దుస్తులు ఊడదీసి కొట్టారు!

ABN , First Publish Date - 2022-07-03T08:55:21+05:30 IST

బీజేపీ బహిష్కృత నేత నూపుర్‌ శర్మ వివాదాస్పద వ్యాఖ్యల అనంతర పరిణామాలు శనివారం కూడా కనిపించాయి.

దుస్తులు ఊడదీసి కొట్టారు!

కన్హయ్యాలాల్‌ హత్య కేసు  నిందితులపై జనం దాడి


జైపూర్‌, జూలై 2: బీజేపీ బహిష్కృత నేత నూపుర్‌ శర్మ వివాదాస్పద వ్యాఖ్యల అనంతర పరిణామాలు శనివారం కూడా కనిపించాయి. ఆమె వ్యాఖ్యలకు మద్దతు తెలిపారన్న కక్షతో రాజస్థాన్‌కు చెందిన టైలర్‌ను హత్య చేసిన ఇద్దరు నిందితులపై కోర్టు వద్ద దాడి జరిగింది. ఆ నిందితులు బీజేపీ వారేనంటూ సామాజిక మాధ్యమా ల్లో ప్రచారం జరగడం రాజకీయంగా వివా దం సృష్టించింది. మరోవైపు నూపుర్‌ శర్మపై పశ్చిమ బెంగాల్‌ పోలీసులు లుక్‌అవుట్‌ నోటీసు జారీ చేశారు. ఉదయ్‌పూర్‌కు చెంది న టైలర్‌ కన్హయ్యాలాల్‌(48)ను హత్య చేసిన ఇద్దరు నిందితులపై జైపూర్‌లోని ఎన్‌ఐఏ కోర్టు వద్ద జనం దాడి చేశారు. వారి దుస్తులు చించివేసి కొట్టారు. పోలీసులు వారిని అక్కడే ఉన్న వ్యాన్‌లోకి పంపించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. కన్హయ్యాలాల్‌ను హత్య చేసిన రియాజ్‌ అఖ్తరి, మహమ్మద్‌ గౌస్‌లను అరెస్టు చేశారు. ఇందుకు సహకరించారన్న ఆరోపణపై మరో ఇద్దర్ని అదుపులోకి తీసుకున్నారు. కోర్టు వారికి ఈ నెల 12 వరకు ఎన్‌ఐఏ కస్టడీకి అప్పగించింది. 


నిందితులకు బీజేపీతో సంబంధాలు!

కన్హయ్యాలాల్‌ హత్య కేసు నిందితులకు బీజేపీ నాయకులతో సంబంధాలు ఉన్నాయంటూ ఇండియాటుడే కథనాన్ని ప్రసారం చేసింది. దాంతో హంతకులు బీజేపీ వారేనంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు వెల్లువెత్తాయి. ‘‘హంతకుడు రియాజ్‌ బీజేపీ కార్యకర్త అని ఆ పార్టీ మైనార్టీ సెల్‌ అంగీకరించింది’’ అంటూ కాంగ్రెస్‌ నాయకురాలు రేణుకా చౌదరి ట్వీట్‌ చేశారు. దీన్ని చాలా మంది షేర్‌ చేశారు. బీజేపీ మైనారిటీ నాయకులతో రియాజ్‌ దిగిన ఫొటోలను కాంగ్రెస్‌ మీడి యా హెడ్‌ పవన్‌ ఖేరా చూపించారు. అందుకే ఈ కేసును కేంద్ర ప్రభుత్వం అర్జంటుగా ఎన్‌ఐఏకు బదలాయించిందని అనుమానం వ్యక్తం చేశారు. ఈ ఆరోపణలను బీజేపీ ఐటీ సెల్‌ హెడ్‌ అమిత్‌ మాలవీయ ఖండించారు. ఇది తప్పుడు సమాచారం అన్నారు. రియాజ్‌ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నా సభ్యుడు మాత్రం కాదని బీజేపీ మైనారిటీ మోర్చా సభ్యుడు ఇర్షాద్‌ చైన్‌వాలా తెలిపారు. మరో సభ్యుడు మహమ్మద్‌ తాహీర్‌తో సన్నిహితంగా ఉండేవాడని తెలిపారు. కాగా, బీజేపీ నేత కపిల్‌ శర్మ ఉదయ్‌పూర్‌లో కన్హయ్యాలాల్‌ కుటుంబ సభ్యులను పరామర్శించారు. రూ.కోటి ఆర్థిక సాయం చేస్తానని చెప్పారు. గాయపడిన ఈశ్వర్‌కు రూ.25 లక్షలు ఇస్తామన్నారు. ఇలాంటి పరిస్థితుల్లోనే హత్యకు గురైన మహారాష్ట్రలోని అమరావతికి చెందిన ఉమేష్‌ ప్రహ్లాదరావు కోహ్లా    కుటుంబానికి రూ.30 లక్షలు అందజేస్తామని చెప్పారు.


