చెరువుల్లో నగరం..

ABN , First Publish Date - 2021-11-30T05:30:00+05:30 IST

వానొస్తే చాలు.. కడప నగర ప్రజలు చిగురుటాకుల్లా వణుకుతారు. ఎక్కడ నీటి ముంపులో కూరుకుపోతామో.. జలదిగ్బంధంలో చిక్కుకుంటామో అనే భయం వారిని వెంటాడుతుంది.

చెరువుల్లో నగరం..
అంబేడ్కర్‌ సర్కిల్‌ నుంచి వై జంక్షన్‌కు పోయే రహదారిలో ప్రవహిస్తున్న వర్షపు నీరు

మూడు చెరువులు కబ్జా 

ఆనవాలు కోల్పోయిన మరికొన్ని చెరువులు 

వాన వస్తే ఉరుకే..

ఇదీ కడప నగరం దుస్థితి

ఆక్రమణల తొలగింపు ఉత్తి మాటలేనా..?


కడప, నవంబరు 30 (ఆంధ్రజ్యోతి): వానొస్తే చాలు.. కడప నగర ప్రజలు చిగురుటాకుల్లా వణుకుతారు. ఎక్కడ నీటి ముంపులో కూరుకుపోతామో.. జలదిగ్బంధంలో చిక్కుకుంటామో అనే భయం వారిని వెంటాడుతుంది. దీనంతటికి కారణం ఆక్రమణలే.. చెరువులు, గుంటలు, వాగులు, వంకలు పంట కాలువలు, మురుగునీటి కాలు వలు.. ఇలా అన్నింటిని ఆక్రమించేసి దర్జాగా అందమైన భవంతులు నిర్మించేస్తున్నారు. వాన నీరు పారే కాల వలను, ఆ నీరు నిల్వ ఉండే చెరువులనూ ఆక్రమిం చేశారు. దీంతో వర్షపు నీరు  పోయే దారి లేక ఇళ్లు, రహదారులను ముంచేస్తోంది. కడప నగరం గతంలో ఎన్నడూ లేని విధంగా రెండేళ్లగా తరచూ జలదిగ్బంధంలో చిక్కుకుంటోంది.


ఆక్రమణలే ముంచేస్తున్నాయి

పూర్వం పెద్దలు వర్షపు నీరు ఆధారంగా చెరువులు నిర్మించారు. ఒక చెరువు నుంచి మరో చెరువుకు నీరు వెళ్లేందుకు సుమారు 10 నుంచి 15 అడుగుల మేర కాలువలు ఉండేవి. వాటి కింద ఆయకట్టు కూడా ఉండేది. వర్షం వచ్చినప్పుడు కొండల నుంచి వర్షపు నీరు కాలువల ద్వారా చెరువులకు వెళుతుండేది. కడప కార్పొరేషన్‌ పరిధిలో పుట్లంపల్లి చెరువు, ఊటుకూరు చెరువు, బుడ్డాయపల్లె చెరువు, మృత్యుంజయకుంట, రామరాజుపల్లె కుంట, కొండాయపల్లె కుంట, రమణచెరువు, చెర్లోపల్లి చెరువు, గురివిరెడ్డి కుంట, బచ్చారావు చెరువులు ఉన్నాయి. వీటి పరిధిలో 297.74 ఎకరాల ఆయకట్టు ఉంది. భారీ తుఫా న్లు వచ్చినా వర్షపు నీరు కాలువలగుండా చెరువులకు వెళుతుండడంతో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేది. ఇవన్నీ ఒకదానికొక్కటి లింకు చెరువులుగా ఉండేవి.


