సర్కారుపై సమర శంఖం

ABN , First Publish Date - 2022-07-01T09:35:59+05:30 IST

సర్కారుపై సమర శంఖం

సర్కారుపై సమర శంఖం

ప్రభుత్వ ఎగవేత ధోరణిపై రాజధానివాసుల పోరాటం

సుమారు 25 వేల మందికి ఆగిన ప్రయోజనాలు

3 నెలలుగా అందని భూమిలేని పేదల పెన్షన్‌ 

సీఆర్‌డీఏ కార్యాలయం ఎదుట ఆందోళనకు శ్రీకారం


గుంటూరు, జూన్‌ 30 (ఆంధ్రజ్యోతి): ఇప్పటి వరకూ రాజధాని కోసం భూములిచ్చిన రైతులను వేధిస్తున్న ప్రభుత్వం.. తాజాగా రాజధాని గ్రామాల ప్రజలకు కూడా సమస్యలు సృష్టిస్తోంది. దీంతో వారు కూడా రైతులతోపాటు ప్రభుత్వంపై సమర శంఖం పూరించారు. ఇప్పటి వరకూ రైతులతో పాటు భూమిలేని నిరుపేదలకు వచ్చిన ప్రయోజనాలను కూడా ప్రభుత్వం నిలిపివేస్తుండడంతో వారు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే శుక్రవారం సీఆర్‌డీఏ కార్యాలయం ఎదుట ఆందోళనకు శ్రీకారం చుట్టారు.


19,182 మందికి పెన్షన్‌ నిలిపివేత

రాజధాని నిర్మాణం కోసం భూములిచ్చిన కారణంగా పనులు కోల్పోయే భూమి లేని నిరుపేద రైతుకూలీలకు, అనుబంధ వృత్తుల వారికి ప్రతి నెలా రూ. 2,500 చొప్పున పెన్షన్‌ ఇచ్చి ఆదుకుంటామని గతంలో ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఆ మేరకు గత ప్రభుత్వం ప్రతి నెలా 19,182 మంది భూమి లేని పేదలకు రూ.4.8 కోట్లు చెల్లించేది.  సీఆర్‌డీఏ చట్టంలో ఉండడంతో ప్రస్తుత ప్రభుత్వం కూడా ఈ పెన్షన్‌ విధానాన్ని కొనసాగించక తప్పలేదు. అయితే  మూడు నెలలుగా వీరికి పెన్షన్‌ నిలుపుదల చేసింది. రాజధానికి ఇచ్చిన భూముల్లో అటవీ భూములు ఉన్నాయని, వాటిపై సీఐడీ విచారణ జరిపించాలనే పేరుతో మందడం, నీరుకొండ, కురగల్లు, ఐనవోలు గ్రామాలకు చెందిన రైతులకు ప్రభుత్వం కౌలు నిలిపివేసింది. ఈ నాలుగు గ్రామాల పరిధిలో సుమారు 400 ఎకరాల భూములు అటవీ భూములని చెబుతున్న ప్రభుత్వం, దాదాపు 200 మంది రైతులకు ఈ ఏడాది రావాల్సిన రూ. 2 కోట్ల కౌలును ఆపేసింది. కాగా, ఇవి అటవీ భూములు కాదని రాజధాని రైతు జేఏసీ నేతలు చెబుతున్నారు. 


లంక, అసైన్డ్‌ భూములకు రాని కౌలు

రాజధాని రైతులిచ్చిన భూముల్లో 2685 ఎకరాలు లంక, అసైన్డ్‌ భూములు ఉన్నాయని ప్రభుత్వం తేల్చింది. సాంకేతిక సమస్య కారణంగా వీరు కౌలుకు అనర్హులైనప్పటికీ, భృతి కోల్పోతున్న కారణంగా గత ప్రభుత్వం వారి సమస్యను పరిష్కరించి కౌలు ఇచ్చేందుకు చర్యలు చేపట్టింది. దీంతో అసైన్డ్‌ భూముల రైతులకు కొందరికి కౌలు లభించింది. మిగిలినవారి సమస్య కూడా పరిష్కరించేలోపు ప్రభుత్వం మారిపోయింది. దీంతో వారికి గత ఏడేళ్లుగా కౌలు రావడం లేదు. ఇదే కారణాన్ని చూపి మొత్తంగా అసైన్డ్‌ రైతులందరికీ కౌలు ఆపేశారు. ప్రభుత్వ తీరు కారణంగా దాదాపు రూ.13 కోట్ల కౌలు ఆగిపోయింది. దీనితోపాటు రాజధాని గ్రామాల్లోని పేద, దళిత, బలహీన వర్గాల ప్రజలు దాదాపు 5 వేల మంది అప్పు చేసి మరీ టిడ్కో ఇళ్లకు నగదు చెల్లించారు. వారు మూడేళ్లుగా ఇళ్ల కోసం ఎదురు చూస్తున్నారు. దీనికి తోడు సీఆర్‌డీఏ చట్టాన్ని ఉల్లంఘిస్తూ ప్రభుత్వ ఉద్యోగుల కోసం నిర్మించిన గృహ సముదాయాలను అద్దెకు ఇవ్వాలన్న నిర్ణయంపై రాజధానివాసులు అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. దీంతో వారు సీఆర్‌డీఏ కార్యాలయం ఎదుట ఆందోళనకు సిద్ధమయ్యారు. 

Updated Date - 2022-07-01T09:35:59+05:30 IST