సహకార వ్యవస్థ ప్రక్రియ ఇక ఆన్‌లైన్‌లో

ABN , First Publish Date - 2021-10-17T06:19:09+05:30 IST

సహకార వ్యవస్థ ప్రక్రియ అంతా ఇక ఆన్‌లైన్‌ విధానంలో కొనసాగనుంది.

సహకార వ్యవస్థ ప్రక్రియ ఇక ఆన్‌లైన్‌లో

ప్రత్యేక పోర్టల్‌ రూపకల్పన 

మ్యాన్యువల్‌ పద్దతికి స్వస్తి 

ఇక అంతా పారదర్శకం 

నిర్మల్‌, అక్టోబరు 16 (ఆంధ్రజ్యోతి)  : సహకార వ్యవస్థ ప్రక్రియ అంతా ఇక ఆన్‌లైన్‌ విధానంలో కొనసాగనుంది. ఇప్పటి వరకు కొనసాగుతున్న మ్యానువల్‌ పద్ధతికి సహకారశాఖ స్వస్తి పలకబోతోంది. గత కొంతకాలం నుంచి కొన్ని సహకార సంఘాలపై వస్తున్న అవినీతి ఆరోపణలతో పాటు ప్రస్తుతం మ్యానువల్‌ పద్ధతిలో ఉన్న లోపాల కారణంగా సహకారశాఖ పనితీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. జిల్లాలో మ్యానువల్‌పద్దతిలో జరిగిన కార్యకలాపాల కారణంగా పలుసంఘాలపై ఆరోపణలు రావడం, అధికారులు విచారణలు జరిపిచర్యలు తీసుకున్న ఉదంతాలున్నాయి. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా పలుసంఘాల పనితీరుపై ఫిర్యాదులు పెద్దఎత్తున వస్తున్న కారణంగా ఆ శాఖ సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగానే అన్ని రకాల సహకార సంఘాల కార్యకలాపాలన్నింటినీ ఆన్‌లైన్‌లో చేపడుతున్నారు. సహకార సంఘాల రిజిస్ర్టేషన్‌లతో పాటు ఆ సంఘాల ఆర్థిక కార్యకలాపాలు, అధికారులు, సిబ్బంది  విధులు, బాధ్యతలు అలాగే సంఘాల ద్వారా చేపడుతున్న వివిధ రకాల కొనుగోళ్లు, వ్యాపారాలు లాంటి అంశాలన్ని ఇక ఆన్‌లైన్‌ పద్దతిలోనే నిర్వహించనున్నారు. దీని కోసం గానూ సహకారశాఖ ప్రత్యేకపోర్టల్‌ను రూపొందించింది. ఈ పోర్టల్‌ ద్వారా కార్యకలాపాలన్నీ నిర్వహించనున్నారు. ప్రస్తుతం సహకార సంఘాల రిజిస్ర్టేషన్‌లో తీవ్రజాప్యం ఏర్పడుతోంది. దీని కారణంగా సంఘాలు ఏర్పాటు చేసుకునే వారు తీవ్రఇబ్బందుల పాలవుతున్నారు. రిజిస్ర్టేషన్‌ల కోసం సహకార శాఖ కార్యాలయాల చుట్టూ కాళ్లు అరిగేలా తిరుగుతున్నారన్న ఆరోపణలున్నాయి. ఆన్‌లైన్‌ విధానం ద్వారా ఇక నుంచి సహకార సంఘాల రిజిస్ర్టేషన్‌ ప్రక్రియ కేవలం 20 రోజుల్లో పూర్తి కానుంది. ఈ - సహకార సేవాపోర్టల్‌లో రిజిస్ర్టేషన్‌ కోసం దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంది. ఇలా దరఖాస్తులు చేసుకున్న సొసైటీల వివరాలను పరిశీలించి అనుకూలత ఆధారంగా 20 రోజుల్లోనే రిజిస్ర్టేషన్‌ ప్రక్రియ పూర్తి చేయనున్నారు. 20 రోజుల్లోపే రిజిస్ర్టేషన్‌ ప్రక్రియ పూర్తయిన సహకార సంఘాలకు సర్టిఫికెట్లను కూడా జారీ చేయనున్నారు. అలాగే సహకార సంఘాల్లోని సభ్యుల అందరి వివరాలను కూడా నమోదు చేయనున్నారు. అన్‌లైన్‌ ప్రక్రియతో సహకారశాఖలో అన్ని వివరాలను ఈ - కోపరేటివ్‌ సేవా పోర్టల్‌ ద్వారా తెలుసుకునే అవకాశం ఏర్పడనుంది. 

