ఆర్మీని అదానీకి అప్పజెప్పే కుట్ర నాలుగేళ్లు పనిచేసి వచ్చాక అడుక్కు తినాలా?

ABN , First Publish Date - 2022-06-28T09:02:50+05:30 IST

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్‌ పథకం కుట్రపూరితంగా ఉన్నదని సంగారెడ్డి ఎమ్మెల్యే, టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ...

ఆర్మీని అదానీకి అప్పజెప్పే కుట్ర నాలుగేళ్లు పనిచేసి వచ్చాక అడుక్కు తినాలా?

సైనికుల ధైర్యాన్ని దెబ్బతీసేలా కేంద్రం తీరు

అగ్నిపథ్‌ను ఉపసంహరించే వరకూ పోరు

పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఎమ్మెల్యే జగ్గారెడ్డి


సంగారెడ్డి టౌన్‌, జూన్‌ 27: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్‌ పథకం కుట్రపూరితంగా ఉన్నదని సంగారెడ్డి ఎమ్మెల్యే, టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ టి.జగ్గారెడ్డి అన్నారు. అగ్నిపథ్‌ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ సంగారెడ్డిలో సోమవారం కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డి ఆఽధ్వర్యంలో సత్యాగ్రహ దీక్ష నిర్వహించారు. దీక్షా శిబిరాన్ని జగ్గారెడ్డి సందర్శించి, సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ... అగ్నిపథ్‌ పథకం పేరిట ఆర్మీని కూడా ప్రైవేట్‌ పరం చేసి, అదానీకి అప్పజెప్పేందుకు బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందని విమర్శించారు. ఆర్మీలో నాలుగేళ్లు పని చేసి వచ్చాక అడుక్కు తినాలా? అని ఆయన ప్రశ్నించారు. భారత మాతా కీ జై అన్న నినాదం.. బీజేపీ మాటల్లోనే ఉంటుందని, చేతల్లో ఎక్కడా కనిపించదని విమర్శించారు. అగ్నిపథ్‌ పథకం సైనికుల మనోధైర్యాన్ని దెబ్బతీసేలా ఉందని దుయ్యబట్టారు. అగ్నిపథ్‌పై దేశవ్యాప్తంగా అగ్నిజ్వాలలు భగ్గుమంటున్నా ప్రధాని మోదీ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. అగ్నిపథ్‌ను రద్దు చేసే వరకు కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో నిరంతర పోరాటాలు సాగిస్తామని హెచ్చరించారు. కాంగ్రెస్‌ పార్టీ ఆవిర్భావం నాటి నుంచి జైజవాన్‌..జైకిసాన్‌ నినాదంతో ముందుకు సాగుతున్నదన్నారు. దేశాన్ని కంటికి రెప్పలా కాపాడుతున్న సైనికులకు, ప్రపంచానికీ అన్నం పెడుతున్న అన్నదాతలకు కాంగ్రెస్‌ అండగా నిలుస్తున్నదని తెలిపారు. బీజేపీ ప్రభుత్వ విధానాలు అటు రైతులు, ఇటు సైనికులకు నష్టం చేకూర్చుతూ, కార్పొరేట్‌ రంగాన్ని పెంచిపోషించేలా ఉన్నాయని విమర్శించారు. సుభాష్‌ చంద్రబోస్‌ వారసులమంటున్న బీజేపీ నేతలు.. ఆయన ఆశయాలను తుంగలో తొక్కుతున్నారని ఆరోపించారు. సుభాష్‌ చంద్రబో్‌సపై అభిమానం ఉంటే.. ఆయన ఆశయాలను ఆచరణలో పెట్టాలని హితవు పలికారు. అగ్నిపథ్‌లో ఎంపికైన సైనికులను 4 సంవత్సరాలు వాడుకొని వదిలేస్తే వారి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉందన్నారు. ఇప్పటికైనా అగ్నిపథ్‌ను రద్దు చేయాలని జగ్గారెడ్డి డిమాండ్‌ చేశారు. దేశంలో కాంగ్రె్‌సకు పెరుగుతున్న ఆదరణను చూసి ఓర్వలేక సోనియాగాంధీ, రాహుల్‌గాంధీని ఈడీ విచారణ పేరిట ప్రధాని మోదీ వేధిస్తున్నారని ధ్వజమెత్తారు. సత్యాగ్రహ దీక్షలో టీపీసీసీ కార్యదర్శి అనంతకిషన్‌, నియోజకవర్గ ఇన్‌చార్జి ఆంజనేయులు, యూత్‌కాంగ్రె్‌స అధ్యక్షుడు కూన సంతోష్‌, మండలాధ్యక్షుడు బుచ్చిరాములు, పట్టణ అధ్యక్షుడు జార్జి, స్థానిక కౌన్సిలర్లు ఆఫేజ్‌, షఫి, నాగరాజు, ఉదయ భాస్కర్‌తోపాటు నాయకులు రఘుగౌడ్‌, మహే్‌షగౌడ్‌, యాదగిరి, తాహేర్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2022-06-28T09:02:50+05:30 IST