ఆక్రమణల జోరు

నివాస స్థలాల ధరలకు రెక్కలు రావడంతో ఆక్రమణదారుల కన్ను చెరువులపై పడింది. వెరసి చెరువులు ఆక్రమించేయడం మొదలెట్టారు. వాటికున్న కాలువలను కబ్జా చేశారు. నగరంలో సుమారు 10 ఎకరాల పైబడి విస్తీర్ణంలో గురువిరెడ్డికుంట ఉండేది. ఈ చెరువు కింద ఆయకట్టు సుమారు 50 ఎకరాలు ఉండేది. అయితే ఇప్పుడు ఆ చెరువు మాయమై నగరం వెలిసింది. ఆర్టీసీ బస్టాండ్‌ పరిధిలోని సింహపూరి కాలనీ, ఓ మార్టు సమీపంలో చెరువు ఉన్నట్లు చెబుతారు. ఇప్పుడక్కడ ఆ చెరువు ఆనవాలే లేదు. అందమైన భవంతులు వెలిసాయి. మృంత్యుజయ కుంట చెరువు విస్తీర్ణం 16 ఎకరాలు ఉండేదని నీటి పారుదల శాఖ అధికారులు చెబుతున్నారు. ఇప్పుడు ఎకరాలోపు కూడా కుంట లేదు. దీని పరిధిలో 24 ఎకరాల ఆయకట్టు ఉండేది. చుట్టూ ఆక్రమించేసి భవంతులు నిర్మించేశారు. ఈ రెండు చెరువుల్లోనే నగరం చాలా భాగం ఉండడం విశేషం. ఇక రామరాజుపల్లెలో సుమారు 25 ఎకరాల్లో రామరాజుకుంట ఉండేది. ఇప్పుడు అది కబ్జాకు గురైంది. ఈ చెరువులన్నీ కేవలం రికార్డుల్లో ఉన్నాయి తప్ప క్షేత్రస్థాయిలో మాత్రం లేవు. మృత్యుంజయకుంట మాత్రమే కాస్త కనిపిస్తోంది.


మునకకు ఇదే కారణం

చెరువులన్నీ అక్రమించడంతో పాటు వాటి కాలువలు కూడా ఆక్రమించేశారు. ఇటీవల   ప్రకా్‌షనగర్‌, ఓంశాంతినగర్‌, ఆర్టీసీ బస్టాండ్‌, వైజంక్షన్‌, భరత్‌నగర్‌, చిన్నచౌకు, సింహపురికాలనీ.. ఇలా ప్రధాన ప్రాంతాలన్నీ నిన్న కురిసిన వర్షాలకు జలదిగ్బంధంలో చిక్కుకున్నా యి. ఇవన్నీ చెరువులు, కాలువలు ఆక్రమించిన ప్రాంతాలు కావడం విశేషం. ఇటీవల కొందరు బోట్లు కొనుక్కుని నీళ్లలో తిరగాల్సి వచ్చింది. నగరాన్ని జలదిగ్బంధం నుంచి బయటేసేందుకు రెండు రోజుల క్రితం మేయర్‌ సురేశ్‌ బాబు ఓ సమావేశం నిర్వహించారు. ఇరిగేషన్‌ అధికారులు హాజరయ్యారు. నీటి ముంపు ను తొలగించేందుకు ఏమి చేయాలో చెప్పండి అంటూ ఇరిగేషన్‌ అధికారులను అడుగగా ఆక్రమణలు తొలగించాలని ఇరిగేషన్‌ ఈఈ వెంకట్రామయ్య తెగేసి చెప్పినట్లు తెలిసింది. 40 ఏళ్ల క్రితం చెరువు కాలువలు ఎలా ఉన్నాయో సర్వే నిర్వహించి కాలువల ఆక్రమణలు తొలగించి ఆ నీటిని బుగ్గవంకలోకి మళ్లిస్తే సమస్య పరిష్కారం అవుతుందని చెప్పినట్లు తెలిసింది. అయితే ఇప్పుడు ఆక్రమణల తొలగింపే పెద్ద సమ స్యగా మారింది. ఎందుకంటే కాలువల అక్రమణల్లో బిగ్‌షాట్స్‌ బిల్డింగ్‌లు ఉన్నాయి. మరి వాటిని తొలగించే సాహసం చేస్తారా అన్నది ఇప్పుడు చర్చ జరుగుతోంది. ఆక్రమణలు తొలగించకపోతే కడప సింగపూర్‌సిటీ కాదు. స్విమ్మింగ్‌ పూల్‌ సిటీ మాదిరిగానే ఉంటుంది. చూద్దాం మరి అధికార యంత్రాంగం ఏమి చేస్తుందో...? 

Updated Date - 2021-11-30T05:30:00+05:30 IST