కూలుతున్న కౌలు రైతు

ABN , First Publish Date - 2022-08-20T05:14:14+05:30 IST

వారికి వ్యవ సాయం అంటే ఎనలేని ప్రేమ. అందుకే సొంతంగా భూమి లేకపోయినా సరే.. కౌలుకు తీసుకుని మరీ పంటలు సాగు చేస్తుంటారు. వ్యవ సాయం అనే జూదంలో తరచూ ఓడిపోతుంటారు. ప్రభు త్వ వైఫల్యాలతో, ప్రకృతి వైపరీత్యాలతో పంటలు దెబ్బతిని కనీసం సాగు పెట్టుబడులు రాని పరిస్థితి. చేసిన అప్పులు తీర్చే దారి లేక ఆత్మాభిమానం చంపుకోలేక పలువురు రైతులు బలన్మరణాలకు పాల్పడుతున్నారు. కాస్తో కూస్తో ప్రభుత్వం నుంచి చేయూత అందే రైతులే ఆత్మహత్యకు పాల్పడుతుంటే.. ఇక కౌలు రైతుల పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు.

కూలుతున్న కౌలు రైతు
కౌలు రైతులకు ఆర్థిక చేయూత అందించేందుకు పవన్‌ కళ్యాణ్‌ వస్తుండడంతో సిద్దవటం వద్ద జరుగుతున్న ఏర్పాట్లు

పంటలు సాగు చేసి..  

పెట్టుబడులు రాక.. ఆత్మహత్య చేసుకుంటున్న కౌలు రైతులు

ఉమ్మడి వైఎస్సార్‌ కడప జిల్లాలో.. మూడేళ్లలో 175 మంది రైతుల ఆత్మహత్య

సిద్దవటంలో కౌలు రైతుల కుటుంబాలకు పవన్‌కళ్యాణ్‌ పరామర్శ   

ఒక్కొక్కరికి రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం అందజేత


రైతులను ఉద్ధరిస్తున్నట్టు, కౌలు రైతులను ఆదుకుంటున్నట్లు జగన్‌ ప్రభుత్వం చెప్పుకుంటోంది. ఏడాదంతా కష్టపడినా చేతికాడ ముద్ద నోటిలోకి వెళ్లే పరిస్థితి లేదు. పంటలు దెబ్బతింటే ప్రభుత్వమిచ్చే పథకాలు కౌలు రైతుల దరి చేరడంలేదు. వెరసి పంటలు సాగు చేయలేక కౌలు రైతులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఒకరిద్దరు కాదు.. మూడేళ్ల వ్యవధిలో ఉమ్మడి వైఎస్సార్‌ కడప జిల్లాలో 175 మంది కౌలు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. అయితే.. 2019 నుంచి ఇప్పటివరకు ఉమ్మడి వైఎస్సార్‌ కడప జిల్లాలో 108 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నట్లు వ్యవసాయశాఖ లెక్కలు చెబుతున్నాయి. వీరిలో ఒక్కరు కూడా కౌలు రైతు లేకపోవడం గమనార్హం. ఆత్మహత్యకు పాల్పడ్డ 175 మంది కౌలు రైతుల కుటుంబాలకు జనసేన అధ్యక్షుడు శనివారం ఆర్థిక సాయం అందంచనున్నారు. దీనికోసం సిద్దవటంలో ఏర్పాట్లు చేశారు.