నూపుర్‌కు మద్దతు ఇచ్చినందుకు మహారాష్ట్రలో కెమిస్ట్‌ హత్య

అమరావతి(మహారాష్ట్ర): నూపుర్‌శర్మ వ్యాఖ్యలను సమర్ధిస్తూ పోస్టు పెట్టిన ఉదయ్‌పూర్‌ దర్జీ హత్య కంటే ముందే మహారాష్ట్రలో అదే కారణం తో జరిగిన ఒక హత్య ఆలస్యంగా వెలుగుచూసింది. నూపుర్‌ వ్యాఖ్యలకు మద్దతుగా వాట్సాప్‌ గ్రూపుల్లో పోస్టులు పెట్టిన ఉమేశ్‌ ప్రహ్లాదరావ్‌ కొల్హే(54) అనే మెడికల్‌ షాపు యజమాని జూన్‌ 21న హత్యకు గురయ్యారు. ఈ కేసు విచారణను కూడా ఉదయ్‌పూర్‌ దర్జీ కన్నయ్యలాల్‌ హత్య కేసును దర్యాప్తు చేస్తున్న జాతీయ దర్యాప్తు సం స్థకే(ఎన్‌ఐఏ) కేంద్రం అప్పగించింది. దీంతో ఎన్‌ఏఐ బృందం శనివారం అమరావతి నగరంలో విచారణ ప్రారంభించింది. అమరావతి పోలీసు కమిషనర్‌ ఆర్తీసింగ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలో మందుల దుకాణాన్ని నడిపే ఉమేశ్‌.. నూపుర్‌కు మద్దతుగా వాట్సాప్‌ గ్రూపుల్లో పోస్టు లు పెట్టడంతో షేక్‌ రహీమ్‌ షేక్‌ ఇర్ఫాన్‌ ఖాన్‌ (32) అనే వ్యక్తి అతడిపై పగబట్టాడు. ఉమేశ్‌ను చంపేస్తే తలో రూ.10 వేలు ఇస్తానంటూ రోజుకూలీ చేసుకునే ముద్‌సిర్‌ అహ్మద్‌(22), షారుఖ్‌ పఠాన్‌(25), అబ్దుల్‌ తౌఫీక్‌(24), షోయిబ్‌ ఖాన్‌ (22), ఆతిబ్‌ రషీద్‌(22)లతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. జూన్‌ 21న రాత్రి దుకాణం మూసి న ఉమేశ్‌ ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళ్తుం డగా దారిలో ఆయన్ను అడ్డగించిన దుండగులు కత్తితో గొంతులో పొడిచి బైక్‌పై పరారయ్యారు. ఆ సమయంలో ఉమేశ్‌ వెనకాలే మరో బైక్‌పై ఉన్న ఆయన కుమారుడు సంకేత్‌.. ఉమేశ్‌ను ఆస్పత్రికి తరలించినా ఉపయోగం లేకపోయింది.

Updated Date - 2022-07-03T08:55:21+05:30 IST