అడిగినంత కమీషన్‌ ఇవ్వలేదని..తనపై తప్పుడు కేసు

ABN , First Publish Date - 2020-08-08T09:44:38+05:30 IST

హెటిరో కంపెనీ ఉద్యోగులు అడిగినంత కమీషన్‌ ఇవ్వలేదని, కోవిఫర్‌ మందు అధిక ధరలకు విక్రయిస్తున్నానని తనపై పోలీసులతో

అడిగినంత కమీషన్‌ ఇవ్వలేదని..తనపై తప్పుడు కేసు

హెటిరో ఉద్యోగులపై శ్రీ మెడిక్యూర్‌ యజమాని ఆరోపణ


చాదర్‌ఘాట్‌,ఆగస్టు 7 (ఆంధ్రజ్యోతి): హెటిరో కంపెనీ ఉద్యోగులు అడిగినంత కమీషన్‌ ఇవ్వలేదని, కోవిఫర్‌ మందు అధిక ధరలకు విక్రయిస్తున్నానని తనపై పోలీసులతో కుమ్మక్కై తప్పుడు కేసు నమో దు చేయించారని మల్కాజిగిరిలోని శ్రీ మెడిక్యూర్‌ ప్రొడక్ట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ యజమాని సుబ్రహ్మణ్యం ఆరోపించారు. మలక్‌పేటలోని పీయూసీఎల్‌ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. హెటిరో కంపెనీ ఉద్యోగులు కోటిరెడ్డి, బోస్‌లు పది శాతం కమీషన్‌ అడిగారని ఆరోపించారు. రెండు శాతం కమీషన్‌ మాత్రమే ఇస్తానని  తెలిపారు. కమీషన్‌ సెటిల్‌ అవుతున్న క్రమంలో కోవిఫర్‌ మెడిసిన్‌ ఓ ఆస్పత్రికి అధిక ధరలకు అమ్ముతున్నానని చాదర్‌ఘాట్‌ పోలీసులతో కేసు పెట్టించారని ఆరోపించారు.


తాను కంపెనీ నుంచి ఎంతకు కోవిఫర్‌ మెడిసిన్‌ కొనుగోలు చేశానో.. ఎంతకు విక్రయించానో రసీదులు ఉన్నాయన్నారు. ఆర్‌టీజీఎస్‌ రూపంలో తన కంపెనీ ఖాతా నుంచి రూ.10.56 లక్షలు పంపానని, అందుకు సంబంధించిన ఆధారాలు తన వద్ద ఉన్నాయన్నారు. పోలీసులు అత్యుత్సాహంతో, ఎలాంటి ముందస్తు విచారణ జరపకుండా హడావిడిగా కేసు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. నిరుద్యోగాన్ని అధిగమించేందుకు చిన్న కంపెనీ పెట్టి, కరోనా బారిన పడుతున్న వారికి మందులు అందించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. తనను మెడికల్‌ మాఫియాతో కలిసి చంపాలని ప్రయత్నిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కోటిరెడ్డి, బోస్‌లు కుట్రపన్ని పోలీసులతో ఎన్‌కౌంటర్‌ చేయిస్తామని బెదిరిస్తున్నారన్నారు. వారి నుంచి తనను కాపాడాలని విజ్ఞప్తి చేశారు.  

Updated Date - 2020-08-08T09:44:38+05:30 IST