(కడప-ఆంధ్రజ్యోతి): వారికి వ్యవ సాయం అంటే ఎనలేని ప్రేమ. అందుకే సొంతంగా భూమి లేకపోయినా సరే.. కౌలుకు తీసుకుని మరీ పంటలు సాగు చేస్తుంటారు. వ్యవ సాయం అనే జూదంలో తరచూ ఓడిపోతుంటారు. ప్రభు త్వ వైఫల్యాలతో, ప్రకృతి వైపరీత్యాలతో పంటలు దెబ్బతిని కనీసం సాగు పెట్టుబడులు రాని పరిస్థితి. చేసిన అప్పులు తీర్చే దారి లేక ఆత్మాభిమానం చంపుకోలేక పలువురు రైతులు బలన్మరణాలకు పాల్పడుతున్నారు. కాస్తో కూస్తో ప్రభుత్వం నుంచి చేయూత అందే రైతులే ఆత్మహత్యకు పాల్పడుతుంటే.. ఇక కౌలు రైతుల పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు. పవన్‌ కల్యాణ్‌ పర్యటనతో కౌలు రైతుల కష్టాలు మరోసారి తెరపైకి వచ్చాయి. ఉమ్మడి కడప జిల్లాలో 4.75 లక్షల మంది రైతులు ఉన్నారు. అయితే వ్యవసాయశాఖ లెక్కల ప్రకారం వైఎస్సార్‌ కడప జిల్లాలో 1600 మంది, అన్నమయ్య జిల్లాలో 677 మంది మాత్రమే కౌలు రైతులు ఉన్నట్లు చెబుతున్నారు. 


కౌలు ఎంతంటే..

జిల్లాలో సాగు భూములు ఉన్నప్పటికీ చాలా మంది రైతులు పంటలు సాగు చేయడం లేదు. సాగు భారం కావడం, ఇతరత్రా కారణాలతో సాగుకు దూరం అవుతున్నారు. అయితే వ్యవసాయం మీద మక్కువతో ఎకరా, రెండు ఎకరాలు కలిగిన సన్న కారు రైతులు, పూర్తిగా భూమిలేని వారు కొందరు పొలాలను కౌలుకు తీసుకుంటున్నారు. వర్షాధారం భూముల కైతే ఒక కౌలు, బోరు నీటి వసతి, కాలువల కింద ఉన్న పొలాలకు ఒక కౌలు ఇస్తారు. కొందరు కౌలు కింద ధాన్యం తీసుకుంటుండగా మరికొందరు నగదు తీసుకుంటారు. జిల్లాలో ప్రధాన సాగునీటి వనరు కేసీ కెనాల్‌. ఇక్కడ సుమారు 90 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. ఇక్కడ చాలా మటుకు భూములు కౌలు రైతులే సాగు చేస్తుంటారు. చెన్నూరు మండలంలో బోరు నీటితో సాగయ్యే పొలాలకు ఇరుగార్లకు కలిపి ఎకరాకు 22 బస్తాల వడ్లు కౌలు రైతులు భూ యజమానులకు చెల్లిస్తారు. ఇక్కడ నీటి వసతి ఉండడంతో రెండు పంటలు పండించుకోవచ్చు. ఈ కాల్వ పరిఽధిలో ఉన్న భూములకైతే ఎకరాకు 8 బస్తాల ధాన్యం ఇవ్వాలి. ఇక పశుగ్రాసం సాగు చేసే భూములకు అయితే ఎకరాకు గుత్త రూ.50వేలు ఇస్తారు. కేసీ కెనాల్‌ దువ్వూరు, చాపాడు, మైదుకూరు, రాజుపాలెం, ఖాజీపేట, చెన్నూరు మండలాల్లో ఎక్కువ ఆయకట్టు ఉంటుంది. ఇక్కడ చాలా మటుకు కౌలు ఇలాగే ఉంటుంది. ఖాజీపేటలో అయితే మెట్ట ప్రాంతాలలో సాగు చేస్తే రూ.5వేలు కౌలు ఇస్తారు.


పెరుగుతున్న సాగు వ్యయం

పంటల సాగు వ్యయం ఏటేటా పెరిగిపోతోంది. డీజలు, పెట్రోలు ధరలు పెరుగుతుండడంతో సేద్యపు ఖర్చులు మొదలు పురుగుమందులు, ఎరువుల ఽఽధరలు పెరిగాయి. వ్యవసాయ కూలీల ఖర్చులు పెరిగాయి. ఎకరా నేలలో వరి సాగు చేయాలంటే కనీసం రూ.39వేలు ఖర్చవుతుంది.