సహకార సంఘాల రిజిస్ర్టేషన్‌ ఇక నుంచి సులభతరం

ఆన్‌లైన్‌ విధానంతో ఇక నుంచి సహకార సంఘాల ఏర్పాటు వాటి రిజిస్ర్టేషన్‌ ప్రక్రియ సులభతరం కానుంది. ఇప్పటి వరకు సంఘాల ఏర్పాటుతో పాటు రిజిస్ర్టేషన్‌ వ్యవహారం అనేక ఇబ్బందులకు కారణమవుతోంది. జాప్యం కారణంగా సహకార సంఘాలు ఏర్పాటు చేసుకునే వారంతా తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు. మానువల్‌ పద్దతి కారణంగా బోగస్‌ సంఘాలు ఏర్పడుతున్నాయన్న ఆరోపణలున్నాయి. ప్రభుత్వం అందించే ఆర్థిక సహకారం, ఇతర సబ్సిడీలు సైతం బోగస్‌సంఘాల ఏర్పాటుతో పక్కదోవ పడుతున్న సంగతి తెలిసిందే. అలాగే సంబంధిత సహకారశాఖ అధికారులకు సైతం సొసైటీల ఏర్పాటుపై సరియైున నియంత్రణ ఉండడం లేదంటున్నారు. సంఘాల పనితీరు వాటి కార్యకలాపాల పరిశీలన కూడా సాధ్య పడడం లేదు. ఆన్‌లైన్‌ విధానంతో కేవలం 20 రోజుల్లోనే సహకార సంఘాల రిజిస్ర్టేషన్‌ ప్రక్రియ పూర్తికానుంది. ప్రక్రియ పూర్తికాగానే సంఘాలకు వెంటనే ధృవీకరణ పత్రాలను జారీ చేయనున్నారు. దీంతో జాప్యం తొలగిపోవడమే కాకుండా 20 రోజుల్లోనే రిజిస్ర్టేషన్‌ వ్యవహారమంతా ముగియనుంది. 

పకడ్బందీ తనిఖీలు, ఆడిటింగ్‌

ఆన్‌లైన్‌ విధానంతో ఇక నుంచి సహకార సంఘాల తనిఖీలు, ఆడిటింగ్‌ వ్యవహారాలు పకడ్బందీగా జరగనున్నాయి. ఇప్పటి వరకు కొనసాగుతున్న మ్యానువల్‌ విధానంతో అనేక అక్రమాలు వెలుగు చూసిన సంగతి తెలిసిందే. సహకార సంఘాల కార్యకలాపాల్లో అక్రమాలకు మ్యానువల్‌ విధానం కారణమవుతోందన్న ఫిర్యాదులున్నాయి. ముఖ్యంగా ఆడిటింగ్‌ విషయంలో కూడా సంబంధిత శాఖలోని కొంతమంది సిబ్బంది అవకతవకలు కూడా వెలుగులోకి రావడం లేదు. అలాగే ఆర్థికపరమైన కార్యకలాపాలన్నీ ఇష్టా నుసారంగా సాగుతున్నాయన్న విమర్శలున్నాయి. ఆడిటింగ్‌ సమయంలో చేతివాటం ఎక్కువగా జరుగుతోందంటున్నారు. అధికారులు తనిఖీలు చేసే సమయంలో సహకా

 ర సంఘాల పాలకవర్గాలు, అలాగే కొంతమంది సిబ్బంది తమ చేతివాటం ప్రదర్శించి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారంటున్నారు. అయితే తనిఖీల సమయంలో జరుగుతున్న అక్రమాలన్నింటినీ ఉన్న తాధికారులు ప్రత్యేకపోర్టల్‌ద్వారా ఎప్పటిఎప్పుడు తెలుసుకునే అవకాశం ఉందంటున్నారు. ఆడిటింగ్‌ వ్యవహారాలను కూడా ఉన్నతాధికారులు కూర్చున్న చోటనే తెలుసుకునే అవకాశం ఉందంటున్నారు. 

దీని కారణంగా ఇక నుంచి ఎలాంటి అవకతవకలకు ఆస్కారం ఉండ బోదని, సంఘాల కార్యకలాపాలన్నీ ఎప్పటికప్పుడు తమకు సమాచార పరంగా అందుబాటులో ఉంటాయంటూ అధికారులు వెల్లడిస్తున్నారు. 

ఆన్‌లైన్‌తో పారదర్శకం

ఆన్‌లైన్‌ విధానంతో సహకార సంఘాల రిజిస్ర్టేషన్‌తో పాటు మిగతా వ్యవహారాలన్నీ పారదర్శకం కానున్నాయి. కొత్తసొసైటీల ఏర్పాటు సులభతరం కానుంది. ఈ - సహకార సేవాపోర్టల్‌ ద్వారా ప్రక్రియ కొనసాగనుంది. ఇక నుంచి సహకార వ్యవస్థ సులభతరం కోసమే ఆన్‌లైన్‌ విధానంను ప్రభుత్వం అమలు చేస్తోంది. 

- శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా సహకారశాఖ అధికారి 

Updated Date - 2021-10-17T06:19:09+05:30 IST