అల్లర్ల వెనక అకాడమీల కుట్ర

ABN , First Publish Date - 2022-06-23T08:11:41+05:30 IST

సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ విధ్వంసం కేసులో మరో 10 మందిని అరెస్టు చేశారు. ఈ నెల 17న రైళ్లకు నిప్పంటించి విధ్వంసానికి పాల్పడి..

అల్లర్ల వెనక అకాడమీల కుట్ర

  • ‘సికింద్రాబాద్‌ విధ్వంసం’ కేసులో మరో 10 మంది అరెస్ట్‌..
  •  రిమాండ్‌ రిపోర్టులో ఆవుల పేరు


హైదరాబాద్‌ సిటీ/అడ్డగుట్ట/సైదాబాద్‌, జూన్‌ 22 (ఆంధ్రజ్యోతి): సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ విధ్వంసం కేసులో మరో 10 మందిని అరెస్టు చేశారు. ఈ నెల 17న రైళ్లకు నిప్పంటించి విధ్వంసానికి పాల్పడి.. పరారీలో ఉన్న పది మంది నిందితులను అరెస్ట్‌ చేసిన పోలీసులు బుధవారం రైల్వే కోర్టులో హాజరుపరిచారు. అల్లర్లలో పాల్గొన్న వీరిని వాట్సాప్‌ గ్రూప్‌లో ఉన్న ఫోన్‌ నంబర్ల ఆధారంగా అదుపులోకి తీసుకున్నారు. ఈ విధ్వంసంలో కొన్ని ప్రైవేటు డిఫెన్స్‌ అకాడమీల పాత్ర కూడా ఉందని పోలీసులు గుర్తించారు. నిరసనకారులు రైల్వే స్టేషన్‌లో దాడులు చేస్తున్న సమయంలో కొన్ని డిఫెన్స్‌ అకాడమీల గురించి మాట్లాడుకున్నారని, అందులో సాయి అకాడమీ కూడా ఉందని తేల్చారు. అకాడమీ నిర్వాహకులు ఆవుల సుబ్బారావు, శివలు హకీంపేట సోల్జర్స్‌ గ్రూప్‌లో సెల్ఫీ తీసుకున్నట్లు నిర్ధారించారు. విద్యార్థులను సికింద్రాబాద్‌ స్టేషన్‌కు చేర్చడం, దాడికి ప్రోత్సహించడంలో సుబ్బారావు, శివలు కీలక పాత్ర పోషించారని రిమాండ్‌ రిపోర్ట్‌లో పేర్కొన్నారు. ముందస్తు ప్రణాళిక ప్రకారం స్టేషన్‌లో విధ్వంసం చేసేందుకు పలు వాట్సాప్‌ గ్రూపులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అందరూ ఉదయం 8.30 గంటల కల్లా స్టేషన్‌కు చేరుకోవాలని పరస్పరం సందేశాలు పంపించుకున్నారని పేర్కొన్నారు. కేంద్ర వైఖరికి వ్యతిరేకంగా నిరసన తెలిపేందుకు.. రైల్వే స్టేషన్‌ బ్లాక్‌ గ్రూప్‌, ఇండియన్‌ ఆర్మీ, హకీంపేట ఆర్మీ సోల్జర్స్‌, చలో సికింద్రాబాద్‌ ఏఆర్‌వో 3, ఆర్మీ జీడీ 2021 మార్చ్‌ ర్యాలీ, సీఈఈ సోల్జర్స్‌, సోల్జర్స్‌ టు డై గ్రూపుల ద్వారా దాడికి సమన్వయం చేసుకున్నారని గుర్తించారు. 