ఆదుకోని ప్రభుత్వాలు

ప్రభుత్వ లెక్కల ప్రకారం ఇప్పటి వరకు అధికారికంగా ఉమ్మడి వైఎస్సార్‌ కడప జిల్లాలో 2,223 మంది మాత్రమే కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇచ్చారు. అయితే సుమారు 60వేల మంది కౌలు రైతులు ఉంటారని రైతు సంఘాల ద్వారా తెలుస్తోంది.


కౌలు రైతులపై శీతకన్ను

కౌలు రైతులను ఉద్ధరిస్తున్నట్లు జగన్‌ ప్రభుత్వం చెబుతోం ది. వీరికి సీసీఆర్‌ (క్రాప్‌ కల్టివేటర్‌ రైతు) కార్డులు ఇస్తామ ని చెబుతోంది. వీటి ద్వారా ప్రకృతి విపత్తుల కారణంగా పంటలు దెబ్బతింటే పెట్టుబడి సాయం, పంట ఉత్పత్తులు, ఇన్‌పుట్‌ సబ్సిడీ, పంటల బీమా, పంట రుణం అందుతుంద ని అంటోంది. అయితే సుమారు 60 వేల మంది రైతులు ఉంటే కనీసం 5 శాతం మంది రైతులకు కూడా సీసీ ఆర్‌ కార్డులు ఇవ్వలేదు. ఈ కార్డులకు కాలపరిమితి కేవలం 11 నెలలు మాత్రమే ఉంటుంది. అయితే కౌలు రైతులందరికీ పంట రుణాలు, ప్రభుత్వం అందించే స బ్సిడీలు దక్కకపోవడంతో రైతులు నష్టపోతున్నారు. పం ట రుణాల కోసం ప్రైవేటు వ్యాపారస్తులను ఆశ్రయించి అప్పులపాలవుతున్నారు. వెరసి పెట్టిన పెట్టుబడులు రాక, తీర్చే దారిలేక కట్టుకున్న భార్యను, కన్నబిడ్డలను వదిలేసి బలవంతంగా తనువు చాలిస్తున్నారు.


నేడు పవన్‌ కళ్యాణ్‌ రాక

ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలను ఆదుకునేందుకు పవన్‌ కళ్యాణ్‌ శనివారం వైఎస్సార్‌ కడప జిల్లాకు రానున్నారు. ఆత్మహత్య చేసుకున్న 175 మంది రైతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.లక్ష చొప్పున సిద్దవటంలో జరిగే కార్యక్రమంలో ఆర్థిక సాయం అందించనున్నారు. పవన్‌ కళ్యాణ్‌ ప్రత్యేక విమానంలో మధ్యాహ్నం 12గంటలకు కడప ఎయిర్‌పోర్టుకు చేరుకుని అక్కడి నుంచి రోడ్డు మార్గాన సిద్దవటం వెళ్లనున్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలతో ముఖాముఖి నిర్వహించి అనంతరం జరిగే బహిరంగసభలో పవన్‌ ప్రసంగించనున్నారు.


