దళితుల సమగ్ర అభివృద్ధికి మూడు కార్పొరేషన్లు అవసరం

ABN , First Publish Date - 2021-04-21T05:47:14+05:30 IST

మొన్న మార్చిలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లోని ముఖ్యమైన అంశాల్లో దళిత సాధికార పథకం ఒకటి. వెయ్యి కోట్ల రూపాయలతో కూడిన ఈ పథకం...

దళితుల సమగ్ర అభివృద్ధికి మూడు కార్పొరేషన్లు అవసరం

మొన్న మార్చిలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లోని ముఖ్యమైన అంశాల్లో దళిత సాధికార పథకం ఒకటి. వెయ్యి కోట్ల రూపాయలతో కూడిన ఈ పథకం దళితుల్లో ఎన్నో ఆశలు పెంచింది. గతంలో వారి కోసం ఉద్దేశించిన సంక్షేమ పథకాలు, స్కాలర్‌షిప్‌లు, విదేశాలలో శిక్షణ వంటివన్నీ కూడా సబ్‌ ప్లాన్‌ నిధుల నుంచి అమలయ్యేవి. వాటికి ఇది అదనం. వెయ్యి కోట్ల ఈ నిధిని తానే పర్యవేక్షిస్తానని ముఖ్యమంత్రి కేసీఆర్‌ చెప్పడం హర్షదాయకం. దీని అమలు పట్ల దళితులు ఎంతో ఆసక్తితో ఉన్నారు. అయితే దానికి ముందుగా రాష్ట్రంలో ఎస్సీల మధ్య పంపకాల్లో ఉన్న అపోహలు తొలగిపోవాలి. వాటిని ప్రభుత్వమే తొలగించాలి. దళితులకు మూడెకరాల భూమి, యువత ఉపాధి, రుణాలు ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా పంపిణీ అయ్యేవి. ఆ కార్పొరేషన్‌ చైర్మన్‌గా ఒక మాల వ్యక్తి ఉంటే మాలలే అధికంగా వాటా పొందుతున్నారని మాదిగలు ఆరోపణలు చేసేవారు. అదేవిధంగా మాదిగ వ్యక్తి చైర్మన్‌గా ఉంటే వారే అధికంగా వాటా పొందారని మాలలు ఆరోపించేవారు. ఈ సమస్యను పరిష్కరించాలంటే ఎస్సీ కార్పొరేషన్‌ను మూడు కార్పొరేషన్లుగా విభజించాలి. జనాభా దామాషా ప్రకారం నిధులు కేటాయించాలి. మాదిగలకు ఒక కార్పొరేషన్‌, మాలలకు ఒక కార్పొరేషన్‌, అన్ని ఉపకులాలకు ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటుచేయడం సబబని ఈ వర్గాల అభిప్రాయం. 


ఆంధ్రలో ప్రత్యేక కార్పొరేషన్‌ కోసం మాదిగ కార్పొరేషన్‌ సాధన సమితి పోరాడింది. ఫలితంగా జగన్‌ ముఖ్యమంత్రి అయ్యాక ఆంధ్ర రాష్ట్రంలో ఎస్సీలకు మూడు కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. అంతకుముందు 2014 తరువాత చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జీవో 25 ద్వారా సంక్షేమ పథకాలు కులాల నిష్పత్తి ప్రకారం ఇచ్చే వెసులుబాటు కల్పించారు. తెలంగాణలో ఈ మధ్య మాల ఉద్యోగులు మాల కార్పొరేషన్‌ ఏర్పాటు చేయమని డిమాండ్‌ చేశారు. తమకు 12 శాతం రిజర్వేషన్‌ కల్పించాలని డిమాండ్‌ చేస్తూ మాదిగ సంఘాల జెఎసి ఆధ్వర్యంలో మాదిగ జాగృతి రథయాత్ర ద్వారా 32 జిల్లా కేంద్రాల్లో ప్రచారం సాగించింది. ఉమ్మడి రాష్ట్రంలో ఎబిసిడి డిమాండ్‌తో ఉద్యమం జరిగింది. రాష్ట్రం విడిపోయాక జనాభా నిష్పత్తి మారిపోయింది. ఆంధ్రలో మాల, తెలంగాణలో మాదిగ ఎస్సీలలో పెద్ద కులాలుగా అవతరించాయి. అందుకే తెలంగాణలో జనాభా దామాషా ప్రకారం, 2021 జనాభా లెక్కల ప్రకారం 12 శాతం రిజర్వేషన్‌ కోసం మాదిగ సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. మాల, మాదిగ, ఉపకులాల కార్పొరేషన్‌ ఏర్పాటు కోసం జీవో 25ను జారీచేసినట్లే తెలంగాణలో కూడ అటువంటి జీవో తెస్తే వర్గీకరణ ఉద్యమం కొంతమేర విజయవంతం అయినట్లే. మూడు ఎకరాల భూమి పథకం కింద రాష్ట్రంలో మొత్తం పంచింది 15 వేల ఎకరాలు. అందులో మెజారిటీ మాదిగలకు రావచ్చు. ఎందుకంటే వారు భూమిలేని వారు అయిండొచ్చు. ఎస్సీలలోని 89 కులాల వారి జనాభా నిష్పత్తి ప్రకారం ఇస్తే ఏ గోలా ఉండదని ముందు నుంచి మాదిగ ఉద్యమం వాదిస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ దళిత సాధికార పథకానికి చెందిన వెయ్యి కోట్లు దళితులకు అందరికీ అందుతాయని ఆశిద్దాం.

పిడమర్తి రవి‌

Updated Date - 2021-04-21T05:47:14+05:30 IST