స్టేషన్‌కు వచ్చిన వారు ఆయా గ్రూపుల్లో సెల్ఫీలు పంపి ఇతరులను కూడా రావాలని కోరారు. బిహార్‌ తరహాలో అల్లర్లు చేయాలని ఆర్మీ అభ్యర్థులను వారు ప్రోత్సహించినట్లు దర్యాప్తులో తేలింది. దాడికి పాల్పడిన వారిపై పలు ఐపీసీ సెక్షన్లతో పాటు ఇండియన్‌ రైల్వేయాక్ట్‌లోని 149, 150, 151, 152 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. కాగా, అరెస్టయిన వారిలో ఆదిలాబాద్‌ జిల్లా సోనాపూర్‌కు చెందిన ఇంటర్‌ విద్యార్థి రాథోడ్‌ పృథ్వీరాజ్‌(23), సిద్దిపేట జిల్లా చేర్యాలకు చెందిన బింగి రమేశ్‌(22), మల్కాజిగిరికి చెందిన రాజా సురేంద్ర కుమార్‌(22), కామారెడ్డి జిల్లా మతుసంగం గ్రామానికి చెందిన ప్రైవేటు ఉద్యోగి దేవ్‌సోత్‌ సంతోష్‌(23), మహబూబ్‌నగర్‌ జిల్లా చిలువేరు రాణిపేటకు చెందిన విద్యార్థి మహ్మద్‌ సాబర్‌(23), ఆదిలాబాద్‌ జిల్లా కుమ్మన్‌ తండాకు చెందిన విద్యార్థి పడవాల్‌ యోగేశ్‌(20), కామారెడ్డి జిల్లా కేటుపల్లికి చెందిన విద్యార్థి బామాన్‌ పరుశురాం(20), జనగాం జిల్లా ఇప్పగూడెం గ్రామానికి చెందిన విద్యార్థి పుప్పాల అయ్యప్పచారి(23), యాదాద్రి భువనగిరి జిల్లా రాగిబావికి చెందిన విద్యార్థి పసునూరి సుందర్‌రెడ్డి(20), నారాయణగూడకు చెందిన విద్యార్థి తుకారాం(20) ఉన్నారు. కోర్టులో హాజరు పరిచి, తీసుకెళ్లే సమయంలో నిందితులను మీడియాకు చూపకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకున్నారు. 


కుటుంబ సభ్యుల కన్నీళ్లు..

తమ పిల్లలను అకారణంగా జైలుకు పంపిస్తున్నారంటూ నిందితుల తల్లిదండ్రులు కోర్టు వద్ద విలపించారు. తమ కుమారుల కోసం వారు ఉదయం 11 గంటల నుంచే కోర్టు వద్ద పడిగాపులు కాశారు. బిడ్డా జాగ్రత్త అంటూ ఓ తల్లి ఏడుస్తూ కనిపించింది. కాగా, సికింద్రాబాద్‌ విధ్వంసం ఘటన జరిగిన నాటి నుంచి పలువురు ఆర్మీ అభ్యర్థులు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. కొడుకుల ఆచూకీ లభించకపోవడంతో వారి తల్లిదండ్రులు 3రోజులుగా చంచల్‌గూడ జైలుకు, పోలీ స్‌ స్టేషన్లకు తిరుగుతూ వాకబుచేస్తున్నారు. తాజాగా అరెస్టు చేసిన 10 మందిని చంచల్‌గూడ జైలుకు తరలించారు. 


అగ్గి రాజేసిన పృథ్వీరాజ్‌..

సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో విధ్వంసం చేయాలని ముందుగానే పథకం వేసుకున్న కొంతమంది యువకులు బ్యాగుల్లో పెట్రోలు, డీజిల్‌ బాటిళ్లు వెంట తెచ్చి రైళ్లకు నిప్పుపెట్టినట్లు విచారణలో తేలింది. మరికొందరు పాత పేపర్లు, అగ్గిపెట్టెలతో రైలు బోగీల్లోకి వెళ్లి నిప్పంటించారు. పేపర్లు, అగ్గిపెట్టెతో విధ్వంసానికి ఆజ్యం పోసిన నిందితుడు ఆదిలాబాద్‌ జిల్లాకు చెందిన పృథ్వీరాజ్‌గా గుర్తించారు. బోగీల్లో అగ్గి రాజేయడాన్ని తన ఫోన్‌లో స్నేహితుడి ద్వారా వీడియో తీయించాడు. అలా తీసిన వీడియోలను ప్రత్యేక సోల్జర్స్‌ వాట్సాప్‌ గ్రూపుల్లో షేర్‌ చేశారు. అది చూసి మరికొంతమంది విధ్వంసానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. రైల్వేస్టేషన్‌ ముట్టడికి 1500-2000 మంది యువకులు రాగా.. 10 మంది అరాచకం సృష్టించారని పేర్కొన్నారు.

Updated Date - 2022-06-23T08:11:41+05:30 IST