కౌలు రైతుల ఆత్మహత్యలు కనపడలేదా? : నాదెండ్ల

కడప (సెవెన్‌రోడ్స్‌)/సిద్దవటం, ఆగస్టు 19: ‘‘సీఎం సొంత  జిల్లాలో ఎవరూ ఊహించని విధంగా కౌలు రైతులు బలవన్మరణానికి పాల్పడ్డారు. పరిపాలనపై అంత భరోసా ఉంటే ఇంత పెద్ద ఎత్తున రైతులు ఆత్మహత్య ఎందుకు చేసుకోవా ల్సి వచ్చింది. స్పందించే మనస్తత్వం లేని వ్యక్తి జగన్‌. ఇంతటి బాధ్యతారహిత్యమైన ప్రభుత్వం మరొకటి లేదు. త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేసి చట్టం తెచ్చిన జగన్‌ ఎంత మందికి 7 లక్షల పరిహారం ఇచ్చారో చెప్పాలి’’ అని జనసేన పీఏసీ చైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ అన్నారు. జనసేనాని పవన్‌ కళ్యాణ్‌ శనివారం జిల్లాలో పర్యటించనున్నారు. దీనికి సంబంధించి సిద్దవటంలో జరుగుతున్న ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన విలేకర్ల సమావేశం నిర్వహించి మాట్లాడుతూ ప్రభుత్వం లెక్కల కన్నా రిపోర్టర్లే ఎక్కువ కథనాలు ఇచ్చారన్నారు. పవన్‌ కుటుంబమంతా రైతు కుటుంబాలకు ఆర్థిక సహాయం చేస్తోందని, రైతాంగాన్ని ఆదుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. మూడేళ్లగా ప్రభుత్వం చుట్టూ తిరుగుతున్నా కాగితాలు లేవనే సాకుతో పరిహారం అందించలేదన్నారు. ఎంతో మంది కౌలు రైతుల కుటుంబాలు ఇప్పటికీ అధికారుల చుట్టూ ప్రదిక్షణలు చేస్తూనే ఉన్నారు కాని స్పందించిన పాపాన పోలేదన్నారు. ‘‘పవన్‌ ఒక మంచి సందేశాన్ని అందిస్తారు. సమాచారం హక్కు చట్టం ప్రకారం జాబితా తెప్పించుకున్నాం. పవన్‌ చేస్తున్న ఆర్థిక సహాయం గురించి జగన్‌ చులకనగా మాట్లాడారు. మీ స్వంత జిల్లాలోనే పవన్‌ ఆర్థిక సహాయం అందచేస్తున్నాం. మీ ప్రతినిధులు వచ్చి చూస్తే పరిస్థితి అర్థం అవుతుంది. కౌలు రైతులు అండగా జనసేన పార్టీ ఉంటుంది. వారి పిల్లల చదువులు, బాగోగుల బాధ్యత జనసైనికులు తీసుకుంటారు.’’ అని అన్నారు.


250మంది పోలీసులతో బందోబస్తు 

సిద్దవటంలో శనివారం జరిగే కౌలు రైతు భరోసా కార్యక్రమా నికి జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ పర్యటనలో భాగంగా కార్యక్రమానికి వచ్చే జనసేన నేతలు, కార్యకర్తలు, ప్రజలు పోలీసులకు సహకరించాలని ఒంటిమిట్ట సీఐ రాజాప్రభాకర్‌ తెలిపారు. సిద్దవటం గురుకుల పాఠశాల సమీపంలోని సభాప్రాంగణాన్ని శుక్రవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పవన్‌కళ్యాణ్‌ సభకు దాదాపు 15వేల నుంచి 20 వేల మంది హాజరయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోందన్నారు. సభకు వచ్చేవారికి మెయిన్‌ రోడ్డుపక్కన నాలుగు పార్కింగ్‌ ప్రదేశాలు ఏర్పాటు చేస్తున్నారని పార్కింగ్‌ ప్రదేశాల్లో మాత్రమే టూవీలర్స్‌, ఫోర్‌వీలర్స్‌ పార్కింగ్‌ చేయాలన్నారు. సభాప్రాంగణం వద్దకు ఇతరుల వాహనాలకు అనుమతి లేదన్నారు. గ్యాలరీలో పాసులు కలిగిన దాదాపు వంద మంది వీవీఐపీలు, వెయ్యి మంది మహిళలు, డయాస్‌ మీద ఉమ్మడి కడప జిల్లాకు చెందిన 176 మంది కౌలు రైతుల కుటుంబీకులతో పాటు దాదాపు 300 మంది ఉంటారన్నారు. ఐదుగురు సీఐలు, 12 మంది ఎస్‌ఐలు, మూడు స్పెషల్‌ పార్టీ పోలీసు బృందాలతో కలిపి 250 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పారిశ్రామిక వేత్త అతికారి కృష్ణ, ఎస్‌ఐ తులసీ, నాగప్రసాద్‌, పోలీసులు పాల్గొన్నారు. 



Updated Date - 2022-08-20T05:14:14+05:30 IST