్తశుద్ధితో పోరాడారని, వారి ఆందోళన పట్ల కేంద్ర ప్రభుత్వం అమానుషంగా, అమర్యాదకరంగా వ్యవహరించిందని మండిపడ్డారు. పార్లమెంటు వేదికగా కేంద్ర మంత్రులతో అబద్ధాలు చెప్పించిందని ధ్వజమెత్తారు. ‘‘కేంద్రం ఇచ్చిన మేరకు సుమారు 60 లక్షల టన్నుల మేరకు కొనుగోళ్లు పూర్తయ్యాయి. మిగిలిన ధాన్యం కొనుగోలుకు అవకాశం ఇవ్వాలని కోరుతూ ఢిల్లీ వెళ్లి మరోసారి కోరతాం. ఈ విషయంలో కేంద్రం నుంచి లిఖితపూర్వక హామీ వచ్చేదాకా పోరాడతాం. గతంలో అంతా కొంటామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు. కానీ, కేంద్రం రాత పూర్వకంగా ఇచ్చిన వాటికే ప్రస్తుతం దిక్కులేదు. నోటి మాటలకు విలువ లేదు. 


ఈ విషయమై కేంద్రాన్ని నిలదీసేందుకు శనివారం ఢిల్లీకి వెళ్తున్నాం. కేంద్ర మంత్రులతోపాటు ప్రధాన మంత్రి అపాయింట్‌మెంట్‌నూ కోరాం. ఎఫ్‌సీఐ వారిది. గోదాంలు వారివి. రైళ్లు వారివి. వాళ్లే బియ్యం కొనాలి’’ అని డిమాండ్‌ చేశారు. వాళ్ల బియ్యం వాళ్లు తీసుకెళ్లకుండా రాష్ట్రం పంపలేదని చెప్పడం పూర్తిగా అవగాహనారాహిత్యమని మండిపడ్డారు. ‘‘ఇప్పటి వరకూ 56 లక్షల టన్నుల ధాన్యం సేకరించాం. ఇంకా కోతలు జరగాల్సింది ఉంది. కోసిన ధాన్యం కొంత కొనుగోలు కేంద్రాల్లో ఉంది. ఆ ధాన్యం కొనుగోలుపై కేంద్రం నిర్ణయం ఏమిటో రాతపూర్వకంగా చెప్పాలని డిమాండ్‌ చేస్తాం. కేంద్రం స్పందించే వరకూ అడుగుతూనే ఉంటాం’’ అని వివరించారు. ముడి బియ్యం (రా రైస్‌) ఎంతైనా కొంటామని చెప్పారని, అదే విషయాన్ని రాతపూర్వకంగా ఇవ్వాలని డిమాండ్‌ చేస్తామని చెప్పారు. ధాన్యం సేకరణలో రాష్ట్ర ప్రభుత్వానిది కేవలం సూపర్‌వైజరీ పాత్ర అని అన్నారు.

Updated Date - 2021-12-18T07:45:25+05:30 IST